మది దోచేముది మన్సా...

హైదరాబాద్‌ పేరు చెప్పగానే బిర్యానీ కళ్ల ముందు కదలాడుతుంది.  అలాగే ఒడిశా అనగానే నోరూరించే ముది మన్సా గుర్తుకు వస్తుంది. మయూర్‌భంజ్‌ జిల్లా దీనికి పెట్టింది పేరు.

Published : 20 Jun 2021 00:35 IST

పొరుగు రుచి

హైదరాబాద్‌ పేరు చెప్పగానే బిర్యానీ కళ్ల ముందు కదలాడుతుంది.  అలాగే ఒడిశా అనగానే నోరూరించే ముది మన్సా గుర్తుకు వస్తుంది. మయూర్‌భంజ్‌ జిల్లా దీనికి పెట్టింది పేరు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాజా కొత్తిమీర వేసి తయారుచేసిన చిక్కని, వేడి వేడి మటన్‌ గ్రేవీ (మన్సా)ని మరమరాలతో (ముది)తో కలిపి తీసుకుంటే ఆహా అనకుండా ఉండలేరు.

ఒడిశావాసులు మరమరాలను ఎక్కువగా తింటారు. వీటితో చేసిన అల్పాహారాలంటే అక్కడివారికి చాలా ఇష్టం. ఈ మరమరాలను సేంద్రియ విధానంలో పండించిన బియ్యం నుంచి రైతులు సహజ పద్ధతుల్లో తయారుచేస్తారు. యంత్రాలను ఉపయోగించరు. అత్యంత నాణ్యమైన ‘ముగైశాల’ అనే రకాన్ని ఇక్కడి నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకూ సరఫరా చేస్తారు. వీటిని తయారుచేసే బియ్యం వెనక ఎన్నో కథలున్నాయి. మొఘలులు మనకిచ్చిన కానుకగా కొందరు వీటిని వర్ణిస్తారు. మయూర్‌భంజ్‌ మహారాజులు వాటిని కనుగొన్నారని మరికొందరంటారు.

వాస్తవానికి...
ప్రస్తుతం ‘ముది మన్సా’కు ఆ గొప్పదనం రావడానికి కారణం ఓ రెస్టారెంట్‌ అని చెబుతున్నారు స్థానికులు. దాని పేరే గర్మాగరమ్‌ (వేడివేడిగా). యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ హోటల్‌ చాలా పురాతనమైంది. దీన్ని ప్రస్తుతం జోగేశ్వర్‌ బెహరా అనే వ్యక్తి నడిపిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట జోగేశ్వర్‌ తండ్రి ఈ రెస్టారెంట్‌ను మొదలుపెట్టాడట.

‘గర్మాగరమ్‌’ ప్రత్యేకత ఏమిటంటే... మాంసం కూరను మట్టి కుండలో వండుతారు. లేత మాంసంలో మసాలా దినుసులు వేసి గంట సేపటి వరకు నానబెడతారు. ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద మరో గంటపాటు ఉడికిస్తారు. ఇలా తయారీలోని ప్రతి దశ ఈ వంటకం రుచిని మరింత పెంచుతుంది. దీన్ని మరమరాలతో కలిపి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చట్నీ జత చేసి ఇస్తారు.  ఈ వంటకాన్ని అక్కడి స్థానికులు చాలా ఇష్టంతో ఆరగిస్తారు. దీని నుంచి బోలెడు పోషకాలు లభిస్తాయని చెబుతారు. అయితే ఆ ప్రాంతంలో చాలాచోట్ల విరివిగా లభిస్తుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని