Dosa-Breakfast: వెరైటీ దోశ.. చాలా చాలా నచ్చేస్తుంది..

మినప్పిండి, బియ్యప్పిండి దోశలు సాధారణం. ఎప్పుడూ అదే అంటే విసుగొస్తుందని రవ్వ దోశ, టొమాటో దోశ.. అంటూ చాలా రకాలు చేయడం తెలిసిందే.

Updated : 05 Nov 2023 08:00 IST

మినప్పిండి, బియ్యప్పిండి దోశలు సాధారణం. ఎప్పుడూ అదే అంటే విసుగొస్తుందని రవ్వ దోశ, టొమాటో దోశ.. అంటూ చాలా రకాలు చేయడం తెలిసిందే. అంతకంటే ఇంకొంచెం ప్రత్యేకంగా ఉండాలని.. మా ఇంట్లో కంద దోశ వేసుకుంటాం. ఈ దుంపలో దురద లక్షణాలుంటాయిగా అనుకుంటున్నారు కదూ! మరేం ఫరవాలేదు.. కొంచెం మందంగా ఉండే ఈ దుంపను చక్కగా పీల్‌ చేసి.. ఉప్పు నీళ్లలో నానబెట్టాలి. కొంచెంసేపు గనుక అలా ఉంచామంటే.. ఇక ఏ ఇబ్బందీ ఉండదు. ఇంతకీ దీంతో దోశ ఎలా చేయాలంటే.. దుంపను నీళ్ల లోంచి తీసి ఇంకోసారి కడిగి, ముక్కలుగా తరగాలి. మూడు గంటలు నానబెట్టిన పెసరపప్పులో నీళ్లు వంపేసి.. మిక్సీ జార్‌లో వేయాలి. దానికి.. కంద ముక్కలు, అంగుళం సైజు అల్లంముక్క, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని నీళ్లు జోడించి గ్రైండ్‌ చేస్తే పిండి సిద్ధమైపోతుంది. ఈ మిశ్రమానికి కాస్త బియ్యప్పిండి జోడిస్తే దోశలు మరింత క్రిస్పీగా వస్తాయి. పల్లీ చట్నీతో హ్యాపీగా తినొచ్చు. పిండి పల్చన కాకుండా గట్టిగా రుబ్బుకుంటే ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి.. దిబ్బరొట్టె కూడా చేసుకోవచ్చు. ఈ వెరైటీ దోశ మీకూ నచ్చుతుంది.. ఒకసారి ప్రయత్నించి చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని