సాయమే మిన్న!

అనగనగా ఒక అడవి. అందులో నివసించే ఒక కోతికి బాగా ఆకలి అవుతోంది. అలవాటు ప్రకారం పెద్ద రావిచెట్టు కొమ్మ మీద కూర్చొని ఎదురు చూడసాగింది. పక్కనే ఉన్న కాలిబాట మీదుగా రాకపోకలు సాగించే వారు ఆ రావి చెట్టు కిందే తమతో తెచ్చుకున్న ఆహారం తింటుంటారు. సమీపంలోనే ఉన్న కొలనులో దాహం తీర్చుకొని.. అక్కడే కాసేపు విశ్రమిస్తుంటారు. 

Published : 30 May 2022 00:42 IST

అనగనగా ఒక అడవి. అందులో నివసించే ఒక కోతికి బాగా ఆకలి అవుతోంది. అలవాటు ప్రకారం పెద్ద రావిచెట్టు కొమ్మ మీద కూర్చొని ఎదురు చూడసాగింది. పక్కనే ఉన్న కాలిబాట మీదుగా రాకపోకలు సాగించే వారు ఆ రావి చెట్టు కిందే తమతో తెచ్చుకున్న ఆహారం తింటుంటారు. సమీపంలోనే ఉన్న కొలనులో దాహం తీర్చుకొని.. అక్కడే కాసేపు విశ్రమిస్తుంటారు. 

ఆ కోతి రోజూ వారిని చూస్తూ ఉంటుంది. బాటసారులు దయతలచి పెట్టిన ఆహారం తింటూ.. ఆకలి తీర్చుకుంటోంది. కానీ, ఆరోజు మిట్టమధ్యాహ్నమైనా ఎవరూ ఆ మార్గంలో రాలేదు. ఆహారం దొరక్కపోయే సరికి.. ఆకలితో నకనకలాడసాగింది కోతి. కనీసం కొన్ని నీళ్లయినా తాగుదామని చెట్టు మీద నుంచి ఒక్కసారిగా కిందకు దూకడంతో కాలికి ముల్లు గుచ్చుకుంది. లోతుగా దిగడంతో నొప్పితో విలవిల్లాడింది. ఆ బాధతోనే కుంటుతూ, గెంతుతూ కొలను వద్దకు వెళ్లింది. గొంతు తడిచాక.. కాస్త ఉపశమనం కలిగింది.

కొలను ఒడ్డున కూర్చొని మిత్రుల కోసం ఎదురు చూడసాగింది. అదే సమయంలో ఒక కుందేలు అటుగా రావడం గమనించింది. దాన్ని చూడగానే కోతికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ‘కుందేలు తమ్ముడూ.. నా కాలికి ముల్లు గుచ్చుకుంది. కాస్త దాన్ని తీయవా’ అంటూ దీనంగా అడిగింది. ఉలుకూ, పలుకూ లేకుండా ముందుగా కొలనులోని నీళ్లు తాగింది కుందేలు. దప్పిక తీరాక.. ‘నేను నీ కాలు పట్టుకోవాలా.. అందులోని ముల్లు తీయాలా?’ అంటూ కోతిని అవహేళన చేసింది. ‘నేను ఎలా ఎగురుతున్నానో చూడు’ అన్నట్టుగా చెంగున ఎగిరి వెళ్లి పోవాలనుకుంది. కానీ, ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది’ అన్నట్లు.. అది జారి కొలనులో పడిపోయింది. 

అది మామూలు కొలను కాదు. దాని మధ్యలో ఓ పెద్ద ఊబి ఉంది. కుందేలు ఎంత ప్రయత్నించినా నీళ్లలోంచి బయటకు రాలేకపోతోంది. అహం అడ్డు రావడంతో, కోతిని సాయం చెయ్యమని అడగలేక పోయింది. కుందేలు ప్రాణాపాయ స్థితిని అర్థం చేసుకుంది కోతి. అది భయంతో మాట్లాడలేకపోతోందని గ్రహించి, ఎలాగైనా కాపాడాలనుకుంది. తన కాలి నొప్పిని లెక్క చేయకుండా పరుగెత్తింది. ఎండిపోయిన ఓ చెట్టుకున్న కొమ్మను తీసుకొచ్చింది. తానో చివర పట్టుకొని, మరో చివరను కుందేలుకు అందించింది. చనిపోతానేమోనన్న భయంతో కొమ్మ చివరను ఒడిసిపట్టుకుంది కుందేలు. కోతి తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి కుందేలును కొలనులోంచి బయటకు లాగింది. నొప్పితో నీరసించిన కోతి, భయంతో అలసిపోయిన కుందేలు.. రెండూ ఒడ్డున సొమ్మసిల్లి పడిపోయాయి. 

కాసేపటి తర్వాత ముందుగా తేరుకున్న కుందేలు.. ముల్లు గుచ్చుకున్న కోతి కాలి నుంచి రక్తం కారుతుండటం చూసి చలించిపోయింది. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనే విషయం గుర్తొచ్చింది. పక్కనే ఉన్న కంప నుంచి ఒక పెద్ద ముల్లును విరిచి తీసుకొచ్చింది. కోతి కాలును ఒడుపుగా పట్టుకొని ముల్లు తీయసాగింది కుందేలు. బాధపడుతూనే తన కాలి ముల్లు తీస్తున్న కుందేలు వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది కోతి. 

ముల్లు తీసిన తరవాత, కొలను ఒడ్డున దొరికిన చిన్న గుడ్డ పీలికను కోతి కాలుకు కడుతూ.. ‘నేస్తమా! నువ్వు అడిగినా నేను సాయం చెయ్యలేదు. కానీ, నేను అడక్కపోయినా నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. ఎందుకు?’ అని అడిగింది కుందేలు. ‘మిత్రమా! ఒకరిని సాయం అడగాలన్నా.. ఒకరికి సాయం చేయాలన్నా మనలో అహం ఉండకూడదు. అది అత్యంత ప్రమాదకరం. చరిత్రలో శ్రీరామచంద్ర ప్రభువు, సీతాదేవి అన్వేషణలో వానరుల సాయం తీసుకున్నది మనందరికీ తెలిసిందే. వానరులు వారధి కడుతుంటే ఉడుత కూడా తన వంతు సాయం చేసింది. సింహం వలలో చిక్కుకుంటే చిట్టెలుక దాన్ని కొరికి సాయం చేసింది కదా! ఇవన్నీ మనకు నేర్పే పాఠం ఒకటే. మానవులకైనా, జంతువులకైనా ఉండేది ఒకే ఒక ప్రాణం. సాయం చెయ్యడానికి చిన్నా పెద్దా అనే తేడా లేదు’ వివరించింది కోతి. 

 ‘ఒక్కోసారి ప్రమాదంలో ఉన్నవారు సాయం చెయ్యమని అడిగే స్థితిలో ఉండకపోవచ్చు. ప్రమాదంలో ఉన్నారని మనం గ్రహించినప్పుడు వారు అడిగినా, అడక్కపోయినా సాయం చెయ్యడం మన ధర్మం. ఇది నా తల్లిదండ్రులు నాకు చెప్పిన హితవు. అందుకే నిన్ను కాపాడాను. అహం వద్దు.. సాయం ముద్దు’ అంటూ కోతి తన అనుభవాలను వివరించింది. కుందేలుకు అహంతో మూసుకుపోయిన కళ్లు తెరుచుకున్నాయి. ‘ఇక ముందు అలా నడుచుకోను. అహం వీడి అందరితో కలిసి ఉంటూ, సాయం చేస్తూ.. బతుకుతాను’ అంటూ దండం పెట్టింది కుందేలు.

- చెన్నూరి సుదర్శన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని