ఆయ్‌ కండ్రిగ కోవాండి!

పూతరేకులు, పిచ్చుకగూళ్లు... కాజాలు ఇలా గోదావరి పేరుచెబితే ఎన్నో రుచులు గుర్తుకొస్తాయి. ఆ జాబితాలోదే కండ్రిగ కోవా కూడా. గోదావరి జిల్లాల నుంచి విదేశాలకు కూడా వెళ్తున్న ఈ కోవా రుచి కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం రండి...   

Updated : 17 Aug 2022 12:20 IST

పూతరేకులు, పిచ్చుకగూళ్లు... కాజాలు ఇలా గోదావరి పేరుచెబితే ఎన్నో రుచులు గుర్తుకొస్తాయి. ఆ జాబితాలోదే కండ్రిగ కోవా కూడా. గోదావరి జిల్లాల నుంచి విదేశాలకు కూడా వెళ్తున్న ఈ కోవా రుచి కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం రండి..

   

కోనసీమ జిల్లా కొత్తపేటకు సుమారు 5 కి.మీ దూరంలో ఉన్న కండ్రిగ గ్రామమే ఈ కోవాకు పుట్టినిల్లు. 22 ఏళ్ల క్రితం సూరవరపు వీరరాఘవయ్య కాఫీ హోటల్‌ ప్రారంభించారు. ఈ హోటల్‌లో రోజూ పాలు మిగిలిపోవటంతో, వాటితో కోవా చేసి విక్రయించాలనుకున్నారాయన. అలా మొదలైందీ కోవా ప్రస్థానం. మామూలు కోవాలతో పోలిస్తే దీని రుచి ప్రత్యేకంగా ఉండటానికి కారణం... ఊకపొయ్యిమీద కాచే పాలు. ఎన్ని లీటర్ల పాలనైనా ఊక పొయ్యి మీదే కాచి కోవాని తయారు చేస్తారు. అలాగే దీని తయారీకి ప్యాకెట్‌ పాలను కాకుండా.. చుట్టు పక్కల గ్రామాల రైతుల నుంచి స్వచ్ఛమైన పాలను సేకరించి తయారుచేస్తారు. 500 లీటర్ల చిక్కని పాల నుంచి 100 కేజీల పాలకోవా తయారుచేసి.. వాటిని 25గ్రాములు, 50గ్రాముల చొప్పున బిళ్లలుగా మారుస్తారు.

కోనసీమ రుచి విదేశాలకు..

కండ్రిగ కోవా రుచి కోనసీమను దాటి ఎప్పుడో విదేశాలకూ పాకింది. రోజుకు 40 నుంచి 60 కేజీల వరకూ కోవాను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సరఫరా చేస్తారు. విదేశాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలు, విద్యార్థులు వారి బంధువుల ద్వారా కోవాను తెప్పించుకుంటారు. ఆర్డర్‌ద్వారా తమిళనాడు, కేరళ, బెంగుళూరు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర 10 రాష్ట్రాలకు దీన్ని సరఫరా చేస్తారు. కోవా ఖ్యాతి ఖండాంతరాలు దాటడంతో స్థానిక మహిళలకు ఉపాధి కూడా అందుతోంది.  

- ఉప్పాల రాజా పృథ్వీ, ఈనాడు, రాజమహేంద్రవరం 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని