కర్మఫలం

కౌండిన్య మహర్షి ఓసారి వైకుంఠానికి వెళ్లాడు. మార్గమధ్యంలో తాను చూసిన కొన్ని విచిత్ర దృశ్యాల గురించి శ్రీమహావిష్ణువు వద్ద ప్రస్తావించాడు.

Published : 21 Sep 2023 00:22 IST

కౌండిన్య మహర్షి ఓసారి వైకుంఠానికి వెళ్లాడు. మార్గమధ్యంలో తాను చూసిన కొన్ని విచిత్ర దృశ్యాల గురించి శ్రీమహావిష్ణువు వద్ద ప్రస్తావించాడు. ‘స్వామీ! ఒక మామిడిచెట్టు విరగ కాసింది. సమృద్ధిగా ఆకులు, ఫలాలున్నా దాని మీద ఒక్క పక్షీ లేదు. కొంత దూరం వచ్చాక ఓ ఆవు కనిపించింది. పచ్చని పొలంలో తిరుగాడుతూ కూడా.. అది గడ్డిని తినలేకపోతోంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే గంతులేస్తున్న ఏనుగు, నేలపై దొర్లుతున్న గాడిద కనిపించాయి. వీటి అంతరార్థమేంటో బోధపడలేదు! మీరైనా చెప్పండి’ అన్నాడు. అప్పుడు ఆ వైకుంఠధాముడు మందహాసంతో ‘మునివర్యా! తమరు చూసిన మామిడిచెట్టు గత జన్మలో వేదవిద్వాంసుడు. అతడు పాండిత్యాన్ని తన వరకే పరిమితం చేసుకున్నాడు. తన జ్ఞానాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. అందుకే ఈ జన్మలో పక్షులు వాలని చెట్టుగా మిగిలాడు. ఆ ఆవు పూర్వజన్మలో బీడుభూమి. ఎవరికీ ఉపయోగపడని కారణంగా, ఈ జన్మలో ఆకుపచ్చని గడ్డి కళ్లెదురుగా ఉన్నా తినలేని దైన్యస్థితిలో ఉంది. ఏనుగు, గాడిదలు గతించిన జన్మలో విశృంఖల జీవనాన్ని గడిపిన ఉద్వేగ స్వభావులు. వారి తుంటరితనం, దుడుకు ప్రవర్తనల వల్ల ఈ జన్మలో ఇలా గంతులేస్తూ, రంకెలేస్తూ బతకాల్సి వచ్చింది. పరులకు ఉపయోగపడని జీవమైనా, జడపదార్థమైనా కర్మఫలాల్ని అనుభవించాల్సిందే’ అని వివరించాడు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని