నువ్వు చందనమైతే.. నేను జలం

కవి, భక్తుడు, సమాజసేవకుడు సంత్‌ రవిదాసు ఎందరికో ఆరాధ్యుడు. ప్రేమ, శిష్టాచారం, వినమ్రత, సమర్పణ, సత్సంగం, పరోపకారం, దయార్ద్రహృదయం, సమయపాలన లాంటి విషయాలను ప్రబోధించేవారు.

Published : 10 Aug 2023 00:22 IST

వి, భక్తుడు, సమాజసేవకుడు సంత్‌ రవిదాసు ఎందరికో ఆరాధ్యుడు. ప్రేమ, శిష్టాచారం, వినమ్రత, సమర్పణ, సత్సంగం, పరోపకారం, దయార్ద్రహృదయం, సమయపాలన లాంటి విషయాలను ప్రబోధించేవారు. తొట్టిలోని నీళ్లలోనే గంగామాతను దర్శించుకున్న మహానుభావుడు. ‘ప్రభూ! నువ్వు చందనమైతే నేను జలాన్ని. నీ వల్లే నా అణువణువూ శీతలం, సుగంధభరితం అవుతుంది. నువ్వు మేఘమైతే నేను నెమలిని. చంద్రుణ్ణి చూసిన చకోరపక్షిలానే ఉంటుంది నా పరిస్థితి. ప్రభూ! నువ్వు దీపమైతే నేను ఒత్తిని. ఆ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. బంగారానికి తావి అబ్బినట్లు నీ వల్లే నేను పరిమళిస్తాను. సర్వాంతర్యామి అయిన నీకు నేను దాసుణ్ణి..’ అంటూ దైవాన్ని స్మరిస్తూ తరించే వాడు. ‘జన్మను బట్టి కాదు.. కర్మలను అనుసరించే చిన్న, పెద్ద అవుతారు. నిర్మలత్వంలోనే పరమాత్ముడు ఉంటాడు, ద్వేషం ఉన్నచోట కాదు. భ్రమల నుంచి బయటపడితేనే భగవంతుని ప్రాప్తి లభిస్తుంది. గర్వాన్ని వదిలిపెడితేనే విజయం లభిస్తుంది. భారీకాయం ఉన్న ఏనుగు చక్కెర కణాలను తీయలేదు, కానీ చీమలకు ఆ పని మహా సులువు. ఇహలోక సుఖాలు మోక్షానికి అవరోధం’- ఇలా సంత్‌ రవిదాసు ప్రబోధాలు అమృతాన్ని తలపిస్తాయి. కృష్ణ భక్తురాలెన మీరాబాయి రవిదాసును తన గురువుగా భావించేదట.

డాక్టర్‌ నరసింహరావు కల్యాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని