రాజు కంటే సుఖం!

ఒకసారి చలితో బాధపడుతున్న పేదవాడికి ఇటుక బట్టీ కనిపించింది. దేవుడెంత మంచివాడో.. తనను చలి నుంచి రక్షించేందుకు వెచ్చగా ఏర్పాటు చేశాడు

Published : 19 Oct 2023 00:17 IST

కసారి చలితో బాధపడుతున్న పేదవాడికి ఇటుక బట్టీ కనిపించింది. దేవుడెంత మంచివాడో.. తనను చలి నుంచి రక్షించేందుకు వెచ్చగా ఏర్పాటు చేశాడు- అనుకుని.. దాని పక్కన సుఖంగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయానే ఆ ప్రాంత రాజు అటుగా వచ్చాడు. పక్కనున్న మంత్రినుద్దేశించి ‘రాత్రి ఎలా గడిచింది?’ అనడిగాడు రాజు. ప్రశ్నించింది తననే అనుకుని ‘కొంచెం మీకు గడిచినట్టు.. మరి కొంచెం మీ కంటే బాగా గడచినట్టు’ అని బదులిచ్చాడు పేదవాడు. రాజు అతణ్ణి భవనానికి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు.  ‘నీ మాటకు అర్థం ఏమిటి?’ కోపంగా అడిగాడు రాజు. అతడు భయంతో మౌనం వహించాడు. ‘రాజభవనంలో సర్వ సౌఖ్యాలతో నిద్రించిన నాకు, ఇటుక బట్టీ వద్ద పడుకున్న నీకు ఓకే విధంగా ఎలా గడిచిందో చెప్పు’ అన్నాడు రాజు కాస్త నెమ్మదించి. దానికతడు ‘తమరు పరుపుమీద పడుకుంటే నేను మట్టిలో నిద్రించాను. రెంటిలో మెత్తదనం ఉందిగా రాజా! నిద్రపట్టిన తర్వాత మీకు భవనంలో పడుకున్నానని స్మరణకు రానట్టే, నాకు బట్టీ వద్ద పడుకున్నానని గుర్తురాలేదు. కనుక ఇద్దరికీ రాత్రి ఒకలా గడిచినట్టే కదా రాజా’ అన్నాడు. ‘మరి నాకంటే బాగానే గడిచిందన్నావు.. అదెలా?’ అడిగాడు రాజు. ‘తమరికి మెలకువ రాగానే పాలన విషయాలు ఊపిరి సలపనివ్వవు. కానీ నాకలాంటి తలనొప్పులు లేనందున మీ కంటే బాగా గడిచినట్టు కదా ప్రభూ’ అన్నాడతడు. కోరికలూ, చింతలు లేని వ్యక్తి రాజు కంటే సుఖజీవి- అంటూ కబీర్‌ దాస్‌ చెప్పిన కథ ఇది.  

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని