మార్కెట్లో హెచ్చుతగ్గులు

ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మిశ్రమ స్పందన కనిపించింది. హెచ్చుతగ్గులను ప్రతిబింబించింది. ఇళ్ల విక్రయాలు పెరగ్గా.. కొత్త యూనిట్ల సరఫరా తగ్గింది.

Published : 02 Dec 2023 00:34 IST

ఈనాడు, హైదరాబాద్‌

న్నికలకు ముందు హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మిశ్రమ స్పందన కనిపించింది. హెచ్చుతగ్గులను ప్రతిబింబించింది. ఇళ్ల విక్రయాలు పెరగ్గా.. కొత్త యూనిట్ల సరఫరా తగ్గింది. జులై నుంచి సెప్టెంబరు వరకు విక్రయాల్లో వృద్ధి 34 శాతం ఉంటే.. ఇళ్ల సరఫరాలో 25 శాతం వార్షిక తగ్గుదల నమోదైందని ప్రాప్‌టైగర్‌.కామ్‌ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో గత ఏడాది మూడో త్రైమాసికంలో 10,570 యూనిట్లను విక్రయించారు. ఈసారి అది 14,190 యూనిట్లకు పెరిగింది. నగరాలవారీగా త్రైమాసిక విక్రయాల్లో మనది మూడో స్థానం. మొదటి స్థానంలో ముంబయి 30,300 ఇళ్లను విక్రయించగా పుణె 18,560 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది.

సరఫరాలో

కొత్త ఇళ్ల సరఫరాలో గత ఏడాది మూడో త్రైమాసికంలో 27,430 యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది 20,480 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ముంబయిలో 35,920 యూనిట్ల తర్వాత మన దగ్గరే ఎక్కువ సరఫరా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.


అద్దెల్లో పెరుగుదల

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులను కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందేనని చెప్పడంతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. కొవిడ్‌ సమయంలో పెద్ద ఎత్తున ఇళ్ల ముందు టూలెట్‌ బోర్డులు వేలాడగా.. ఇప్పుడు చకచకా భర్తీ అవుతున్నాయి. దీంతో అద్దెల ధరలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 24.4 శాతం అద్దెలు పెరిగాయని ఒక సంస్థ వెల్లడించింది. అద్దెకుండేవాళ్లు నెలకు రూ.10వేల నుంచి రూ.30వేల లోపు ఉండే ఇళ్లను చూస్తున్నారు. సెమీ ఫర్నిష్డ్‌ అద్దె ఇళ్లకోసం 52.7 శాతం మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విభాగంలో సరఫరా 48.7 శాతం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని