కుక్కర్‌ కాఫీ.. తాగి చూద్దామా!

మనమంతా ప్రెషర్‌ కుక్కర్‌లో కందిపప్పు, కూరగాయలు ఉడికిస్తాం. కానీ.. ఒక స్ట్రీట్‌ వెండర్‌ కుక్కర్‌తో కాఫీ తయారుచేస్తున్నాడు. ఫిల్టర్‌ కాఫీ, ఇన్‌స్టంట్‌ కాఫీ తెలుసు కానీ.. ఈ కుక్కర్‌ కాఫీ ఏంటి అనిపిస్తోంది కదూ!

Published : 12 Nov 2023 00:42 IST

మనమంతా ప్రెషర్‌ కుక్కర్‌లో కందిపప్పు, కూరగాయలు ఉడికిస్తాం. కానీ.. ఒక స్ట్రీట్‌ వెండర్‌ కుక్కర్‌తో కాఫీ తయారుచేస్తున్నాడు. ఫిల్టర్‌ కాఫీ, ఇన్‌స్టంట్‌ కాఫీ తెలుసు కానీ.. ఈ కుక్కర్‌ కాఫీ ఏంటి అనిపిస్తోంది కదూ! రొటీన్‌కు భిన్నంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తేనే కదా ఆకట్టుకునేది. అతడెంత చమత్కారి అంటే.. తన సైకిల్‌నే కాఫీ దుకాణంగా మార్చేసి.. స్టవ్వు, స్టీల్‌ బకెట్‌, కాఫీ కప్పులు, పాలూ, పంచదార లాంటి సరంజామా అంతా పొందిగ్గా సర్దేశాడు. అతడు వాడుతోంది మామూలు కుక్కర్‌ కాదు, కొంచెం ప్రత్యేకమైంది. దానికి- లోహపు పైపు అమర్చి ఉంది. కుక్కర్‌లో ఓ తపేలా ఉంచి.. అందులో పాలు, కాఫీ పొడి, పంచదార వేస్తాడు. కాఫీ తయారవగానే పిడిగుబ్బను (నాబ్‌) వదులు చేస్తాడు. అంతే.. పైపులోంచి జగ్గులోకి పొగలు, బుడగలతో వహ్వా అనిపించే కాఫీ పడుతుంది. దాన్ని కప్పుల్లోకి ఒంపి.. కస్టమర్లకు అందిస్తాడు. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫుడీ’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో.. ‘మీరెప్పుడైనా కుక్కర్‌వాలీ కాఫీ తాగారా?’ కాప్షన్‌తో అలరిస్తోంది. ఇప్పటి దాకా దాదాపు 40 లక్షల వ్యూస్‌, లక్షన్నర లైక్స్‌ వచ్చాయి. సరదా కామెంట్లకూ కొదవ లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని