రొయ్య పొట్టు.. కొబ్బరి అన్నం!

రొయ్యపొట్టుని, పండుమిర్చిని రోట్లో కలిపి దంచి కూర వండితే ఎలా ఉంటుందో తెలుసా? కొబ్బరిపాలతో అన్నం వండి చికెన్‌తో తింటే ఆ రుచి ఎలాంటిదో తెలుసా? మనకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ ..

Updated : 29 Dec 2018 12:05 IST

క్యుజీన్‌ కథ 

మలేసియా రుచుల మాయాజాలం...

రొయ్య పొట్టు.. కొబ్బరి అన్నం!

రొయ్యపొట్టుని, పండుమిర్చిని రోట్లో కలిపి దంచి కూర వండితే ఎలా ఉంటుందో తెలుసా? కొబ్బరిపాలతో అన్నం వండి చికెన్‌తో తింటే ఆ రుచి ఎలాంటిదో తెలుసా? మనకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ మలేసియా వంటకాలు కాబట్టి. నోరూరించే రుచుల కోశాగారం ఈ  మలేసియా క్యుజీన్‌..

రుదాటి బయటకువెళ్తే చాలు... అంతవరకూ మనకు తెలియని కొత్త రుచులు జిహ్వను, మనసుని కొత్తగా పలకరించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మలేసియా క్యుజీన్‌ కూడా మనకు అటువంటి సరికొత్త రుచులనే పరిచయం చేస్తుంది. అన్నంతో చేసే వంటకాలు, రొయ్యపొట్టు రుచులు, పండుమిర్చితో చేసే ప్రయోగాలు, ఆకుల్లో వండే వంటకాలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. మలేసియా క్యుజీన్‌పై భారతీయ వంటకాల ప్రభావమూ ఎక్కుగానే ఉంటుంది. అందుకే ప్రతి వంటింట్లోనూ చిన్నకల్వం ఉంటుంది. దాంతో అప్పటికప్పుడు రొయ్యిపొట్టుని పండుమిర్చితో కలిపి నూరి సాంబా బాలొచన్‌ వంటి వంటకాలు తయారుచేస్తారు.

ఇక్కడి వంటకాల్లో మిర్చి, కొబ్బరిపాలు, వరిబియ్యం, చికెన్‌, రొయ్యపొట్టు, చేపలు, తాటిబెల్లాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు.

రొయ్య పొట్టు.. కొబ్బరి అన్నం!

జాతీయ వంటకం అన్నమే... 
ఉదయం పూట తినే టిఫిన్‌కి బియ్యపు జావ, మధ్యాహ్నం పూట చికెన్‌తో కలిపి కొబ్బరిపాలతో వండిన అన్నం, సాయంత్రం అరిటాకులో బియ్యప్పిండితో చేసిన ఆవిరికుడుములు వంటివి నిత్యం ఉండాల్సిందే. వీళ్ల జాతీయ వంటకం పేరు నాసీలేమక్‌. కొబ్బరిపాలల్లో బియ్యం, నిమ్మగడ్డి, అల్లం వేసి ఉడికించిన అన్నాన్నే నాసీలేమక్‌ అంటారు. దీనికి జతగా రొయ్యపొట్టుతో చేసిన సాంబా, దోరగా వేయించిన నెత్తళ్లు, పల్లీలు, కీరాదోస ముక్కలు వేసి అరిటాకులో వడ్డించుకుని తింటే అంతకు మించి స్వర్గం లేదంటారు ఆహారప్రియులైన మలేసియన్లు.

మన కొబ్బరాకుల్లా పొడవుగా ఉండే పండోరా ఆకులని వీళ్లు వంటకాల్లో చాలా ఎక్కవగా వాడతారు. ఈ ఆకులని చాలా నైపుణ్యంగా చుట్టి అందులో చికెన్‌ని వండుతారు. ఇవికాకుండా ఇక్కడ అక్కడ స్థిరపడిన భారతీయుల ప్రభావంతో ఇడ్లీలు, పూరీలు, దోసెలు, నూడుల్స్‌, పరాటాలు వంటివి కూడా ఎక్కువగానే దొరుకుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని