ఆషాఢం..నెలంతా పండుగే

తెలుగుమాసాల్లో నాలుగోది ఆషాఢం. పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలం ఆషాఢం. ఈ మాసంలో శుభకార్యాలేవీ తలపెట్టకూడదు. గృహ నిర్మాణానికి మాత్రం మంచిది.

Updated : 15 Jun 2023 06:31 IST

జూన్‌ 19 ఆషాఢమాసం ఆరంభం

చైత్రంలో ఉగాది, వైశాఖంలో హనుమ జయంతి, శ్రావణంలో కృష్ణాష్టమి, భాద్రపదంలో వినాయకచవితి.. ఇలా ఏ మాసంలోనైనా కొన్నే విశేష దినాలుంటాయి. కానీ ఆషాఢం నెలంతా ప్రత్యేకమే.. పండుగలూ పర్వాల వైభవమే..

తెలుగుమాసాల్లో నాలుగోది ఆషాఢం. పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలం ఆషాఢం. ఈ మాసంలో శుభకార్యాలేవీ తలపెట్టకూడదు. గృహ నిర్మాణానికి మాత్రం మంచిది. ఈ నెలలో ఇల్లు కడితే గృహస్థుకు ధనధాన్యాలు, పశువులు, రత్నాలు ప్రాప్తిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది. ఈ మాసం పుణ్యకార్యాలకు అనుకూలం కాదని నిషిద్ధ మాసం, శూన్యమాసం అన్నారు. కానీ ఆధ్యాత్మికంగా శుచిమాసం.
వసంతం ముగిసి వర్షరుతువు ఆసన్నమయ్యే సంధికాలమిది. వాతావరణ మార్పు వల్ల క్రిమి కీటకాలు విజృంభిస్తాయి. అప్పటికప్పుడు ఎక్కడపడితే అక్కడ పురుగులు పుట్టుకొస్తాయి. వాటి వల్ల మనకీ, పశుపక్ష్యాదులకీ కూడా అనారోగ్యం కలిగే అవకాశముంది. ఆషాఢంలో ఇత్తడి, కంచు, బంగారు, వెండి లాంటి లోహ వస్తువు లను శుభ్రం చేయడం ఆచారం. ఈ మాసంలో తరచూ అభ్యంగ స్నానం కూడదు. లక్ష్యపెట్టకుంటే జలుబూ, జ్వరం, జుట్టు రాలడం, రంగు మారడం, చుండ్రు లాంటి సమస్యలు తలెత్తుతాయని హితవు పలికారు. అలాగే గర్భిణులు ఆషాఢంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతారు.


గోరింటాకు ఎందుకు..

గౌరీదేవికి ఇష్టమైన గోరింటాకు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనేది ఆధ్యాత్మిక చింతన. శాస్త్రీయంగా చూస్తే ఆషాఢంలో వర్షాల వల్ల జలుబు, జ్వరాలు, అంటువ్యాధులు సోకే అవకాశముంది. గోరింటాకు వాటిని నివారిస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మరోగాలు, గాయాలు తగ్గుతాయి. పారాణిగా పెట్టుకోవడం వల్ల పాదాలు పగలవు. ఇలా అనేక ప్రయోజనాలున్నందున ఈ మాసంలో గోరింట పెట్టుకోవడం ఆచారమైంది.


ఆధ్యాత్మికతకు ఆషాఢం

ఆషాఢమాసం ఆధ్యాత్మికతకు తొలి మాసం. ఆషాఢ శుద్ధ షష్ఠి నాడు స్కంద వ్రతం చేసుకుని తరిస్తాం. శుద్ధ సప్తమిని భానుసప్తమిగా సూర్యారాధన చేస్తాం. ఆరోజు కాలపరిమాణంలో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఇది విశేషం. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. ఇదే తొలి ఏకాదశి. శ్రీమహావిష్ణువు శయనించే రోజు. అందుకే శయన ఏకాదశి అంటారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు అందరూ చాతుర్మాస్య దీక్ష చేపట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు దీక్ష పాటిస్తారు. ఆరోజు ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవడం శుభం. పూర్వం తొలి ఏకాదశినే సంవత్సరాదిగా వేడుక చేసుకునేవారు. తర్వాత చైత్రమాస ఆరంభదినం ఉగాది అయ్యింది. ఇక ఆషాఢ పూర్ణిమే వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ. ఈ మహా పర్వదినం రోజున శ్రీమన్నారాయణుడి అవతారమైన వ్యాసమహర్షిని అర్చిస్తారు. విద్యార్థులు గురుపూజ చేసి చదువులో రాణించాలని సంకల్పిస్తారు. గురుస్థానంలో నిలిచిన దత్తాత్రేయ స్వామిని, రాఘవేంద్రస్వామిని, సాయి భగవానుణ్ణి, ఆదిశంకరులను, దేవతల గురువైన బృహస్పతిని పూజించి, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.


నెలంతా పర్వదినాలే

ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి నాడే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది. ఆ రోజున శ్రీ వైష్ణవులందరూ గోదామాతను ఆండాళ్‌గా పూజించి, ఆ జగన్మాత రచించిన పాశురాలను పారాయణ చేసి, విశిష్టంగా ఆరాధిస్తారు. ఆషాఢ బహుళ సప్తమి భోగ సప్తమి. చెట్టుచేమలకు విశేషంగా పూజలు చేస్తారు. పంట పొలాల వద్ద జాతర నిర్వహిస్తారు. వ్యవసాయ ఫలానికి జాతర చేసేది ఈ మాసంలోనే. బహుళ ఏకాదశి కామదా ఏకాదశి. కామమంటే కోరిక, ముక్తి. కోరికలను తీరుస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది- అని విశ్వసిస్తూ ఈ పర్వదినాన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
పూరీ జగన్నాథుని రథయాత్ర ఆషాఢంలోనే జరుగుతుంది. ఏ మాసంలో అయినా కొన్ని రోజులే ప్రత్యేక దినాలుంటాయి. కానీ ఆషాఢ మాసంలో నెలంతా బోనాల వైభవంతో వీధులు కళకళ లాడటం తిలకిస్తాం. ఆది పరాశక్తికి బోనాలు సమర్పించి ఆశీస్సులు పొందుతారు. ఆషాఢం సముద్ర, నదీ స్నానాలకు కూడా ప్రసిద్ధమే. ఇంత విశిష్టమైంది ఆషాఢం. ఈ మాసంలో పెద్దల మాటలు అనుసరించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేసుకుందాం.

డా.పులిగడ్డ విజయలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని