ఆస్థాన విద్వాంసుడి గతం

ఓరోజు ఖలీఫా హారూన్‌ రషీద్‌ కోసం పిస్తాబాదం పాయసాన్ని వంటవాళ్లు సిద్ధం చేశారు. ఖలీఫాకు అదెంతో నచ్చి ఆస్థాన విద్వాంసుడు అబూ యూసుఫ్‌కి స్వయంగా వడ్డించారు. అబూ ఎంతో ఇష్టంగా తినడంతో

Updated : 06 Jan 2022 06:21 IST

ఓరోజు ఖలీఫా హారూన్‌ రషీద్‌ కోసం పిస్తాబాదం పాయసాన్ని వంటవాళ్లు సిద్ధం చేశారు. ఖలీఫాకు అదెంతో నచ్చి ఆస్థాన విద్వాంసుడు అబూ యూసుఫ్‌కి స్వయంగా వడ్డించారు. అబూ ఎంతో ఇష్టంగా తినడంతో ప్రతివారం రాజదర్బారులో పిస్తాబాదం వండిస్తాను అన్నారు ఖలీఫా. అబూ ఉబ్బితబ్బిబ్బయి ‘నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మ ఒకరివద్ద పనిచేసేది. వెంట నేనూ వెళ్లేవాణ్ని. దారిలో ఇమామ్‌ అబూహనీఫా(ర) చదువు నేర్పడం చూసి అలానే నిలబడిపోయి వినేవాణ్ని. నిత్యం అలాగే జరిగేది. అది గమనించిన ఇమామ్‌ ఒకరోజు ‘అమ్మా! నీ కొడుక్కి చదువుకోవాలనుంది. చదివించు’ అన్నారు. ‘మా అబ్బాయి పనిచేస్తేనే మా కడుపు నిండేది’ అంది అమ్మ. దానికి ఇమామ్‌ ‘అబ్బాయిని చదువుకోనివ్వు, ఆ కూలీ నేనిస్తాను’ అన్నారు. నేనెంతో సంతోషించి, ఆయన దగ్గర చదువు సాగించాను. నేను పనికి వెళ్లడంలేదని యజమాని అమ్మ మీద కోపగించుకున్నాడు. ఆమె ఇమామ్‌కు జరిగింది చెప్పింది. ‘ఇతణ్ణి చదువుకోనివ్వు. గొప్పవాడవుతాడు. మీరు పిస్తా, బాదాముల పాయసం తింటారు’ అన్నారు ఇమామ్‌. అమ్మ సరేనంది. కానీ పేదవాళ్లమైన మాకు అదెలా సాధ్యమనుకుంది. మొత్తానికి నా చదువైపోయాక మీ కొలువులో చేరాను. మీ చేతులతో పాయసం తిన్నాను. మా గురువుగారి మాటలు నిజమయ్యాయి’ అన్నాడు ఉద్వేగంగా. ‘విద్యార్జన స్త్రీ పురుషుల ధార్మిక విధి’ అన్నది ముహమ్మద్‌ ప్రవక్త ఉద్బోధ.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని