అత్యాశే పట్టించింది!

వర్తక కార్యకలాపాలకు అత్యంత అనుకూలమైన నగరం రామనాథపురం. ఎక్కడెక్కడి నుంచో నిత్యం అనేక మంది వర్తకులు వచ్చి వెళ్తుంటారు. వారిలో కొందరికి ఒకటి, రెండు రోజులు అక్కడే బస చేయాల్సిన అవసరం పడుతుంది. అటువంటి వారి కోసం అక్కడ సీతప్ప అనే వ్యక్తి ఒక పూటకూళ్ల ఇల్లు నడుపుతుండేవాడు.

Published : 19 Jun 2022 02:02 IST

వర్తక కార్యకలాపాలకు అత్యంత అనుకూలమైన నగరం రామనాథపురం. ఎక్కడెక్కడి నుంచో నిత్యం అనేక మంది వర్తకులు వచ్చి వెళ్తుంటారు. వారిలో కొందరికి ఒకటి, రెండు రోజులు అక్కడే బస చేయాల్సిన అవసరం పడుతుంది. అటువంటి వారి కోసం అక్కడ సీతప్ప అనే వ్యక్తి ఒక పూటకూళ్ల ఇల్లు నడుపుతుండేవాడు. సీతప్ప మంచి వ్యాపార దక్షత కలవాడు. బస కోసం వచ్చే వారికి సకల మర్యాదలు చేసి, మంచి ఆహారం అందించి వారి దగ్గర నుంచి కాసిన్ని ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. ఒకరోజు రామనాథపురానికి వివిధ వ్యాపారాల నిమిత్తం వేర్వేరు వర్తకులు సోముడు, మహేంద్రుడు వచ్చారు. అక్కడ ఇద్దరి వ్యాపార పనులు ముగిసేసరికి చీకటి పడింది. దాంతో ఇద్దరూ పూటకూళ్ల ఇళ్ల కోసం వెతకసాగారు. ఆ క్రమంలో ఓ వీధిలో వారిద్దరూ తారసపడి పరిచయం చేసుకున్నారు. ఇద్దరూ వసతి కోసమే వెతుకుతున్నారని తెలుసుకొని.. అక్కడి వారిని అడుగుతూ కలసి వెళ్లారు. ఇంతలో ఒకరు సీతప్ప గురించి చెప్పడంతో.. వారు  ఆ రాత్రికి అక్కడే బస చేయాలని నిర్ణయించుకున్నారు. సీతప్ప దగ్గరకు వెళ్లి అడిగారు.

వర్తకులిద్దరూ కలిసి రావడం, బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్లా మాట్లాడుకోవడం చూసిన సీతప్ప.. వారు మంచి స్నేహితులని భావించాడు. అతిథులను బాగా ఆదరించి, వారు అడిగిన వంటకాలను చేసి పెట్టాడు. తినడం అయ్యాక.. వారు నిద్రించడానికి ఒక గదిని చూపించి తాళాలిచ్చాడు. తరవాత తన గదిలోకి వెళ్లిపోయాడు సీతప్ప. తెల్లవారుజామున వర్తకులకు ఏవో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. బయటికెళ్లి చూస్తే.. సీతప్ప గదిలోని బీరువా నుంచి చెల్లాచెదురుగా పడి ఉన్న దుస్తులు కనిపించాయి. అంతలో ఎవరో దొంగతనం చేశారని విని వారిద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు.

చోరీ విషయాన్ని రచ్చబండ వద్దకు తీసుకెళ్లాడు సీతప్ప. అక్కడికి న్యాయాధికారి రాగానే అసలేం జరిగిందని ప్రశ్నించాడు. ‘రాత్రి ఇద్దరు వర్తకులకు నేను ఆశ్రయమిచ్చాక.. ఇంటి తలుపునకు లోపల వైపు నుంచి తాళం వేసి.. నా గదిలోకి వెళ్లి నిద్రపోయా. నా ఇంట్లోకి వచ్చేందుకు వేరే మార్గం లేదు. వచ్చినట్టు ఆనవాళ్లు కూడా లేవు.. కాబట్టి ఈ ఇద్దరూ కలసి నా డబ్బును దొంగిలించి, కిటికీలోంచి వేరేవారికిచ్చి ఉండవచ్చు’ అనుమానం వ్యక్తం చేశాడు సీతప్ప. ఆ మాటలు వినగానే వర్తకులిద్దరూ కంగుతిన్నారు. ‘చోరీకి, మాకూ ఎలాంటి సంబంధమూ లేదు. అన్యాయంగా మమ్మల్ని ఇందులో ఇరికించాలని చూస్తున్నారు’ అంటూ వాపోయారు. న్యాయాధికారి స్పందిస్తూ ‘ఈ రాత్రి కూడా వారిని మీ ఇంట్లోనే ఉండనివ్వు. రేపు ఉదయం వీరిలో దొంగతనం చేసిందెవరో నేను కనిపెడతా’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. న్యాయాధికారి నిర్ణయం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అందరూ ఆ రాత్రి నిద్రపోయారు. ఉదయమే రచ్చబండ దగ్గరకు వచ్చారు. కాసేపటికి వచ్చిన న్యాయాధికారి ‘నిన్న జరిగిన సంఘటనలో సీతప్పే దొంగ’ అంటూ తీర్పునిచ్చాడు. అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు.

‘నిన్న రాత్రి అందరూ నిద్రపోయాక.. నేను కొన్ని బంగారు ఆభరణాలూ, నాణేలనూ రహస్యంగా సీతప్ప ఇంట్లో పెట్టించాను. ఒకేసారి అంత సొమ్ము చూసిన సీతప్ప, ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లి తన బీరువాలో దాచాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని పరాయి సొమ్ముకు ఆశపడిన అతడే.. అత్యాశతో తన డబ్బు తానే చోరీ చేసి, ఆ నేరాన్ని వర్తకుల మీద మోపాడు’ అంటూ వివరించాడు. అందుకు నగర బహిష్కరణ శిక్ష విధించాడు. తన బండారం బయటపడటంతో క్షమించమని కోరాడు సీతప్ప. తప్పు తెలుసుకున్న సీతప్పను వదిలిపెట్టాలని వర్తకులు కోరడంతో.. మొదటి పొరపాటుగా భావించి సరేనన్నాడు న్యాయాధికారి. అప్పటి నుంచి వసతి కోసం వచ్చే వర్తకులను అతిథుల్లా చూసుకోసాగాడు సీతప్ప.

- సింగంపల్లి శేషసాయి కుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని