Sugar Free: షుగర్‌ ఫ్రీ అంటే నమ్మేయకండి!

చేదును మిగిల్చే తియ్యటి జబ్బు మధుమేహం. ఆ బాధకు భయపడి.. స్వీట్లూ, పండ్లూ ఎలాగోలా త్యాగం చేస్తారు. కానీ టీ తాగొద్దంటేనే దుఃఖం ముంచుకొస్తుంది. చప్పటి చాయ్‌ తాగలేక కృత్రిమ పంచదార సాచెట్లు వాడుతుంటారు.

Updated : 28 Jan 2024 07:35 IST

చేదును మిగిల్చే తియ్యటి జబ్బు మధుమేహం. ఆ బాధకు భయపడి.. స్వీట్లూ, పండ్లూ ఎలాగోలా త్యాగం చేస్తారు. కానీ టీ తాగొద్దంటేనే దుఃఖం ముంచుకొస్తుంది. చప్పటి చాయ్‌ తాగలేక కృత్రిమ పంచదార సాచెట్లు వాడుతుంటారు. అలాగే చూయింగ్‌ గమ్స్‌,  ప్రొటీన్‌ బార్స్‌, శీతల పానీయాలు, ఇంకా అనేక ఆహార పదార్థాల్లో తీపి లేదని చెబుతూ ‘షుగర్‌ ఫ్రీ’ అని రాస్తుంటారు. నిజానికి వాటిల్లో పంచదార దాగే ఉంటుంది. ఈ విషయం గురించి పోషకాహార నిపుణుడు కిరణ్‌ కుక్రుజా తన ఇన్‌స్టాలో- ‘ఈ దాగి ఉన్న స్వీటెనర్లు ఇంకా ఇంకా తినాలనిపించేట్లు ప్రేరేపిస్తాయి. జీర్ణప్రక్రియను దెబ్బతీస్తాయి. గట్‌ ఆరోగ్యానికి భంగం కలిగిస్తాయి. రుచుల్లో మార్పు తెస్తాయి. ఈ హిడెన్‌ షుగర్‌ వినియోగంతో అనేక వ్యాధులు దాడిచేసే అవకాశమూ ఉంది. బరువు పెరుగుతారు. హైబీపీ వస్తుంది. మధుమేహం తగ్గకపోగా ఎక్కువవుతుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె జబ్బులూ వస్తాయి. ఇన్ని మాటలెందుకు.. ఈసారి ‘షుగర్‌ ఫ్రీ’ అని రాసి ఉన్న ప్యాకెట్‌ మీద అందులో ఏమేం పదార్థాలున్నాయో తెలుసుకునేందుకు ఇచ్చిన జాబితా చూడండి. కేన్‌ క్రిస్టల్స్‌, కేన్‌ షుగర్‌, లిక్విడ్‌ ఫ్రక్టోజ్‌, కార్న్‌ స్వీట్‌నర్‌, కార్న్‌ సిరప్‌, క్రిస్టల్‌ డిక్స్‌ట్రోజ్‌, బ్రౌన్‌ షుగర్‌, మాపుల్‌ సిరప్‌, ఫ్రక్టోజ్‌ స్వీట్‌నర్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ కాన్‌సన్‌ట్రేట్‌, మాల్ట్‌ సిరప్‌, మొలాసెస్‌, కేన్‌ జ్యూస్‌, హై ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌.. ఇలా పంచదారకు ఉన్న ప్రత్యామ్నాయ పదాలెన్నో కనిపిస్తాయి. రాతికి రూపం, పేరు మార్చినంతలో స్వభావం మారిపోదుగా! అందుకే షుగర్‌ ఫ్రీ అని లేబుల్‌ తగిలించినంతలో మాయలో పడకండి!’ అంటూ ముఖ్యమైన సమాచారం పోస్ట్‌ చేశారాయన. అదీ సంగతి. పంచదార వీలైనంత తగ్గించండి. మరీ కావాలనిపిస్తే.. పటికబెల్లం వాడండి. అంతేతప్ప ‘షుగర్‌ ఫ్రీ’ జోలికి వెళ్లకండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని