మనశ్శాంతికి మార్గం

శిఖిధ్వజుడనే మహారాజు భార్య చూడాల. ఆమెది గొప్ప మనసు, త్యాగబుద్ధి. ఓ రాత్రి హఠాత్తుగా రాజవిధులను వదిలి సన్యాస జీవనం గడపడానికి వెళ్లిపోయాడు మహా రాజు.

Published : 06 Apr 2023 00:42 IST

శిఖిధ్వజుడనే మహారాజు భార్య చూడాల. ఆమెది గొప్ప మనసు, త్యాగబుద్ధి. ఓ రాత్రి హఠాత్తుగా రాజవిధులను వదిలి సన్యాస జీవనం గడపడానికి వెళ్లిపోయాడు మహా రాజు. చూడాల అతణ్ణి వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లింది. ఓ చెట్టు కింద ధ్యానం చేస్తున్న రాజును చూసింది. భంగం కలిగించ కూడదని దూరం నుంచే వెను తిరిగింది. కొన్ని రోజుల తర్వాత మారు వేషంలో వెళ్లి రాజును కలిసి వివరాలు అడిగింది. అతను గత జీవిత వైభవాన్ని తెలియజేసి, ప్రస్తుతం అన్నీ త్యజించి తపస్సు చేస్తున్నానని చెప్పాడు. ‘ఇన్నాళ్లుగా జపం చేస్తున్నారు కదా! మరి ప్రశాంతత చేకూరిందా? మోక్షానుభూతి కలిగిందా?’ అనడిగింది. బదులుగా ‘మోక్షం సంగతి అటుంచి మనశ్శాంతి కూడా కలగ లేదు’ అన్నాడు. అప్పుడు మహారాణి ‘రాజా! మనసు పరిశుద్ధం కానంతవరకూ ఎక్కడికెళ్లినా శాంతి లభించదు. మీ విధులను నిస్సంగబుద్ధితో నిర్వహిస్తే మనసు పవిత్రమవుతుంది. అప్పుడు మీరు అంతఃపురంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా ప్రశాంతతకు భంగం వాటిల్లదు. ఆధ్యాత్మిక పురోగమనం ప్రాప్తిస్తుంది’ అంది. రాజుకు నిజమేననిపించింది. రాజ్యానికి తిరిగెళ్లి ప్రజలకు సేవ చేస్తూ నిబద్ధతతో విధులను నిర్వర్తించాడు. అలా ప్రశాంత, పవిత్రత, ఆధ్యాత్మిక ఉన్నతి ప్రాప్తించాయి. ఇక ఆనందానికి కొదవ లేకపోయింది.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని