మంచి మామిడిచెట్టు

అవంతీపుర రాజ్యాన్ని సుగుణోత్తముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. రాజుకు ప్రకృతిని ఆస్వాదించడం అంటే మహా ఇష్టం. అందుకే ఒక అందమైన ఉద్యానవనాన్ని కోటకు పక్కగా నిర్మించుకున్నాడు. ఆ ఉద్యానవనం అందమైన పూల మొక్కలు, పండ్ల చెట్లతో మనోహరంగా ఉండేది.

Updated : 02 May 2022 03:02 IST

అవంతీపుర రాజ్యాన్ని సుగుణోత్తముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. రాజుకు ప్రకృతిని ఆస్వాదించడం అంటే మహా ఇష్టం. అందుకే ఒక అందమైన ఉద్యానవనాన్ని కోటకు పక్కగా నిర్మించుకున్నాడు. ఆ ఉద్యానవనం అందమైన పూల మొక్కలు, పండ్ల చెట్లతో మనోహరంగా ఉండేది.

తీరిక సమయాల్లో రాజు ఉద్యానవనంలో తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడి పూలనుంచి వెలువడే సువాసనను పీలుస్తూ సేదతీరేవాడు. అక్కడి పండ్లను కూడా ఇష్టంగా తింటూ ఉద్యానవనం అంతా కలియతిరిగే వాడు. అక్కడి మామిడి చెట్టు పండ్లంటే రాజుకు మహాఇష్టం. ఆ రుచి మరెక్కడా దొరికేది కాదు. అందుకే అక్కడి తోటమాలి రంగయ్యకు, ఎవరూ మామిడి పండ్లు కోయకుండా జాగ్రత్తగా కాపలా కాయాలని పదే పదే చెప్పేవాడు.

రంగయ్య కూడా ఆ చెట్టుపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేవాడు. ఉద్యానవనంలోకి రావడానికి మనుషులెవరూ సాహసించేవారు కాదు. కానీ కోతులు, ఉడతలు, రామచిలుకల్ని ఎవరూ ఆపలేరు కదా...! అవి ఆ మామిడి పండ్లను ఇష్టంగా తింటూ ఉండేవి. రంగయ్య వాటిని బెదరగొట్టడానికి ప్రయత్నం చేసినా గుట్టు చప్పుడు కాకుండా వాటి పని అవి కానిచ్చేవి.  

ఆ మామిడి పండ్ల రుచి గురించి తెలుసుకున్న ఓ కాకి, వాటిని తినడానికి ప్రయత్నిస్తూ విఫలమయ్యేది. ఆ కాకి.. ‘కావ్‌...కావ్‌’ అని అరిచే అరుపులే దానికి కారణం. ఆ అరుపులు వినగానే రంగయ్య కర్రతో వచ్చి దాన్ని బెదరగొట్టే వాడు. చెట్టుపై ఉన్న కోతులు కూడా కాకిని దగ్గరకు రానీయకుండా బెదరగొట్టేవి.

పాపం.. కాకి భయపడి వెనక్కి వెళ్లిపోయేది. ఆ మామిడి పండ్ల రుచిని చూడాలనే కోరిక మాత్రం తీరేది కాదు దానికి. అయినా నిరాశ పడకుండా నిత్యం ప్రయత్నం చేసేది కాకి. దీన్ని రోజూ గమనించేది మామిడి చెట్టు. తన పండ్ల రుచిని కాకికి అందించాలని అనుకుంది.

ఓ రోజు.. ‘కావ్‌.. కావ్‌’ అని ఎప్పటిలాగానే అరుచుకుంటూ కాకి, మామిడి చెట్టుపై వాలింది. తోటమాలి రంగయ్య కర్రను అందుకుని కాకిని బెదరగొట్టడానికి పరిగెత్తుకుంటూ బయలుదేరాడు. అప్పటికి ఇంకా కోతులు, ఉడతలు, రామచిలుకలు చెట్టుపై లేవు.

తన కొమ్మపై వాలిన కాకిని ఉద్దేశించి మామిడి చెట్టు ఇలా అంది. ‘‘ఓ కాకీ.. నా పండ్లను తినాలనే నీ కోరికను నేను గమనిస్తున్నాను. రేపు కోతులు రాకముందే ఇక్కడకు వచ్చేయి. నేను నా పండ్లను నేల మీదకు రాలుస్తాను. అదిగో రంగయ్య వస్తున్నాడు. త్వరగా వెళ్లిపో... ‘కావ్‌..కావ్‌..’అని అరవకుండా రావడం మాత్రం మరిచిపోవద్దు...!’’ అన్న మామిడి చెట్టు మాటలకు సంతోషించింది కాకి.

‘చెట్టమ్మా... నువ్వు ఎంతో మంచిదానివి. నా కోరికను అర్థం చేసుకున్నావు. నీ పండ్లలాగా నీ మనసు కూడా ఎంతో తియ్యనైనది. నువ్వు అన్నట్టుగా రేపు ఉదయం అరవకుండా వస్తాను’ అంది కాకి. రంగయ్య వస్తుండటం గమనించి ఎగిరిపోయింది కాకి.
అప్పటికే చెట్టును చేరిన కోతులు, ఉడతలు, రామచిలుకలు మాత్రం రంగయ్య కంట పడకుండా మామిడి పండ్లను తినేస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం కాకి అరవకుండా మామిడి చెట్టు దగ్గరకు చేరింది. కాకి వచ్చిన విషయాన్ని గమనించిన మామిడి చెట్టు ఓ పండును రాల్చింది. దాన్ని నోట కరుచుకుని కాకి దూరంగా ఎగిరిపోయింది. ఉద్యానవనంలో దూరంగా మర్రి చెట్టుపై కూర్చుని మామిడి పండును ఇష్టంగా తింది. ఎన్నో రోజులుగా తినాలనుకున్న మామిడిపండు ఎట్టకేలకు తనకు దక్కింది. అందుకు కారణమైన మామిడి చెట్టుకు మనసులోనే మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంది కాకి. మామిడి చెట్టు కూడా కాకి కోరికను నెరవేర్చానని సంతోషించింది.

ప్రకృతిలో జీవులన్నీ సంతోషంగా ఉండాలని, అందరికీ కోరుకున్నవన్నీ దక్కాలనేది మామిడి చెట్టు కోరిక. కాకి మామిడి పండు తిన్న తర్వాత మామిడి టెంకను అడవిలో వదిలింది. కొన్ని రోజుల్లోనే మామిడి మొక్క నేలను చీల్చుకుని బయటకు వచ్చింది. కొన్నాళ్లకు వృక్షంగా మారింది. అదే తియ్యని మామిడిపండ్ల రుచితో అడవిలోని జంతువులు, పక్షుల మనసును దోచుకుంది మామిడి చెట్టు.

ఇప్పుడు ఎవరి నిర్బంధాలూ లేవు. మామిడి పండ్ల రుచిని జంతువులు, పక్షులన్నీ స్వేచ్ఛగా ఆస్వాదిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కాకి, ఉద్యానవనంలోని మామిడి చెట్టు దగ్గరకు వచ్చింది. కాకిని చూసి సంతోషించింది మామిడి చెట్టు. ‘ఓ కాకీ.. ఎలా ఉన్నావు? నా మామిడి పండ్ల రుచి నీకు నచ్చలేదా? నువ్వు ఈ మధ్య కనపడటంలేదు?’ అన్నది. అందుకు కాకి.. ‘చెట్టమ్మా... నీ పండ్ల రుచి అద్భుతం. కొందరికే ఈ రుచి పరిమితం కాకూడదు అని నీ విత్తనాన్ని అడవిలో వేశాను. నీ రూపంలో మరో మామిడి చెట్టు పెరిగింది. అడవిలోని జంతువులు, పక్షులకు రుచికరమైన మామిడి పండ్లను అందిస్తోంది’ అంది. కాకి మాటలు విన్న మామిడి చెట్టు మనసు ఆనందంతో పులకించింది. కాకికి తన కృతజ్ఞతలు చెప్పింది.  

- వడ్డేపల్లి వెంకటేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని