రూ.2,550 కోట్లతో అపర్ణ జినాన్‌

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ పుప్పాలగూడలో కొత్త గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ ‘అపర్ణ జినాన్‌’ను మొదలెట్టినట్లు ప్రకటించింది. 37 ఎకరాల విస్తీర్ణంలో 14 టవర్లను..

Updated : 22 Jan 2022 05:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ పుప్పాలగూడలో కొత్త గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ ‘అపర్ణ జినాన్‌’ను మొదలెట్టినట్లు ప్రకటించింది. 37 ఎకరాల విస్తీర్ణంలో 14 టవర్లను.. ఒక్కోటి 33 అంతస్తుల్లో నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై రూ.2,550 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక పడక గది మొదలు మూడు పడక గదుల వరకు 3664 ఫ్లాట్లు రాబోతున్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా క్రీడా సముదాయాన్ని, 86,423 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద క్లబ్‌హౌజ్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఉమ్మడి కరెంట్‌ అవసరాల కోసం సౌరవిద్యుత్తు, పార్కింగ్‌ ప్రదేశంలో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2027 వరకు ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఎండీ ఎస్‌ఎస్‌రెడ్డి తెలిపారు. 2021లో కొవిడ్‌ ప్రతికూలతల సమయంలోనూ తమ వ్యాపారం 25 శాతం వృద్ధి చెందిందన్నారు. గృహ, వాణిజ్య విభాగంలో చేపట్టిన నూతన ప్రాజెక్టులతో ఈ ఏడాది వ్యాపార వృద్ధి 30 శాతానికి చేరుకుంటుందనే విశ్వాసం ఉందన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు కొత్తగా 1500 మందిని నియమించుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 24.5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి చేశామని, మరో 25 మిలియన్‌ చదరపు అడుగుల ప్రాజెక్టుల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 60 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలనూ సిద్ధం చేశామని చెప్పారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని