సొంత పెట్టుబడి లేకుండా ఇళ్లలో సౌర విద్యుత్తు వెలుగులు

దేశంలోని కోటి ఇళ్లలో సౌర విద్యుత్తు వెలుగులు నింపే లక్ష్యంతో ‘పీఎం సూర్య ఘర్‌.. ముఫ్త్‌ బిజ్లీ యోజన’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రారంభించారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా అందే పథకమిది.  అర్హులు ఎవరు? ఎలా ఉపయోగిం చుకోవాలి వంటి సందేహాలెన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి.

Updated : 17 Feb 2024 08:58 IST

రాయితీతో బ్యాంకు రుణ సౌలభ్యం

దేశంలోని కోటి ఇళ్లలో సౌర విద్యుత్తు వెలుగులు నింపే లక్ష్యంతో ‘పీఎం సూర్య ఘర్‌.. ముఫ్త్‌ బిజ్లీ యోజన’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రారంభించారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా అందే పథకమిది.  అర్హులు ఎవరు? ఎలా ఉపయోగిం చుకోవాలి వంటి సందేహాలెన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి. విద్యుత్తు అధికారుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇళ్లపైన సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు సమకూర్చనున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు. రాబోయే రోజుల్లో ఈ పథకంపై మరింత స్పష్టత రానుందని టీఎస్‌ రెడ్కో వర్గాలు అంటున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌: రాజేశ్‌ నెలవారీ సగటున 200 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగిస్తున్నారు. రూ.1200 వరకు బిల్లు కడుతున్నారు. పీఎం సూర్యఘర్‌తో ఉచితం ఎలా అవుతుందంటే...

  • ఒక కిలోవాట్‌ సౌర పలకలు రోజుకు సగటున 4 యూనిట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈయన తన ఇంటిపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3 కిలోవాట్ల సామర్థ్యం కల్గిన సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటే నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి.

వ్యయం ఎంత?: 3 కిలోవాట్లకు రూ.1.26 లక్షలు అవుతుంది. కేంద్రం కిలోవాట్‌కు రూ.18వేలు సబ్సిడీ అందిస్తోంది. ఈ ప్రకారం రూ.54వేల సబ్సిడీ వస్తుంది. మిగిలిన రూ.72 వేలు వినియోగదారుడు భరించాలి. ఇందుకోసం రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. అంటే ఒకరకంగా సున్నా పెట్టుబడి అని చెప్పవచ్చు. ఎలాగంటే ఉత్పత్తయ్యే విద్యుత్తులో అవసరాలకు వాడుకోగా మిగిలిన దానిని విక్రయించడం ద్వారా బ్యాంకు రుణం చెల్లించవచ్చు.

  • సౌర పలకల జీవితకాలం పాతికేళ్లను పరిగణనలోకి తీసుకుంటే 5.32 సంవత్సరాల్లోనే పెట్టిన సొమ్మంతా తిరిగి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన కాలానికి ఉచితంగా కరెంట్‌ను వినియోగించుకోవచ్చు.

ఎలాగంటే?: ఇంటిపైన సౌర పలకలతో 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే... 200 యూనిట్లను వాడుకోగా. మిగతా కరెంట్‌ను విద్యుత్తు సంస్థ కొనుగోలు చేస్తుంది.

  • నెట్‌మీటర్‌ ద్వారా మిగిలిన కరెంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఇందుకు ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక్కో   యూనిట్‌కు రూ.5.05 చెల్లిస్తున్నారు.
  • ఈ ప్రకారం చూస్తే వాడుకున్న రెండు వందల యూనిట్లను మినహాయించి 160 యూనిట్లకు డిస్కం చెల్లింపులు చేస్తే రూ.808 అవుతుంది.  
  • అప్పుడు గతంలో బిల్లుగా చెల్లించే రూ.1200, ఇప్పుడు డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే రూ.808 కలిపి రూ.2వేలపైగా మొత్తాన్ని రుణానికి ఈఎంఐగా చెల్లిస్తారు. తక్కువలో తక్కువ వార్షికంగా 14,191 ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా ఐదేళ్ల తర్వాత ప్రతినెలా 360 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చు అని చెబుతున్నారు.

ఎంత విస్తీర్ణం కావాలి?

ఇంటిపైన 3 కిలోవాట్ల సౌర పలకలు ఏర్పాటు చేయాలంటే 300 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. వీటి నుంచి ఏడాదికి 4,730 యూనిట్ల కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది.

సామాజిక ప్రయోజనం..

  • సౌర విద్యుత్తుతో పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. 3 కిలోవాట్ల సౌర పలకలతో 25 ఏళ్లలో 85 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించిన వారం అవుతాం. ఆసక్తి ఉన్న వినియోగదారులు  https://pmsuryaghar.gov.in/  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని