ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వద్దన్న చిట్టి పాపాయి

వయసుతో ప్రమేయం లేకుండా చిన్నా పెద్దా అందరికీ నచ్చుతాయి ఫ్రెంచ్‌ ఫ్రైస్‌. ఆ రుచికి ఎంతటి వాళ్లయినా దాసులైపోతారు.

Updated : 01 Oct 2023 05:23 IST

వయసుతో ప్రమేయం లేకుండా చిన్నా పెద్దా అందరికీ నచ్చుతాయి ఫ్రెంచ్‌ ఫ్రైస్‌. ఆ రుచికి ఎంతటి వాళ్లయినా దాసులైపోతారు. కానీ ఓ బుడిబుడి అడుగుల బుజ్జిపిల్ల- ఫ్రైస్‌ మంచిది కాదంటూ చిరాకుపడింది. ఆ చిన్నారి చేష్టకి అక్కడున్నవాళ్లంతా ముగ్ధులయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటారా?! మామూలుగా అందర్లాగే అమ్మానాన్నలతో కలిసి హోటల్‌కి వెళ్లిందో చిట్టి పాపాయి. సర్వ్‌ చేసిన ప్లేటులో ఫ్రైస్‌ను చూసి సంతోషించకపోగా.. వాటిని వెయిటర్‌కి తిరిగిచ్చేసింది. ఎందుకని అడిగితే ‘మా నాన్న వీటిని చాలా తినేస్తున్నారు’ అంది. ‘అవునా.. పోనీ నువ్వు తినొచ్చుగా’ అంటే.. ‘ఉహూ.. ఇవి జంక్‌.. మంచిది కాదు.. నేను స్ట్రాబెర్రీస్‌ తింటా.. అవే మంచిది’ అంది. ఇలాంటివి పెద్దవాళ్లు చెబితే.. నీతి సూత్రాలు వల్లిస్తున్నట్టు ఉంటుందే తప్ప రవంత ఆసక్తి కలగదు. కానీ మాటలు కూడా సరిగ్గా రాని చిట్టి పిల్ల.. అందునా ఎవరో చెప్పిస్తుంటే చిలక పలుకులు పలకడం కాదు.. తనంతట తానే చెబుతుంటే ముచ్చటేయదా మరి! పైగా అద్భుతమనిపించే ఎక్స్‌ప్రెషన్స్‌! ఇన్‌స్టాగ్రాంలో ‘హనాయా అండ్‌ మామ్‌’ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఈ రీల్‌ లక్షలాదిమంది మనసులు దోచుకుంది. ఇదెంత వైరలైందంటే.. ఇప్పటిదాకా ఒక కోటీ 72 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఫన్నీ కామెంట్స్‌తో సిసింద్రీని తెగ మెచ్చుకుంటున్నారు. వీలైతే.. మీరూ ఓ లుక్కేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని