Updated : 04 Mar 2021 01:02 IST

కుందేలు పేచీ..  తాబేలుతో పోటీ

క అడవిలో కుందేలు, తాబేలు మంచి స్నేహితులు. రెండూ కలసిమెలసి తిరుగుతూ ఉండేవి. కుందేలు తన గురించి తానే గొప్పగా చెప్పుకొనేది. తాబేలు మాత్రం బుద్ధిగా ఉంటూ తన పని తాను చేసుకునేది.
ఒకరోజు ఆ స్నేహితుల మధ్య తాతల కాలం నాటి కుందేలు, తాబేలు పరుగు పందెం కథ చర్చకు వచ్చింది. ‘పూర్వం మావాళ్లు అమాయకంగా ఉండేవారు. అందుకే అప్పట్లో కుందేలు ఒకటి పరుగు పందెంలో తాబేలు చేతిలో ఓడిపోయింది. అదే నేనైతే ఏ జంతువుతోనైనా పరుగు పందెంలో సునాయాసంగా గెలిచేదాన్ని. అందులోనూ తాబేళ్లనైతే రెప్పపాటు సమయంలో ఓడించగలను’ అంటూ గొప్పలు చెప్పింది కుందేలు.
‘నేను గెలవగలను అనే నమ్మకం ఉండటం మంచిదే.. కానీ, నేను మాత్రమే గెలవగలను అనే అతివిశ్వాసం సరికాదు. ఒక్కోసారి అది ప్రమాదాలను సైతం మోసుకొస్తుంది. అప్పట్లో కుందేలు మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే ఓడిపోయినట్లు కథలో ఉంది. వాస్తవానికి కుందేళ్లే బాగా పరుగెత్తగలవు’ చెప్పింది తాబేలు.
‘కుందేళ్లే గెలుస్తాయి అని అంగీకరించినందుకు సంతోషం. అప్పుడు ఆ పోటీ జరిగిందో లేక కల్పించి చెప్పారో మనకు తెలియదు. కానీ, ఆ కథ ఆధారంగా కుందేళ్లను ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నారు. కాబట్టి, ఇప్పుడు మనం నిజంగా పరుగులో పోటీపడదాం’ అని తాబేలుతో అంది కుందేలు.
ఆ మాటలకు తాబేలు చిన్నగా నవ్వి వెళ్లిపోయింది. ఆరోజు నుంచి తాబేలు ఎప్పుడు ఎదురుపడినా.. కుందేలు పరుగు పందెం ప్రస్తావన తీసుకురాసాగింది. కుందేలు తీరును చూసి చిలుకకు విసుగొచ్చింది. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది.
మరుసటి రోజు తాబేలు దగ్గరికి వెళ్లింది చిలుక. ‘మిత్రమా! గెలుపోటములను ఎవరూ ముందే ఊహించలేరు. ప్రత్యర్థి బలాన్ని చూసి, మనల్ని తక్కువ చేసుకోవద్దు. ఆ కుందేలుకు బుద్ధి చెప్పాలంటే నువ్వు పరుగు పందేనికి సిద్ధం కావాలి’ అంది చిలుక. కొన్నిరోజుల తర్వాత ఎలాగోలా తాబేలును పోటీకి ఒప్పించింది.
ఒకరోజు తాబేలు, కుందేలు పరుగుకు సిద్ధమయ్యాయి. పందెం చూసేందుకు అడవిలోని చాలా జంతువులు, పక్షులు అక్కడకు చేరాయి. పందెం ప్రారంభం కాగానే చిలుక పథకం ప్రకారం ఇతర జీవులు కుందేలు, తాబేలుకు ఇష్టమైన ఆహార పదార్థాలను వాటి ముందు పడేలా విసిరేయసాగాయి. క్యారెట్లు  నిగనిగలాడుతుండటంతో కుందేలు పరుగు ఆపేసి.. వాటిని తినడం మొదలుపెట్టింది. తాబేలు మాత్రం వాటిని పట్టించుకోకుండా పరుగు మీదే దృష్టి పెట్టింది.
‘ముందు ఆ తినడం ఆపు. తాబేలు నిన్ను దాటి లక్ష్యానికి చేరువగా వెళ్లిపోతోంది. ఇప్పటికైనా పరుగెత్తు.. లేకపోతే ఓడిపోతావు’ అని కొన్ని జంతువులు కుందేలును హెచ్చరించాయి. అయినా అది పట్టించుకోకుండా ‘ఇదొక్కటి తింటాను.. ఇదొక్కటి తింటాను.. తర్వాత చెంగుచెంగున గెంతులేస్తూ తాబేలును దాటేస్తాను చూడండి’ అంటూ క్యారెట్లను ఏరుకొని మరీ తినసాగింది.
తాబేలు విజయానికి దగ్గరలో ఉందనగా.. కుందేలు తేరుకొని పరుగు అందుకుంది. కానీ, పొట్ట నిండుగా ఉండటంతో శరీరం బరువైంది. పరుగు కాదు కదా కనీసం నడవలేకపోయింది. ఈలోగా తాబేలు లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది.  
మిగతా జీవులతో పాటు కుందేలు కూడా తాబేలును అభినందించి ‘ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. విజయం సాధించేందుకు శక్తి ఒక్కటే కాదు కృషి, పట్టుదల, ఏకాగ్రత కూడా అవసరం. నిర్లక్ష్యం అసలే పనికిరాదు. ఇకపై గొప్పలకు పోకుండా ఎదుటివారిని గౌరవిస్తాను’ అని చేయి కలిపింది.

- మీగడ వీరభద్రస్వామి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని