ఉల్లి పాఠం!

అది ఓ కూరగాయల తోట. ఒక రైతు బీరకాయ, పొట్లకాయ, సొరకాయ పాదులతోపాటు వంగ, బెండ పెంచుతున్నాడు. వాటి మధ్యలో ఉల్లి మెుక్కలను సాగు చేయసాగాడు. భూమిపై భాగంలో కాస్తున్న కూరగాయలన్నీ తమ పుట్టుక గొప్పదిగా భావించేవి. భూమి లోపల పెరిగే ఉల్లిని మాత్రం, అవన్నీ చిన్నచూపు చూస్తుండేవి.

Published : 11 Aug 2022 00:24 IST

అది ఓ కూరగాయల తోట. ఒక రైతు బీరకాయ, పొట్లకాయ, సొరకాయ పాదులతోపాటు వంగ, బెండ పెంచుతున్నాడు. వాటి మధ్యలో ఉల్లి మెుక్కలను సాగు చేయసాగాడు. భూమిపై భాగంలో కాస్తున్న కూరగాయలన్నీ తమ పుట్టుక గొప్పదిగా భావించేవి. భూమి లోపల పెరిగే ఉల్లిని మాత్రం, అవన్నీ చిన్నచూపు చూస్తుండేవి. కాపుకొచ్చిన కూరగాయలన్నీ వాటి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాయి.

‘నా అంత పొడగరి మీలో ఎవ్వరూ లేరు’ అంటూ పొగరుగా చెప్పుకొంది పొట్లకాయ.
‘జ్వరం వచ్చినోళ్లకు నా కూరే పథ్యం అవుతుంది’ అని బడాయిలకు పోయింది బీరకాయ.

‘నాజూకు తనానికి నేనే చిరునామా’ అంటూ కోతలు కోసింది సొరకాయ.
‘నెత్తిన కిరీటం ఉన్న కూరగాయను నేనే’ అని మిడిసిపడింది వంకాయ.

‘తెలివితేటలు పెరగాలంటే నా కూరను మించిన మందు ఇంకోటి లేదు’ బీరాలు పలికింది బెండకాయ.
ఈ కబుర్లు వింటున్న ఉల్లిపాయ కూడా ఆ కూరగాయలతో మాట్లాడాలని తహతహలాడింది. భూమి లోపల నుంచే ‘మిత్రులారా.. నన్ను బయటకు లాగరా..! మీతో ముచ్చట్లాడాలని ఉంది’ అంటూ పలకరించింది.

‘కంపుగొట్టుదానవు నువ్వు. మాకు ఎలా మిత్రుడవవుతావు?’ ఈసడింపుగా అంది పొట్లకాయ.
‘ఒళ్లంతా పొరలే ఉన్న నీకు.. మాతో మాటలేమిటి?’ పెదవి విరిచింది బీరకాయ.

‘నిన్ను తరిగేవాళ్లకి కన్నీరు తెప్పించే కఠిన హృదయురాలివి. నీకు మాతో సరిపడదు’ అంటూ తెగేసి చెప్పింది సొరకాయ.
‘మట్టిలో మునిగే నీతో మాకు ముచ్చట్లేమిటి?’ అని విరుచుకుపడింది వంకాయ.

‘మేమే లేకపోతే నీకు బతుకే లేదు’ దెప్పిపొడిచింది బెండకాయ. మిగతా కూరగాయలన్నీ ఘొల్లున నవ్వాయి.

వాటన్నింటి మాటలతో బాధపడింది ఉల్లిపాయ. ‘మేలుకోరే వాడే మిత్రుడు. మీ గొప్పతనానికి పరోక్ష సాయం అందిస్తున్న నన్ను అవమానించడం ఎంత వరకు సమంజసం? మీతో పాటు ఈ తోటలో పుట్టినదాన్నేగా నేను కూడా? మరెందుకు చులకనగా చూస్తారు?’ అని నిగ్గదీసింది.

‘ఒకేచోట పుట్టినంత మాత్రాన, అందరూ సమానమెలా అవుతారు? మా గొప్ప మాకు ఉంటుంది’ మిడిసిపడుతూ బదులిచ్చింది వంకాయ.
‘బంగారు కంచానికైనా గోడ ఊతం అవసరమే! ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడే.. అందరికీ విలువలు పెరుగుతాయి’ అంటూ వాస్తవాన్ని బోధించింది ఉల్లిపాయ.

మిగిలిన కూరగాయలకు ఒళ్లు మండింది.

‘ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ.. నీవెంత ఉడికినా నీ కంపు పోదు’ అంటూ వెక్కిరిస్తూ ఉల్లిపాయను ఆటపట్టించాయి కూరగాయలు. ‘ఏదో ఒక రోజు.. నా విలువేంటో మీకే తెలిసొస్తుందిలే’ అంటూ వెక్కివెక్కి ఏడ్చింది ఉల్లిపాయ.

ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో కూరగాయలన్నీ మౌనంగా ఉండిపోయాయి. రైతు, రైతు భార్య గంపతో పాటు వచ్చి కూరగాయలను పరిశీలనగా చూశారు. భార్య కూరగాయలను తెంపుతుండగా.. రైతు దృష్టి నవనవలాడుతున్న వంకాయలపైన పడింది.

‘ఈ రోజు నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర వండు’ అంటూ భార్యకు చెప్పాడు రైతు. ఆ మాటలు విన్న వంకాయ ముఖం గర్వంతో విచ్చుకుంది. అక్కడితో ఆగక.. ‘ఉల్లిపాయా.. రైతు మాటలు విన్నావా?’ అంటూ ముసిముసిగా నవ్వింది. ‘అలా అయితే.. నాలుగు ఉల్లిపాయలు ఎక్కువ కోయాలి. ఉల్లి ఎక్కువ వేయకపోతే, వంకాయకి అసలు రుచే పుట్టదు’ అంది రైతు భార్య.

ఆ మాటతో వంకాయ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. ఉల్లిపాయకు ఆ మాటలు కొంత ఓదార్పునిచ్చాయి. ‘మనకు మనంగా చెప్పుకొనేది నిజమైన గొప్పతనం కాదు. ఇతరులు గుర్తించి కితాబు ఇస్తేనే, అసలైన గొప్పతనం. అర్థమయ్యిందా?’ అంటూ వంకాయ వైపు చూసింది ఉల్లిపాయ. దాంతో వంకాయ చిన్నబోయింది. కూరగాయల ముఖాలు కూడా ఒక్కసారిగా ముడుచుకుపోయాయి.

‘మీరూ, నేను వేర్వేరు కాదు. మనమంతా ఒక్కటే. నేనెప్పుడూ మీ స్నేహాన్నే కోరుకుంటాను. శరీరంలో కంపు ఉండొచ్చు కానీ నా మనసెప్పుడూ ఇంపే..’ అంటూ సర్దిచెప్పింది ఉల్లిపాయ. ఉల్లిపాయతో తమ అనుబంధం గుర్తు తెచ్చుకొని కూరగాయలన్నీ సిగ్గుపడ్డాయి. మన ప్రతిభ బయటపడాలంటే, ఇతరుల సాయం అవసరమన్న సత్యాన్ని తెలుసుకున్న కూరగాయలన్నీ పశ్చాత్తాప పడ్డాయి. అప్పటి నుంచి ఉల్లిపాయలతో సఖ్యతగా ఉంటూ.. కూరగాయలు తమ రుచులను పెంచుకున్నాయి.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని