శెభాష్‌ ప్రథమ్‌.!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా పోటీల్లోనో, చదువులోనో చిన్న బహుమతి వస్తేనే మనం ఎంతో సంబరపడిపోతాం. తెలిసినవాళ్లందరికీ చెప్పి మురిసిపోతుంటాం. అదే ‘దేశవ్యాప్త పోటీల్లో అద్భుత ప్రతిభ చూపితే..? ఏకంగా పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వస్తే..?’

Published : 09 Nov 2022 00:04 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా పోటీల్లోనో, చదువులోనో చిన్న బహుమతి వస్తేనే మనం ఎంతో సంబరపడిపోతాం. తెలిసినవాళ్లందరికీ చెప్పి మురిసిపోతుంటాం. అదే ‘దేశవ్యాప్త పోటీల్లో అద్భుత ప్రతిభ చూపితే..? ఏకంగా పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వస్తే..?’ ఇక మన ఆనందానికి అవధులే ఉండవు కదా! ఇప్పుడు అలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నాడో నేస్తం. ఇంతకీ అతడెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన ప్రథమ్‌ ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల పార్లమెంట్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, మొట్టమొదటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గురించి మాట్లాడి.. అందరితో శెభాష్‌ అనిపించుకున్నాడు. పన్నెండేళ్ల వయసులోనే పాఠశాల ఆధ్వర్యంలో సన్మానమూ అందుకున్నాడు.

తల్లి సహకారంతో..

మొన్న అక్టోబర్‌ 31న పటేల్‌ జయంతి సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు ముందే పటేల్‌ జీవిత విశేషాల గురించి పార్లమెంట్‌లో మాట్లాడేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని పిల్లలకు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో వివిధ పోటీలను చేపట్టారు. వాటిల్లో మొత్తం 70 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. అందులో కేవలం 25 మందికే పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం దక్కింది. వారందరిలోకెల్లా అతి పిన్న వయస్కుడు మన ప్రథమ్‌ కావడం విశేషం. మూడు నిమిషాలపాటు పటేల్‌ గురించి అనర్గళంగా మాట్లాడి.. అక్కడి వారిని ఆశ్చర్యపరిచాడు. ఒకటో తరగతి నుంచే హిందీ నేర్చుకోవడం తనకు కలిసొచ్చింది. స్పీచ్‌ని సిద్ధం చేసుకోవడంలో తల్లితోపాటు స్కూల్‌ హిందీ టీచర్‌ ఈ నేస్తానికి సహకరించారట.

చిన్నతనం నుంచే..

చిన్నప్పటి నుంచే పాఠశాలలో, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు ప్రథమ్‌. ఆయా ప్రదర్శనల్లో మాట్లాడటంతోపాటు సంస్కృత శ్లోకాలు కూడా నేర్చుకోసాగాడు. ఆ ఆసక్తే.. ఇప్పుడు పార్లమెంట్‌లో స్పీకర్‌, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖుల ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకెళ్లింది. గత ఏడాది అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 20 వరకు దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో నిర్వహించిన ‘వీర్‌ గాథ’(సూపర్‌-25) పోటీల్లోనూ ప్రథమ్‌ అదరగొట్టాడు. దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో ఎంపికైన 25 మందిలో ఈ నేస్తం ఒకడు. పటేల్‌ జీవిత విశేషాలపై పార్లమెంట్‌లో ప్రథమ్‌ వినిపించిన పద్యం.. ప్రతి ఒక్కరినీ కదిలించేలా చేసిందట. కార్యక్రమం ముగిసిన తర్వాత.. విద్యార్థులందరినీ పార్లమెంట్‌ టూర్‌కి తీసుకెళ్లారట. ఇంత చిన్న వయసులోనే పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం రావడంతోపాటు ప్రముఖుల ప్రశంసలు లభించడం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని