ఇది సరైన సమయమేనా?

లాక్‌డౌన్‌ సడలింపుల సమయం పెరగడంతో స్థిరాస్తి మార్కెట్‌ ఊపిరి పీల్చుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. గతంలో ఒప్పందాలు చేసుకుని పెండింగ్‌లో ఉన్న లావాదేవీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతుండటంతో కొత్త ప్రాజెక్టుల్లో సందర్శనలు మొదలయ్యాయి. మున్ముందు లాక్‌డౌన్‌

Updated : 05 Jun 2021 00:58 IST

ఈనాడు, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సడలింపుల సమయం పెరగడంతో స్థిరాస్తి మార్కెట్‌ ఊపిరి పీల్చుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. గతంలో ఒప్పందాలు చేసుకుని పెండింగ్‌లో ఉన్న లావాదేవీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతుండటంతో కొత్త ప్రాజెక్టుల్లో సందర్శనలు మొదలయ్యాయి. మున్ముందు లాక్‌డౌన్‌ వేళలను పగటిపూట పూర్తిగా సడలించే అవకాశం ఉండటంతో జూన్‌ మూడోవారం నుంచి మార్కెట్‌ సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్‌ రెండో ఉద్ధృతి కట్టడికి దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.  నిర్మాణ పనులు చాలా రాష్ట్రాల్లో నెమ్మదిగా సాగుతున్నాయి. 7 నగరాల్లో 4.22 లక్షల ఇళ్లు  వేర్వేరు దశలో ఉన్నాయి. వాస్తవంగా ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని కొనుగోలుదారులకు అందించాలి. రూ.40 లక్షల ధరల శ్రేణిలోని అందుబాటు ఇళ్లే దాదాపు 40 శాతం ఉన్నాయి. కొవిడ్‌తో ఇవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని స్థితిలో నిర్మాణదారులు ఉన్నారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు మినహాయించారు.అయినా పనులపై ప్రభావం కనిపిస్తోంది. బడా నిర్మాణ సంస్థలవి తప్ప చాలావరకు చిన్న బిల్డర్ల పనులు ముందుకు సాగడం లేదు.  
ఎదురయ్యే సవాళ్లు..
* నిర్మాణం పూర్తైన ఇళ్ల అమ్మకానికి ఎక్కువకాలం పట్టే సూచనలు ఉన్నాయి. దీంతో ఇన్వెంటరీ పెరుగుతుందని బిల్డర్లు గుబులు చెందుతున్నారు. ఫలితంగా నిర్మాణదారులకు నగదు లభ్యతలో ఇబ్బందులు మరికొంతకాలం తప్పేలా లేవు.
* లాక్‌డౌన్లతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం కష్టమే. ఏడాది ఆలస్యంగా నడుస్తున్నాయి. మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.
* నిర్మాణ ముడిసరుకుల వ్యయం పెరగడం కలవరపరుస్తోంది. కూలీల ఖర్చులు పెరిగాయి. ఇళ్ల ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
* ఇంటినుంచి పనితో కార్యాలయాల డిమాండ్‌ స్తబ్ధుగాఉంటే ఆ ప్రభావం గృహ నిర్మాణంపై ఉంటుందని అంచనా.
* అనిశ్చితితో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. కొవిడ్‌ భయం తొలగేవరకు ఎదురుచూపులు తప్పవు.  
భవిష్యత్తుపై ఆశలు..
* కరోనా ప్రభావం మార్కెట్‌పై తాత్కాలికం కావడం ఊరట. మొదటివేవ్‌ నుంచి వేగంగా బయటపడింది. రెండో వేవ్‌లోనూ ఇదే పునరావృతం అవుతుందనే భరోసాలో బిల్డర్లు ఉన్నారు.
* ప్రవాస భారతీయుల పెట్టుబడులు స్థిరాస్తి రంగంలో పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రూపాయి విలువ పడితే ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు.
* గృహ రుణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది ఇల్లు కొనేందుకు మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నారు.
మంచి అవకాశమేనా..
* మార్కెట్‌ పెరుగుతున్నప్పటి కంటే పడినప్పుడు కొనడం కొనుగోలుదారులకు కలిసొస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
* విక్రయాలు మందకొడిగా ఉన్నాయి. ఇప్పుడు బేరమాడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో బిల్డర్లు కొంతమేర ధరలు తగ్గించేందుకు మొగ్గు చూపుతారు.
* మున్ముందు ధరలు పెరగడమే తప్ప తగ్గేందుకు అవకాశాలు తక్కువ. కాబట్టి పెరగకముందే కొనుగోలు చేస్తే ఆ మేరకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని