చిలకమ్మ మాట!

తాను వాలిన చెట్టు కొమ్మ మీదే కూర్చుని ఉన్న పావురాల జంటను గమనించసాగింది ‘చిట్టి’ అనే చిలకమ్మ. ఆ జంట పావురాలు వాటి పిల్ల ‘చిన్ని’తో ‘నీకు కొత్తగా రెక్కలు వచ్చాయని ఎగురుకుంటూ వెళ్లిపోకూడదు. ప్రమాదం ఎటునుంచైనా రావచ్చు. వేటగాళ్లు పొంచిచూస్తుంటారు.

Published : 07 Sep 2022 00:18 IST

తాను వాలిన చెట్టు కొమ్మ మీదే కూర్చుని ఉన్న పావురాల జంటను గమనించసాగింది ‘చిట్టి’ అనే చిలకమ్మ. ఆ జంట పావురాలు వాటి పిల్ల ‘చిన్ని’తో ‘నీకు కొత్తగా రెక్కలు వచ్చాయని ఎగురుకుంటూ వెళ్లిపోకూడదు. ప్రమాదం ఎటునుంచైనా రావచ్చు. వేటగాళ్లు పొంచిచూస్తుంటారు. ప్రమాదం కొని తెచ్చుకోకు. హాయిగా ఇక్కడే ఉందాం!’ అంటూ బతిమిలాడసాగాయి. చిట్టికి విషయం పూర్తిగా అర్థం కాకపోవడంతో అసలు సంగతేంటో తెలుసుకోవాలనుకుంది.

వెంటనే పావురాల జంటకు దగ్గరగా చేరి ‘ఎందుకు చిన్నీని బుజ్జగిస్తున్నారు?’ అని అడిగింది చిట్టి. ‘ఏం చెప్పమంటావు చిట్టీ.. చాలా రోజులుగా ఈ చిట్టడవిలో ఉంటున్నాం. చెట్టు నీడనిస్తోంది. పక్కనే ఉన్న సరస్సు నీటినందిస్తోంది. అడవి ఆహారాన్నిస్తోంది. ఇంత చక్కటి ప్రదేశాన్ని వదలి వెళ్లిపోదామంటోంది. వద్దంటే వినడం లేదు. ఉదయం నుంచి తిండి లేదు.. నీళ్లు కూడా తాగలేదు’ అంటూ చిన్ని గురించి చెప్పింది ఆడ పావురం. ‘పిల్లలకు అలా కాకుండా కథ రూపంలో చెబితే చక్కగా వింటారు. మన మాటలకు ఊ కొడతారు’ అంటూ చిన్ని పక్కన చేరింది చిట్టి.

పావురాల జంట చెట్టుపైనున్న మరో కొమ్మ మీద వాలి చిట్టిని గమనించసాగాయి. ‘చిన్నీ.. నీకు కథలంటే ఇష్టం కదా. ఒక కథ చెబుతాను.. వింటావా?’ అంటూ గోముగా అడిగింది చిట్టి. ‘చిట్టి మామా.. త్వరగా కథ చెప్పవూ..’ అంటూ హుషారుగా అడిగింది చిన్ని. అప్పుడు చిట్టి, చిన్నికి ఓ కథ చెప్పసాగింది. ‘అనగనగా ఒక అందమైన పూల తోట. ఆ తోటలో పచ్చని చిలుకలు కలసి మెలసి హాయిగా నివసించేవి. ఆ చిలుకల సమూహంలో రాజు, రాణిలకు బుజ్జి అనే బుల్లి చిలుక పుట్టింది. లేక లేక జన్మించిన బుజ్జిని అమ్మానాన్నలు ఎంతో గారాబంగా పెంచసాగారు. తోటి చిలుకలు కూడా బుజ్జిని ముద్దుగా చూసేవి. అడిగినది లేదనకుండా, కోరినది కాదనకుండా ఇచ్చేవి. బుజ్జి ఆడింది ఆట, పాడింది పాటగా మారడంతో దానికి గర్వం ఎక్కువైంది’ అని చెబుతూ ఒక్కసారిగా ఆగింది చిట్టి.

‘ఆ తర్వాత ఏమైందో చెప్పు చిట్టి మామా!’ అంటూ ఆసక్తిగా అడిగింది చిన్ని. ‘చెబుతాను కానీ కథ పూర్తయ్యాక నా మాట వింటావా మరి?’ అడిగింది చిట్టి. ‘ఓ.. తప్పకుండా వింటాను’ బదులిచ్చింది చిన్ని. చిన్ని మన దారిలోకి వస్తోందని పైన కొమ్మ మీదున్న పావురాల జంట లోలోపలే అనుకుంది. ‘అప్పుడు బుజ్జి తన హద్దులు దాటి అల్లరి చేయడం మొదలు పెట్టింది. తోటి స్నేహితులను గేలి చేయడం, గాయపరచడం, పెద్దవారిని ఎదిరించడం చేయసాగేది. బుజ్జి అల్లరి శ్రుతి మించుతుండటంతో గారాబం చేసి తప్పుచేశాం’ అని తల్లిదండ్రులు బాధపడ్డారు.

బుజ్జి చేష్టలతో గాయపడిన తోటి చిలుకలు ఒక్కొక్కటిగా తోట నుంచి వలస వెళ్లిపోసాగాయి. చివరకు బుజ్జితోపాటు దాని తల్లిదండ్రులు మాత్రమే మిగిలారు. తోటలో జీవుల సంఖ్య తగ్గిపోవడంతో వేటగాళ్ల దృష్టి ఉన్న ఈ మూడింటిపైన పడింది. మాటు వేసి మరీ.. రాజు, రాణిలను పంజరంలో బంధించారు. ‘మరి బుజ్జి వేటగాళ్ల బారి నుంచి ఎలా తప్పించుకుంది?’ బాధగా అడిగింది చిన్ని. బుజ్జిని ఎలాగైనా తప్పించాలని అమ్మానాన్నలే వారి వలలో చిక్కుకున్నారు.

స్నేహితులను, సన్నిహితులను, చివరికి అమ్మానాన్నలను కూడా దూరం చేసుకున్న బుజ్జి ఎంతో ఏడ్చింది. తన అల్లరే ఇందుకు కారణమని గ్రహించింది. ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఎటో ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ‘ఇప్పుడు చెప్పు చిన్నీ.. అమ్మానాన్నల మాట వినని బుజ్జి గతి ఏమైంది? పెద్దలను ఎదిరించిన బుజ్జి సుఖంగా నివసించగలిగిందా?’ అడిగింది చిట్టి. ‘లేదు.. అమ్మానాన్నల మాట  వినాలి. అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు. బుజ్జిలా నేను అల్లరి చేయను. బుద్ధిగా ఉంటాను’ అంది చిన్ని. ‘మా చిన్నిలో మార్పునకు నీవే కారణం’ అంటూ పావురాల జంట చిట్టికి కృతజ్ఞతలు చెప్పింది. ‘పాపం.. బుజ్జి ఇప్పుడు ఎక్కడుందో? ఎలా బతుకుతుందో?’ బాధగా అంది చిన్ని. ఆ మాటలకు చిట్టి చిన్నగా నవ్వుతూ.. ‘తప్పు తెలుసుకున్న బుజ్జి తన తీరుతోపాటు పేరును కూడా చిన్ని అని మార్చుకుంది’ అని చిట్టి చెప్పగానే అదెంతో ఆశ్చర్యపోయింది. పావురాల జంట కూడా ముసిముసిగా నవ్వుకున్నాయి. 

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని