చేసిన మేలు!

ఉత్తరవాహిని నదీ తీరాన ఓ చిన్న అడవి ఉంది. దీన్ని ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అందుకే ఆ ఊళ్లలోని కొందరు తరచుగా అడవికి వేటకు వెళుతుండేవారు. క్రూరమృగాల బెడద లేకున్నా.. ఈ వేటగాళ్లతో అడవిలోని జంతువులు, పక్షులకు చాలా ఇబ్బందులు వస్తుండేవి. అందుకే అవి నిత్యం చాలా అప్రమత్తంగా ఉండేవి.

Published : 05 Feb 2023 16:15 IST

త్తరవాహిని నదీ తీరాన ఓ చిన్న అడవి ఉంది. దీన్ని ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అందుకే ఆ ఊళ్లలోని కొందరు తరచుగా అడవికి వేటకు వెళుతుండేవారు. క్రూరమృగాల బెడద లేకున్నా.. ఈ వేటగాళ్లతో అడవిలోని జంతువులు, పక్షులకు చాలా ఇబ్బందులు వస్తుండేవి. అందుకే అవి నిత్యం చాలా అప్రమత్తంగా ఉండేవి.

ఒక నేరేడు చెట్టు మీద ఓ పాలపిట్ట, గోరువంక తమ తమ కుటుంబాలతో నివసిస్తుండేవి. అవి రెండూ ఎప్పటి నుంచో స్నేహితులు. రోజూ ఆహారానికి కలిసే వెళుతుండేవి. ఈ మధ్యనే పాలపిట్ట, గోరువంక గుడ్లు పెట్టి పొదిగాయి. చిన్న చిన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవి.

ఒకసారి వేటగాడి బాణానికి గోరువంక భర్త బలైపోయింది. అప్పటి నుంచి అది మరింత జాగ్రత్తగా పిల్లలను చూసుకుంటూ ఉండేది. ఉదయాన్నే ఆహారాన్వేషణకు పోయి.. దొరికింది పట్టుకుని.. వెంటనే గూటికి చేరేవి పాలపిట్ట, గోరువంక. ఒక రోజు రెండూ ఆహారం కోసం బయలుదేరాయి. ఎంత దూరం వెళ్లినా వాటికి ఏమీ దొరకలేదు. చివరికి ‘నువ్వు అటు వెళ్లు. నేను ఇటు వెళతాను. ఎవరికి ఆహారం దొరికినా ముందు గూటికి చేరుకుని పిల్లలకు పెడదాం’ అంది గోరువంక. ‘సరే.. కానీ జాగ్రత్త’ అంది పాలపిట్ట.
రెండూ చెరోవైపు ఎగిరాయి. కొంతదూరంలోనే పాలపిట్టకు మంచి జొన్నలు దొరికాయి. ఆ కంకిని నోట కరుచుకుని గూడుకు చేరుకుంది. అప్పటికి ఇంకా గోరువంక రాలేదు. కొన్ని గింజలు దాని పిల్లలకూ అందించింది పాలపిట్ట.

‘మా అమ్మేది?’ అని అమాయకంగా అవి ప్రశ్నించాయి. ‘అమ్మ మీకోసం ఆహారం తేవడానికి వెళ్లింది.. ఈ లోగా ఈ జొన్నలు తినండి. మీ అమ్మ తెచ్చింది తర్వాత తిందురు’ అంది. ఎంతసేపైనా గోరువంక రాలేదు. పిల్లలు ఆందోళన చెందాయి. పాలపిట్ట కూడా భయపడింది. ‘ఏమైందో.. ఏమో’ అనుకుంటూ గోరువంకను వెతుక్కుంటూ బయలుదేరింది. ఓ చోట వేటగాడి బాణం దెబ్బతిని కొన ఊపిరితో కనిపించింది గోరువంక.

‘మిత్రమా! నా అజాగ్రత్త నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది. వేటగాడు చల్లిన పెసరగింజలకు ఆశపడి వాలాను. వాడి బాణం దెబ్బకు దొరికిపోయాను. నా పిల్లలను నువ్వే జాగ్రత్తగా చూసుకో.. ఏ క్షణంలో అయినా వేటగాడు ఇక్కడికి రావొచ్చు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని గోరువంక చెప్పి కన్ను మూసింది.

పాలపిట్ట బాధగా గూడుకు చేరుకుంది. ‘మా అమ్మ ఏది?’ అని గోరువంక పిల్లలు అడిగాయి. ‘అమ్మ మీ కోసం మంచి ఆహారం తేవడానికి చాలా దూరం వెళ్లింది. అక్కడ మీ బంధువులను కలిసి వస్తుందట. అంతవరకు మిమ్మల్ని చూసుకోమని నాకు చెప్పింది. మీరేమీ బెంగ పెట్టుకోవద్దు’ అంది పాలపిట్ట.

ఆ రోజు నుంచి గోరువంక పిల్లలను పాలపిట్టే చూసుకునేది. తమ తల్లి గోరువంక పిల్లలను అంత ముద్దుగా చూడటం పాలపిట్ట పిల్లలకు నచ్చేది కాదు. ‘వాటి గురించి మనకెందుకమ్మా’ అంటూ ఉండేవి. ‘గోరువంక పిల్లలకు బయటకు వెళ్లి బతకడం నేర్పించాలి. లేకపోతే నా పిల్లలు నన్ను నిందిస్తాయి’ అనుకుంది పాలపిట్ట.

ఓ రోజు పాలపిట్ట, గోరువంక పిల్లలతో... ‘పిల్లలూ! మీరిక బయటకు రండి. మీ ఆహారం మీరే సంపాదించుకోవాలి. అమ్మ వచ్చేటప్పటికి మీరు ప్రయోజకులుగా కనిపించాలి’ అని చెప్పింది. అడవిలో ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పించింది. అవి బయటకు వెళ్లగానే వాటికి తెలియకుండా వాటి వెనకే వెళ్లి గమనించింది. గోరువంక పిల్లలు, పాలపిట్ట చెప్పినట్లే చాలా జాగ్రత్తగానే ఉన్నాయి. ‘అమ్మ గోరువంక పిల్లలకు అన్నీ చెబుతోంది కానీ మనకు చెప్పడం లేదు. అమ్మకు మనమంటే ఇష్టం లేదు’ అనుకున్నాయి పాలపిట్ట పిల్లలు. అన్నీ కూడబలుక్కొని ఓ రోజు పాలపిట్ట లేని సమయంలో బయటకు వెళ్లిపోయాయి. ఆహారంతో ఇంటికి చేరిన పాలపిట్టకు, తన పిల్లలు కనిపించకపోవడంతో అది భయపడి పోయింది. అప్పుడే గూడు చేరాయి గోరువంక పిల్లలు. పాలపిట్ట ఆందోళనతో ఉండటం గమనించాయి. విషయం ఏంటో కనుక్కొని పాలపిట్ట పిల్లల్ని వెతకడానికి బయలుదేరాయి.

ఒకచోట పాలపిట్ట పిల్లలు దిగులుగా ఉన్నాయి. అందులో ఒకటి ఒక ముళ్ల పొదలో చిక్కుకుపోయింది. బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తోంది. మిగిలినవి దాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక అలాగే చూస్తున్నాయి. గోరువంకలు, ముళ్లపొదల్లో చిక్కుకున్న పాలపిట్ట పిల్లను నేర్పుగా బయటకు తీశాయి. అప్పుడే ఓ వేటగాడు అటుగా వచ్చాడు. పాలపిట్ట పిల్లలను మాట్లాడవద్దని చెప్పి వాటిని పక్కనే ఉన్న పొదలో దాచాయి గోరువంక పిల్లలు. వేటగాడు అక్కడి నుంచి వెళ్లిపోగానే అవన్నీ గూటికి చేరాయి. పిల్లలను చూడగానే పాలపిట్ట సంతోషపడింది.

జరిగింది తెలుసుకుని ‘ఈ రోజు మీ అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే.. ’ అని ఆగిపోయింది పాలపిట్ట. ‘మా అమ్మలా వేటగానికి చిక్కి ప్రాణాలు వదిలేవారు’ అన్నాయి గోరువంకలు. ‘మీకెలా తెలిసింది?’ అని అడిగింది పాలపిట్ట.
‘మాకు ఆ మాత్రం తెలియదా..? మాకు చుట్టాలు లేరు. మా నాన్న చనిపోయినప్పుడే ఎవరూ రాలేదు. మా అమ్మ.. ఏ రోజూ మమ్మల్ని వదిలి దూరంగా వెళ్లేది కాదు’ అన్నాయి గోరువంక పిల్లలు.

‘మీకు అన్నీ తెలుసు. అందుకే నా పిల్లలను కాపాడగలిగారు’ అని కృతజ్ఞతలు చెప్పింది పాలపిట్ట. ‘మమ్మల్ని క్షమించండి. మీ విషయంలో మేం పొరపాటు పడ్డాం. ఈ రోజు మీరే మా ప్రాణాలు కాపాడారు’ అన్నాయి పాలపిట్ట పిల్లలు. ఆ రోజు నుంచి అవన్నీ కలిసిమెలసి జీవనం సాగించాయి.

- కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని