ఈ కుష్కా ముందు బిర్యానీ బలాదూర్‌..

కుష్కా గురించి ఎప్పుడైనా విన్నారా? చూడ్డానికి బిర్యానీలా ఉంటుంది కానీ.. దీన్లో చికెన్, మటన్‌లాంటి వాటిని కలపరు. బిర్యానీ తయారీకి ఉండేంత హంగామా కూడా ఉండదు. కుర్మాతో కలిపి వడ్డిస్తారు. ఒకరకంగా పేదోడి బిర్యానీ అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు,

Updated : 14 Aug 2022 12:21 IST

కుష్కా గురించి ఎప్పుడైనా విన్నారా? చూడ్డానికి బిర్యానీలా ఉంటుంది కానీ.. దీన్లో చికెన్, మటన్‌లాంటి వాటిని కలపరు. బిర్యానీ తయారీకి ఉండేంత హంగామా కూడా ఉండదు. కుర్మాతో కలిపి వడ్డిస్తారు. ఒకరకంగా పేదోడి బిర్యానీ అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో కుష్కా పేరు బాగానే వినబడుతుంది. అయితే వీటన్నింట్లో జడ్చర్ల కుష్కా చాలా ప్రత్యేకం అంటారు దాని రుచి తెలిసిన అభిమానులు.. 

హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకెళ్లే జాతీయ రహదారిని ఆనుకొని జడ్చర్ల కొత్త బస్టాండుకు కూతవేటు దూరంలో ఉంటుందీ కుష్కా హోటల్‌. పేరు జామ్‌ జామ్‌. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, కొత్తకోట, షాద్‌నగర్‌ తదితర పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు, పర్యాటకులు, ప్రయాణికులు, దూర ప్రయాణాలు చేసే యాత్రికులు ఈ కుష్కా హోటల్‌ దగ్గర బారులు తీరతారు. సాధారణంగా బయటకు వస్తే బిర్యాని తినేందుకే ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. కానీ జడ్చర్లకి వస్తే ఈ కుష్కా తినడానికే ఇష్టపడతారట. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తక్కువ ధరలో అందే రుచికరమైన వంటకంగా ఇది మారింది. ఈ కుష్కాకి తోడుగా టొమాటో చట్నీ, గుత్తి వంకాయ కూర, మరో రెండు చట్నీలతో కలిపి కుష్కాని అందిస్తారు. ఈ హోటల్‌ని ముగ్గురు అన్నదమ్ములు కలిసి నడిపిస్తున్నారు. రోజుకు 3 క్వింటాళ్ల బియ్యాన్ని వారుస్తారు. ప్లేట్ రూ.80. ఉదయం మొదలైన రద్దీ సాయంత్రం కూడా కొనసాగుతుందంటే దీనికున్న గిరాకీ అర్థమవుతుంది.

 - జె. జ్యోతి,  హైదరాబాద్‌.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని