విలువైన వ్యవసాయం

గురునానక్‌ చిన్నతనం నుంచి ధ్యానమగ్నుడై ఉండేవాడు. ఎక్కువ సమయం ధ్యానంలో ఉండటంతో తల్లితండ్రులు చాలా దిగులు పడేవారు. ఒకరోజు తండ్రి నానక్‌ని పిలిచి వ్యవసాయ పనులు చూసుకొమ్మని నచ్చజెప్పాడు. బదులుగా ‘నాన్నా! నేను మీరు చెప్పింది కాకుండా, వేరే వ్యవసాయం చేస్తున్నాను’ అన్నాడు నానక్‌.

Published : 23 Nov 2023 00:06 IST

(నవంబరు 27 గురునానక్‌ జయంతి)

గురునానక్‌ చిన్నతనం నుంచి ధ్యానమగ్నుడై ఉండేవాడు. ఎక్కువ సమయం ధ్యానంలో ఉండటంతో తల్లితండ్రులు చాలా దిగులు పడేవారు. ఒకరోజు తండ్రి నానక్‌ని పిలిచి వ్యవసాయ పనులు చూసుకొమ్మని నచ్చజెప్పాడు. బదులుగా ‘నాన్నా! నేను మీరు చెప్పింది కాకుండా, వేరే వ్యవసాయం చేస్తున్నాను’ అన్నాడు నానక్‌. తండ్రి ఆశ్చర్యంగా చూస్తుంటే.. ‘అవును నాన్నా! ఈ వ్యవసాయం మీరు చెప్పే వ్యవసాయం కంటే విలువైంది. ఎంతో శ్రేష్ఠమైన క్షేత్రం దొరికింది. ఇప్పుడిప్పుడే కొత్త విత్తనాలు మొలకెత్తుతున్నాయి. అవి వృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు ఇంకో పొలం మీద దృష్టి పెట్టలేను’ అంటూ చెప్పాడు నానక్‌. ఆ మాటలు విన్న తండ్రి ‘నాయనా! నీ వ్యవహారం వింతగా తోస్తోంది. నాకు తెలియకుండా నీకు పొలం ఎక్కడ దొరికింది? అసలింతకీ నువ్వు చేస్తున్న వ్యవసాయం ఏంటి?’ అనడిగాడు ఆశ్చర్యంగా. దానికి నానక్‌- ‘నా మనసే పొలం నాన్నా! మంచి ఆలోచనే నాగలి. దాంతోనే ఆ నేలను దున్నుతున్నాను. ఆనందమనే సాధనం పొలాన్ని ఎత్తుపల్లాలు లేకుండా చేస్తోంది. ఆ పొలంలో ప్రేమ అనే నీరు పారుతుంది. హరినామం అనే విత్తనాలు అందులో చల్లాను. భగవంతుడి కృపతో ముక్తి అనే ఫలసాయం లభిస్తుందనే విశ్వాసం ఇప్పుడిప్పుడే కలుగుతోంది’ అంటూ వివరించాడు. పుత్రుడి మాటలకు ఆ తండ్రి పులకించిపోయాడు. ఆ యువ నానక్‌- భవిష్యత్తులో గురునానక్‌గా ఎదిగి, ఎందరికో ఆధ్యాత్మిక ఆశ్రయాన్ని కల్పించాడు.

చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని