కోతి సాయం.. సింహం న్యాయం!

పూర్వం జంబుకావనం అనే అడవిలో ఒక కోతి ఉండేది. ఇతర జంతువులు ఏ సాయమడిగినా కాదనకుండా చేస్తుండేది. అందుకే, జీవులన్నీ దాన్ని పరోపకారి అని పిలుస్తుండేవి.ఓసారి ఒక పాము నీటిలో కొట్టుకుపోతూ కోతి సాయం కోరింది. అది కర్ర విసరడంతో దానిపైకి చేరి ప్రాణాలు దక్కించుకుంది. ఒక ఉడుత పిల్ల చెట్టుపైకి ఎక్కే క్రమంలో తేనెతుట్టెను కదిలించింది. దాంతో ఈగలన్నీ దాన్ని చుట్టుముట్టాయి. తల్లి దూరం నుంచి చూస్తున్నా

Updated : 20 Feb 2022 06:14 IST

పూర్వం జంబుకావనం అనే అడవిలో ఒక కోతి ఉండేది. ఇతర జంతువులు ఏ సాయమడిగినా కాదనకుండా చేస్తుండేది. అందుకే, జీవులన్నీ దాన్ని పరోపకారి అని పిలుస్తుండేవి.

ఓసారి ఒక పాము నీటిలో కొట్టుకుపోతూ కోతి సాయం కోరింది. అది కర్ర విసరడంతో దానిపైకి చేరి ప్రాణాలు దక్కించుకుంది. ఒక ఉడుత పిల్ల చెట్టుపైకి ఎక్కే క్రమంలో తేనెతుట్టెను కదిలించింది. దాంతో ఈగలన్నీ దాన్ని చుట్టుముట్టాయి. తల్లి దూరం నుంచి చూస్తున్నా.. కాపాడలేకపోయింది. అటుగా వచ్చిన కోతిని సాయం కోరడంతో అది వచ్చి.. ఎలాగోలా ఉడుత పిల్లను రక్షించి, తల్లి ఒడికి చేర్చింది.

ఒకరోజు కోతి దగ్గరకు పాము వచ్చి ‘కోతిబావా! ఎలుక ఒకటి ఇటు పరుగెడుతూ వచ్చింది. నువ్వు చూశావా?’ అని అడిగింది. కోతి ఏ సమాధానమూ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు పాము కోపంతో ‘ఛీ! నా నోటి దగ్గరి కూడును అందకుండా చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గులు ఈ లోకంలోనే లేరు’ అంటూ కోపగించుకుంది. అది విని కోతి నవ్వుకుంది.

ఆ తరువాత ఒకరోజు ఉడుత పిల్ల.. చెట్లమీద పాకుతూ.. వరసలో అటుగా వెళ్తున్న గండు చీమలను కాలితో తన్నసాగింది. అది చూసిన కోతి, వెంటనే వెళ్లి ఆ చీమలను కాపాడింది. ఉడుత పిల్లకు కోపం వచ్చి ‘నా ఆటకు నువ్వు అడ్డం వస్తున్నావు.. చీమలను తంతే నీకేంటి? నువ్వు అసలు మంచిదానివే కాదు’ అని మండిపడింది. దానికీ కోతి నవ్వుకుంది.

ఆ తర్వాత కోతి వల్ల లాభం పొందిన ఒక మొసలి దాని దగ్గరకు వచ్చి.. ‘కోతిబావా! కోతిబావా!! నన్ను నీ వీపుపైన ఎక్కించుకొని అడవి మొత్తం తిప్పి చూపించవా?’ అని అడిగింది. దానికి కోతి ఒప్పుకోలేదు. ‘అందరూ నువ్వు పరోపకారివి అంటుంటారు. ఇదేనా నీ ఉపకారం? గతంలో నిన్ను నా మీద ఎక్కించుకొని చెరువులో తిప్పింది మర్చిపోయావా?’ అని నిలదీసింది. దాని మాటలకు కోతి జవాబివ్వలేదు. దాంతో మొసలి కోపం తారస్థాయికి చేరింది. ‘మళ్లీ నీటిలోకి రా! నీ సంగతి చెబుతా’ అంటూ హెచ్చరించి వెళ్లిపోయింది.
మరుసటి రోజు పాము, ఉడుత పిల్ల, మొసలి కలిసి కోతి మీద మృగరాజుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాయి. వెంటనే, సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి ఆరోపణలను విన్న మృగరాజు.. కోతిని పిలిపించాడు. ఏనుగు మీద ఎక్కి అక్కడకు వచ్చింది కోతి. ‘ఈ మూడింటికీ అపకారం చేశావని ఆరోపిస్తున్నాయి. నీ సంజాయిషీ ఏంటి?’ అంటూ పాము, ఉడుత, మొసలి వైపు చూపించింది సింహం.

అప్పుడు కోతి ‘మృగరాజా! ఈ పాము ఎలుక కోసం నన్ను అడిగిన మాట వాస్తవమే. కానీ, దాని ఆచూకీ చెబితే ఇది ఎలుకను చంపేస్తుంది. అది కాకుండా పాముకు వేరే చోట ఆహారం దొరకొచ్చు. కానీ, ఎలుక ప్రాణం ఒకటే కదా. అంతకుముందే, తన గురించి చెప్పొద్దని ఎలుక నన్ను ప్రాధేయపడింది’ అంది కోతి. మరి నా సంగతేంటి అని ఉడుత పిల్ల అంటుండగానే, కోతి కల్పించుకొని ‘చెట్టు మీద నుంచి చీమలను కిందకు తోస్తుండటంతో వాటి కాళ్లూ, చేతులూ విరుగుతున్నాయి. అందుకే, చిన్నప్రాణుల జోలికిపోకుండా వాటిని కాపాడాను. అది కాకుండా వేరే ఆటలు బోలెడు ఉన్నాయి’ అంది.

‘ఇక మొసలి నాపైన ఎక్కుతాను అంటే కాదన్న మాట నిజమే. ఎందుకంటే, అప్పటికే మూడు రోజుల నుంచి నా ఆరోగ్యం బాగాలేదు. నీరసంగా ఉండటంతో దాని కోరిక కాదన్నాను. వీటికి నేను అనేకసార్లు సాయం చేశా. కానీ, అవన్నీ మర్చిపోయి ఒక్కసారి సహకరించక పోయేసరికి నామీద కోపం పెంచుకున్నాయి. అంత సాయం చేసిన నాకు అస్వస్థతగా ఉంటే.. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. నాకెంత బాధ కలగాలి?’ అంటూ వాపోయింది కోతి.

అప్పుడు వెంటనే కోతికి తగిన వైద్యం చేయాల్సిందిగా ఎలుగుబంటిని ఆదేశించింది సింహం. పాము, ఉడుత పిల్ల, మొసలిని మందలించడంతోపాటు కోతి మంచితనం తనకూ తెలుసుననీ చెప్పింది. ‘ఊబిలో మునిగిపోతున్న నాకు మర్రి ఊడ అందించి ఒడ్డుకు చేర్చింది ఈ కోతి’ అని గతంలో జరిగిన సంఘటనను వివరించింది సింహం.

‘ఎప్పుడూ ఇతరులకు సాయం చేసే వాళ్లను ఒక్క సంఘటనతో దుర్మార్గులుగా, స్వార్థపరులుగా చిత్రీకరించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వారు అలా ప్రవర్తించారో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆ తరవాతే నిర్ణయానికి రావాలి. తొందరపాటుతో అంతకుముందు చేసిన సాయాన్ని మరిచిపోయి.. దూషించడం, చాడీలు చెప్పడం చేయకూడదు’ అని అడవి జంతువులకు హితబోధ చేసింది మృగరాజు. 

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని