కోతి వైద్యం!

అడవిలోని మృగరాజుకు ఈ మధ్యకాలంలో కోపం, చిరాకు వస్తున్నాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండే మృగరాజు.. ఈ విధంగా మారడానికి కారణం తెలియక జంతువులన్నీ తర్జనభర్జన పడసాగాయి.

Published : 21 Oct 2022 00:09 IST

డవిలోని మృగరాజుకు ఈ మధ్యకాలంలో కోపం, చిరాకు వస్తున్నాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండే మృగరాజు.. ఈ విధంగా మారడానికి కారణం తెలియక జంతువులన్నీ తర్జనభర్జన పడసాగాయి.
వాటి అనుమానాలు ఒక్కొక్కటి వ్యక్తం చేయడం మొదలు పెట్టాయి. ‘తన కోపమే తన శత్రువు అని గుర్తించినట్లు లేదు’ అంది ఎలుగుబంటి. ‘నిన్న ఆహారం కోసం వేటకు బయలు దేరదాం పదండి అంటే.. అంత ఎత్తున లేచి మీద పడబోతే. బతుకు జీవుడా! అంటూ పరుగుపెట్టాను’ అంది నక్క.

‘ఎప్పుడూ నీది తిండి గొడవే! ఏ సమస్యతో బాధపడుతుందో ఏమో?’ అంటూ సానుభూతితో మాట్లాడింది ఏనుగు. ‘ఆరోగ్య సమస్య అయితే వైద్యుణ్ని సంప్రదించాలి. మానసిక ఇబ్బంది అయితే మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి’ అంది జిరాఫీ.

‘పాపం.. పోనీ కదా అని పరామర్శిద్దామని వెళ్తే, నాకేమీ కాలేదు అని కసిరి పంపించింది’ అంది చిన్నబుచ్చుకున్న తోడేలు.

‘నిన్న మృగరాజు కంట పడ్డాను. నాకైతే పైప్రాణాలు పైనే పోయాయి. కోపంగా నావైపు చూసి ఊరుకుంది’ భయం భయంగా చెప్పింది జింక. ‘మృగరాజు ఆరోగ్యంగా ఉంటేనే అడవి బాగుంటుంది. వేటగాళ్లు అడవి వైపు కన్నెత్తి చూడడానికే భయపడతారు. వేటగాళ్లే అడవిలోకి వస్తే అందరికీ ప్రాణగండమే’ అంది బితుకు బితుకుమంటున్న అడవి మేక.

‘నిజమే..! కోతి మిత్రమా!’ నీ వైద్యం పనిచేస్తుందేమో చూడు’ అంటూ సలహా ఇచ్చింది అడవి పంది. ‘మీరు చెప్పింది విన్నాక మృగరాజు జబ్బును గుర్తించగలిగాను. కానీ ఆ జబ్బుకు నా వైద్యం పనికిరాదు. ఈ జబ్బుకు వైద్యం చేయగల సత్తా ఈ దగ్గర గ్రామంలో ఉన్న నా మిత్రుడికి ఉంది. నా స్నేహితుణ్ని పిలిచి వైద్యం చేయిస్తే సరిపోతుంది’ అంది కోతి.

‘ఎవరినీ దగ్గరకు రానివ్వని మృగరాజును ఒప్పించడమెలా?’ సందేహపడుతూ అడిగింది నక్క. ‘ముందు నా మిత్రుణ్ని పిలుచుకొస్తాను. మృగరాజు ఆదమరిచి ఉన్నప్పుడు వైద్యం చేయమని చెబుతాను అంది కోతి.

‘తిండిలేక నీరసించిపోతున్న మృగరాజును చూస్తుంటే జాలేస్తుంది. ఎప్పుడూ ఆదమరిచే ఉంటుంది. ఈ స్థితిలో నీ మిత్రుడితో వైద్యం చేయించడం సులభమే’ అంది ఎలుగు బంటి.

మర్నాడు బయలుదేరిన కోతి, ఒక గాడిదను వెంటేసుకు వచ్చింది. తన మిత్రుడంటూ పరిచయం చేసింది. ‘ఈ గాడిదకు వైద్యం వచ్చా’ ఆరా తీసినట్టు అడిగాయి మిగిలిన జంతువులు. ‘ప్రస్తుతం మృగరాజు జబ్బుకు సరైన చికిత్స చేయగల సామర్థ్యం ఈ గాడిదకు మాత్రమే ఉంది’ అని నమ్మకంగా చెప్పింది కోతి.

కోతి నెమ్మదిగా గాడిదను సింహం ఉండే గుహ దగ్గరకు తీసుకుపోయింది. అంతవరకు సింహాన్ని చూసి ఎరుగని గాడిద, దాన్ని చూడగానే భయపడింది... పారిపోవడానికి సిద్ధపడింది.

‘మిత్రమా! నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ లేదు. నీరసంతో ఉన్న మృగరాజు నిన్ను ఏమీ చేయలేదు. ఒకసారి నేను మీ గ్రామానికి వచ్చినప్పుడు... నువ్వు కుక్కతో అన్న మాటలు గుర్తు తెచ్చుకో. ఆడిన మాట తప్పరాదు’ అంటూ ధైర్యాన్ని నూరిపోసింది కోతి.

మిగిలిన జంతువులు ‘ఇక ప్రారంభించు, మృగరాజు బాధను చూడలేకపోతున్నాం. కోతి చెప్పినట్టు అంతా నీ వెనుక ఉంటాం’ అభయమిచ్చినట్టు మాట్లాడాయి. గాడిదకు ధైర్యం వచ్చింది. గాడిద చేయబోయే వైద్యం గురించి మిగిలిన జంతువులన్నీ ఆసక్తిగా ఎదురు చూడసాగాయి.

గాడిద వెనకకు తిరిగి, సింహం మూతి మీద ఒక తన్ను తన్ని, వెంటనే పరుగు తీసింది. సింహం నోటి నుంచి రక్తంతో పాటు ఒక దంతం కూడా బయటకు వచ్చింది. ఎవరది అంటూ సింహం లేవడానికి ప్రయత్నించింది. గాడిద చేసిన పనికి అవాక్కైన జంతువులు అక్కడ నుంచి పరుగుతీశాయి. అడవిలో ఒక మూల ఈ జంతువులన్నీ కలిశాయి.

‘కోతి మిత్రమా.. మొత్తానికి గాడిదతో గొప్ప వైద్యం చేయించావు’ అంటూ భయంతో వణికిపోసాగాయి. ‘మీరేం భయపడవద్దు. రేపు మృగరాజే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మెచ్చుకుంటుంది. చూడండి’ అని చెప్పింది కోతి.
‘చాలు, చాలు నీ మాటలు, వైద్యం అని చెప్పి మూతి మీద తన్నిస్తావా? గాడిద ఈ పాటికి పారిపోయి తన గ్రామం చేరి ఉంటుంది. అవమానంతో కుంగిపోయిన మృగరాజు మాత్రం మన అంతు చూడక తప్పదు’ అంటూ కూనిరాగాలు తీసింది నక్క. జంతువులన్నీ కోతిని తప్పు పట్టాయి.

తెల్లారింది సింహం వేటకు బయలు దేరింది. దొరికింది తిని కనిపించిన జంతువులను కుశల ప్రశ్నలు వేస్తూ పలకరించింది. ‘మృగరాజా! నిన్నటి సంఘటనలో మిమ్మల్ని చూసి బాధ పడ్డాం. ఇదంతా కోతి పనే. మిత్రుడని చెప్పి గాడిదను పిలిపించి, మిమ్మల్ని తన్నించింది. ఇందులో మా తప్పు లేదు’ అని సంజాయిషీ చెప్పుకొని లబ్ధి పొందాలని చూసింది నక్క.

‘గాడిద తంతే తన్నింది కానీ.. ఆ పిప్పి పన్ను రాలిపోయింది. ఇన్నాళ్లుగా నొప్పితో బాధ పడుతున్న నాకు ఉపశమనం ఇచ్చింది. నా బాధను చూసి రోగాన్ని కనిపెట్టిన కోతి ఉత్తమ వైద్యుడు’ అని ప్రశంసించింది మృగరాజు.
‘మిత్రమా! గాడిద, కుక్కతో ఏమందో తెలుసుకోవాలని ఉంది’ అంటూ జిరాఫీ మెడ చాచి కోతి చెవి దగ్గర నెమ్మదిగా అడిగింది. ‘గాడిదకు బీరాలు ఎక్కువ. ఓసారి కుక్కతో తగువాడుతూ గ్రామ సింహం అయినా అడవి సింహం అయినా నా వెనక కాలుకు ఒక్కటే అంది. అక్కడే ఉన్న నేను డప్పుకొట్టుకోకు అన్నాను. అడవి సింహాన్ని చూపించు తన్ని నా కాలు శక్తి చూపిస్తాను అంది’ అని చెప్పింది కోతి.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని