వాళ్లూ నా బిడ్డలే!

మన ఆధ్యాత్మికవేత్తల్లో శారదామాతకు ప్రత్యేక స్థానం ఉంది. మాత ఉద్బోధలు ఎందరినో ప్రభావితం చేసేవి. ఒకసారి ప్రసంగవశాత్తూ ‘నాయనలారా! ఈ ప్రపంచమంతా మీ సొంతమే. పరాయివారంటూ ఎవరూ లేరు’ అన్నారామె. శారదామాత జీవితాన్ని అధ్యయనం చేస్తే, ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించవచ్చు. ఆమె ఎవరినీ పరాయి వారిగా భావించలేదు.

Published : 23 Nov 2023 00:08 IST

న ఆధ్యాత్మికవేత్తల్లో శారదామాతకు ప్రత్యేక స్థానం ఉంది. మాత ఉద్బోధలు ఎందరినో ప్రభావితం చేసేవి. ఒకసారి ప్రసంగవశాత్తూ ‘నాయనలారా! ఈ ప్రపంచమంతా మీ సొంతమే. పరాయివారంటూ ఎవరూ లేరు’ అన్నారామె. శారదామాత జీవితాన్ని అధ్యయనం చేస్తే, ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించవచ్చు. ఆమె ఎవరినీ పరాయి వారిగా భావించలేదు.

కులం, మతం, జాతి, స్థాయి, ప్రాంతీయత, స్త్రీ, పురుష.. ఇలా ఏ భేదాలూ లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదరించేవారామె. దుర్మార్గులను, పతితులను కూడా ఆమె తన బిడ్డలుగా స్వీకరించారు.

ఒకసారి దుర్గాపూజ ఉత్సవాల్లో ఆమె తన మేనకోడళ్లకి వస్త్రాలు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అవి కొనడానికి ఒక బ్రహ్మచారిని బజారుకు పంపించారు.
అతను స్వదేశీ ఉద్యమానికి ప్రభావితుడైన వాడు. అందువల్ల మనదేశంలో తయారైనవే కొనాలనేది లక్ష్యం. దాంతో అతడు తెచ్చినవి కొంచెం ముతకగా ఉన్నాయి. అవి ఆమె మేనకోడళ్లకు నచ్చలేదు.

శారదామాత అవి ఇచ్చేసి, వాటి బదులు మంచి సన్నని వస్త్రాలు తెమ్మన్నారు. అలాంటివి విదేశాలవి కాబట్టి.. వాటిని ధరించకూడదని అతడు దృఢంగా నమ్మి.. తన అసమ్మతిని తెలియజేశాడు.

అప్పుడు శారదామాత ‘నాయనా! ఆ విదేశీయులు కూడా నా బిడ్డలే! నువ్వు సందేహించక వెళ్లు’ అన్నారు. ఆమె మాటలు బ్రహ్మచారిలో ఉన్న భేదబుద్ధిని పటాపంచలు చేశాయి. అతడు మారు మాట్లాడకుండా వెళ్లి సన్నని వస్త్రాలు తీసుకొచ్చాడు. ఈ చిన్న సంఘటన శారదామాత సమానత్వం, సమాదరణలకు నిదర్శనం.

చోడిశెట్టి శ్రీనివాసరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని