దత్తాత్రేయుడెవరు?

మనకి సర్వం ప్రసాదించిన భగవంతుడే మరింత అనుగ్రహించేందుకు దత్త గురువుగా సాక్షాత్కరించాడు. ఆయన బోధలు ధైర్యస్థైర్యాలిస్తాయి. ఊరడించి ఓదారుస్తాయి.  దత్త అనే రెండక్షరాలు జపిస్తే ఇహపరాల్లో సర్వం ప్రాప్తిస్తాయని పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు.

Updated : 16 Dec 2021 03:46 IST

డిసెంబర్‌ 18 దత్త జయంతి

మనకి సర్వం ప్రసాదించిన భగవంతుడే మరింత అనుగ్రహించేందుకు దత్త గురువుగా సాక్షాత్కరించాడు. ఆయన బోధలు ధైర్యస్థైర్యాలిస్తాయి. ఊరడించి ఓదారుస్తాయి.  దత్త అనే రెండక్షరాలు జపిస్తే ఇహపరాల్లో సర్వం ప్రాప్తిస్తాయని పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు.

త్తాత్రేయుడు ఆది గురువు. త్రిమూర్తుల మేలుకలయిక. అతడే మార్గం, గమ్యం, ఉపాసన, మోక్షం. బ్రహ్మవిద్య, శ్రీవిద్య, యోగ విద్యలను ప్రసాదించాడు. ఇచ్ఛ, క్రియ, జ్ఞాన శక్తులు త్రికోణాకారంలో తామస, రాజస, సాత్త్విక గుణస్వరూపిణులై భగమాలిని, కామేశ్వరి, వజ్రేశ్వరి, రూపాల్లో గల మూలాధార త్రిపురా శక్తికి దత్తమైనదే దత్తశక్తి. దీనికి ప్రతినిధి దత్తుడు. పరబ్రహ్మమైన త్రిపురను తానేనంటూ పరశురామునికి త్రిపురారహస్యం బోధించాడు. కనుక సృష్టికి మూలపురుషుడు దత్తుడేనన్నమాట.

శ్రీ మహావిష్ణువు 21 అవతారాలలో దత్తాత్రేయరూపం ఆరోది. దశావతారాలకంటే ముందుది. విష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణకై 5 అవతారాల ధరించినమీదట, ‘అజ్ఞానంతోనే మనుషులు రాక్షసులౌతున్నారు, జ్ఞానులుగా తీర్చిదిద్దితే మంచి వారవుతారు, శిక్షించనవసరం లేదు.. దుష్టులను శిక్షించే బదులు వారిలో పరివర్తన తేవాలి, గురువు దైవాల మేలు కలయికతో అవతరించాలి’ అనుకున్నాడు. పుత్రసంతతికై తపస్సు చేస్తోన్న అత్రి, అనసూయ దంపతులకు దత్తాత్రేయునిగా జన్మించాడు.

దత్తజయంతి విశిష్టత

ఆకాశవీధిలో దత్తమండలం ఉంటుంది. దత్తుడు జన్మించిన మార్గశిర పూర్ణిమనాడు, భూమి.. విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి దగ్గరగా వస్తుంది. ఆ సమయానికి సూర్య చంద్రులతోబాటు మనుషులూ ఒకేసరళరేఖపై దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల ఆరోజు దత్తుని పూజిస్తే సులభంగా అనుగ్రహం పొందగలరు.

భగవద్గీతకు స్ఫూర్తి దత్తాత్రేయుడేనా?

దత్తాత్రేయుడు సాంకృతి అనే రుషికి అవధూతోపనిషత్తు ఉపదేశించాడు. దీనిని అవధూతగీత అని కూడా అంటారు. ఇందులోని ఎన్నో అంశాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి. దత్తావతారం తర్వాత చాలాకాలానికి కృష్ణుడు అవతరించాడు. అందుకే అవధూతగీతకు భగవద్గీతను వ్యాఖ్యానం అంటారు.

అవధూత అంటే ఎవరు?

అవధూత పదంలో అ-అక్షయుడు (నాశనం లేనివాడు), వ-వరేణ్యుడు (బ్రహ్మవేత్తల్లో అగ్రగణ్యుడు) ధూ-ధూత (సంసారబంధాలు వదిలినవాడు) త-తత్త్వవేత్త (తత్త్వం బోధించేవాడు). అవధూత ఎవరి అదుపులో ఉండడు. వస్త్రం ధరించడు. నిర్లిప్తుడైన అతన్ని  కర్మలు అంటవు.

దత్తుని నిత్యసంచారం

దత్తుడు ఆసేతుహిమాచలం సంచరిస్తాడు. యోగశక్తితో సహ్యాద్రి నుంచి బయల్దేరి కాశీలో స్నానం, గాణగాపురంలో ధ్యానం, కురుక్షేత్రంలో ఆచమనం, కొల్హాపురిలో భిక్ష, గిర్నార్‌లో విశ్రాంతులయ్యాక మాహూగఢ్‌లో శయనిస్తాడు.

దత్తుని సూఫీతత్త్వం

దత్తునిలో సూఫీతత్త్వం నుంచి వచ్చినవే తాజుద్దీన్‌ బాబా, శిరిడిసాయిబాబా అవతారాలు. దత్తుడు జ్ఞానార్థులకే గోచరించాడు. ఆశ్రితుల కోర్కెమేరకు తన సగుణరూపమును భక్తితో అర్చించుకునేందుకు వీలుగా వ్యక్తిరూపమైన శ్రీపాదవల్లభ, నృసింహసరస్వతి, మాణిక్య ప్రభువు తదితర అవతారాలను ధరించాడు. నేటికీ ఏదో రూపంలో ఉన్న దత్తుడు భక్తులు తలచుకుంటే చాలు పలుకుతాడు. దత్తాత్రేయునిది క్షయం లేని, ముగింపు లేని అవతారం.

- డాక్టర్‌ దువ్వూరి భాస్కరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని