ఊరంతా గవ్వల్...గవ్వల్ !

చుట్టూ నీరు ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటాం కదా.. అలాంటి చోటు మొత్తం గవ్వలతో నిండి ఉంటే... భలే ఉంటుంది కదా! ఆ విశేషాలే ఇవి! ఓ ఊరుంది. పేరు జోల్‌ ఫెడిత్‌. దానికి ఆనుకునే ఓ బుల్లి ద్వీపం ఉంది. అది ఆ ఊరిదే. అందుకే దాన్ని ఫెడిత్‌ ఐలాండ్‌ పేరుతో పిలుస్తుంటారు. దీనికో చిత్రమైన చరిత్ర ఉంది. అదేంటంటే...

Updated : 03 Aug 2019 00:18 IST

చుట్టూ నీరు ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటాం కదా.. అలాంటి చోటు మొత్తం గవ్వలతో నిండి ఉంటే... భలే ఉంటుంది కదా! ఆ విశేషాలే ఇవి!

ఓ ఊరుంది. పేరు జోల్‌ ఫెడిత్‌. దానికి ఆనుకునే ఓ బుల్లి ద్వీపం ఉంది. అది ఆ ఊరిదే. అందుకే దాన్ని ఫెడిత్‌ ఐలాండ్‌ పేరుతో పిలుస్తుంటారు. దీనికో చిత్రమైన చరిత్ర ఉంది. అదేంటంటే...

* సెనెగల్‌ దేశ తీరంలో అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఉన్న ఈ దీవి మొత్తం సముద్రపు ఆల్చిప్పలు, గుల్లలు, గవ్వలతోనే తయారయ్యింది.
* అలా ఏర్పడిన దీవిపైన ఇప్పుడు ఇళ్లు, రోడ్లు, శ్మశానం సహా అన్నీ ఉన్నాయి.

* అలా ఎందుకబ్బా అంటే? జోల్‌ ఫెడిత్‌ జాలర్ల ఊరు. వాళ్లంతా కొన్నేళ్లపాటు సముద్రపు ఆల్చిప్పలు, గవ్వల్లోంచి మాంసం సేకరించి అమ్మేవారట. అలా వచ్చిన గుల్లలన్నింటినీ సముద్రంలో ఓ చోట పొయ్యడం ప్రారంభించారు. అక్కడ మడ అడవులు ఉండటంతో కింద వేళ్ల సాయం అందింది. మట్టి, గుల్లలు కలిసిపోయి.. అక్కడో ద్వీపం ఏర్పడిపోయింది.

* అలా ఏర్పడిన దీవి మీద స్థానికులు ఇళ్లు కట్టుకున్నారు. రోడ్లేసుకున్నారు. నేలంతా గవ్వలే ఉండటంతో ఇంటి నిర్మాణాల్లోనూ అవి చేరిపోయాయి. ఇళ్ల గోడలు, సీలింగ్‌లు, రహదారులు... ఇలా ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. అందుకే దీన్ని ‘షెల్‌ విలేజ్‌’, ‘షెల్‌ ఐలాండ్‌’ అని పిలుస్తుంటారు.

* ఈ దీవిని, ప్రధాన ఊరికి కలుపుతూ ఓ చెక్క వంతెన ఉంటుంది. దాని మీద నుంచి ఇక్కడి వారు రాకపోకలు సాగిస్తుంటారు.
* ఈ దీవితో కలిపి ఊరి జనాభా ఇప్పుడు దాదాపుగా 45 వేలు.

* ఇక్కడి వారు ఈ గవ్వలతోనే అందమైన కళారూపాలు తయారు చేసి అమ్ముతుంటారు. ఈ ప్రాంతాన్ని చూడ్డానికి పర్యటకులూ వస్తుంటారు. భలే గవ్వల ఊరే అనుకుని సంబరపడిపోతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని