జ్ఞాపకశక్తిని పెంచే వేరుశనగ

ప్రయాణాల్లో పల్లీలు తింటుంటాం. ఇవి రుచిగానూ ఉంటాయి, ఆరోగ్యాన్నీ ఇస్తాయి. వేరుశనగపప్పుల్లో క్యాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫొలేట్‌, భాస్వరం, మాంగనీస్‌, మెగ్నీషియం, బి1, బి3, బి6, ఇ- విటమిన్లు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.

Published : 04 Feb 2024 00:03 IST

ప్రయాణాల్లో పల్లీలు తింటుంటాం. ఇవి రుచిగానూ ఉంటాయి, ఆరోగ్యాన్నీ ఇస్తాయి. వేరుశనగపప్పుల్లో క్యాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫొలేట్‌, భాస్వరం, మాంగనీస్‌, మెగ్నీషియం, బి1, బి3, బి6, ఇ- విటమిన్లు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్‌ చర్మాన్ని సంరక్షిస్తాయి. పల్లీల్లోని పోలీ, మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫాట్స్‌, విటమిన్‌ బి3లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్‌ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది. మూడ్స్‌ను క్రమబద్ధంచేసి, యాంటీడిప్రెసెంట్లుగా పనిచేసే ఎమినో యాసిడ్స్‌ పల్లీలు అందిస్తాయి. వాటివల్ల ఆందోళన తలెత్తదు. వేరుశనగ ప్రొటీన్లు ఉన్న ఆహారం అయినందున ఆకలి తీరుతుంది. ఇంకా ఇంకా తినాలన్న భావన లేక సంతుష్టి కలుగుతుంది. దాంతో బరువు పెరగరు. రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలెన్నో అందుతాయి, అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.

పల్లీలను వేయించి తింటే మరింత రుచిగా ఉండే మాట నిజం. కానీ వీటిని ఉడికించి లేదా నానబెట్టి తినడమే మంచిది. మొలకలు వచ్చాక తింటే మరీ శ్రేష్ఠం. వీటికి కొంచెం బెల్లం జతచేసి తింటే పైత్యం చేయదు. ఇన్ని లాభాలు చేకూర్చే పల్లీలను తగిన మోతాదులో తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి బాదం, జీడిపప్పులంత ఖరీదు కాదు కనుక అందరికీ అందుబాటులో ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని