పైనో పట్నం... కిందో పట్నం మధ్యలో లిఫ్టు!

ఆ ఎలివేటర్‌లో ఎక్కగానే జామ్మంటూ కిందకు దూసుకుపోతుంది. క్షణంలో దింపేస్తుంది. ఎక్కిన పరిసరాలేవీ కనిపించవు. కొత్త ప్రాంతానికి తీసుకువెళ్తుంది. అదేంటీ? అంటే? అదుండేది రెండు ప్రాంతాల్ని కలుపుతూ. అంతా గజిబిజిగా ఉందా? అయితే వివరాల్లోకి వెళ్లండి మరి.

Published : 13 Dec 2018 00:17 IST

ఎలివేటర్‌ ఎక్కడుంటుంది? అదేం ప్రశ్న? ఎత్తయిన భవంతుల్లో కింది నుంచి పైకి వెళ్లడానికి అనేస్తారు వెంటనే...కానీ ఓ లిఫ్టు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు... ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి? ఎక్కడుందది?

పైనో పట్నం... కిందో పట్నం మధ్యలో లిఫ్టు!. 

బ్రెజిల్‌లోని లాసెర్డా ఎలివేటర్‌ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇది రెండంతస్తుల ఓ ఊరుకు వారధిగా ఉంటుంది. రెండంతస్తుల ఊరేంటీ? ఎలివేటర్‌ కలపడం ఏంటీ? అనుకుంటున్నారా? మరేం లేదు. ఇక్కడి సాల్వడార్‌ అనే పట్టణం సిదాజ్‌ బైక్సా, సిదాజ్‌ అల్టా అనే రెండు పట్టణాలుగా విడిపోయి ఉంటుంది. సముద్ర తీరంలో ఉన్న కింద పట్టణం నుంచి పై పట్టణం 279 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి పైన నుంచి కిందకు, కింద నుంచి పైకి రాకపోకలు ఎలా? అందుకే ఈ లిఫ్టు కట్టారు. 
* బ్రెజిల్‌లో మొట్టమొదటి ఎలివేటర్‌ ఇదేనట. దీన్ని ఎప్పుడో 1873లో నిర్మించారు. ఆ తర్వాత మార్పులు చేస్తూ హంగులు అద్దుతూ వచ్చారు. 

పైనో పట్నం... కిందో పట్నం మధ్యలో లిఫ్టు!

* ఇంచుమించు ఇరవై అంతస్తుల ఎత్తు ఉండే ఈ ఎలివేటర్‌ 30 సెకన్లలో దూసుకుపోతుంది. కాస్త సర్దుకుని నిల్చునే లోపే వేగంగా దింపేస్తుందన్నమాట. 
* సముద్ర తీరం.. పరిసరాల అందాలు చూడ్డానికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. రోజూ ఈ లిఫ్టులో 15 వేల మంది వరకు ఎక్కుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని