కరకరలాడే కుల్చాలు ఇంట్లోనే..

నాకు కుల్చా అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో తయారుచేయబోతే కుదరలేదు. హోటల్‌ స్టయిల్లో ఎలా చేసుకోవాలో కాస్త చెప్పండి!

Updated : 30 Jul 2023 06:57 IST

నాకు కుల్చా అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో తయారుచేయబోతే కుదరలేదు. హోటల్‌ స్టయిల్లో ఎలా చేసుకోవాలో కాస్త చెప్పండి!

కుల్చా లేదా స్టఫ్‌డ్‌ కుల్చాలను మీలానే చాలామంది ఇష్టపడతారు. హోటల్‌ తరహాలో రావాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి..

* కుల్చా తయారీలో మైదా వాడతారు కనుక సాగకుండా, తుంచడానికి వీలుగా మృదువుగా ఉండాలంటే పిండిలో పెరుగు, తగినంత ఈస్ట్‌ కలిపి, రెండు గంటలపాటు నానపెడితే పిండి ఉబ్బి కుల్చాలు మృదువుగా వస్తాయి. కొన్ని ప్రదేశాల్లో ఈస్ట్‌కు బదులు బేకింగ్‌ పౌడర్‌ లేదా బేకింగ్‌ సోడా వాడతారు. ఏ పద్ధతిలోనైనా రెండు గంటలు తప్పనిసరిగా నానబెట్టాలి.

* కుల్చా తయారీలో మైదాపిండిలో ఉప్మారవ్వ కలిపితే క్రంచీగా టేస్టీగా వస్తాయి. ఉప్మారవ్వ వాడినప్పుడు ముందుగా రవ్వని పెరుగుతో కలిపి, పావుగంట నాననిచ్చి తర్వాత మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు కలిపి కుల్చా చేసుకోవచ్చు.

* పిండిలో ఒకటిన్నర చెంచా పంచదార కలిపితే చక్కటి రుచి వస్తుంది.

* నానపెట్టిన పిండిని బాగా కలపాలి. పిండి ఏమాత్రం జారుగా ఉన్నా కుల్చా కుదరదు. కనుక పిండిని గట్టిగా కలిపి, మృదువుగా వచ్చేవరకూ మెదపాలి.

* ఆరోగ్యం గురించి ఆలోచించేవారు మైదా బదులు గోధుమ పిండి ఉపయోగించవచ్చు.

* ఈస్ట్‌తోబాటు ఉప్పు వేయకూడదు. చివర్లోనే కలపాలి.

* అవెన్‌ లేనట్లయితే కుల్చా లను పెనంమీద ఎక్కువ సెగలో రెండువైపులా తిప్పుతూ, వెన్న రాస్తూ చేసుకోవచ్చు. కుల్చా కరకరలాడాలంటే పెనంపై కొద్దిగా ఉప్పునీళ్లు చల్లి, తర్వాత వేయించాలి.

శ్రీదేవి, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణురాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని