ముహర్రం.. ఉపవాసం..

ఇస్లామిక్‌ నెలల్లో ‘ముహర్రం’ మొదటి నెల. ఏడాదిలోని పన్నెండు నెలల్లో నాలుగు నెలలు పవిత్రమైనవని, వాటిల్లో ముహర్రం నెల ఒకటన్నది ఖురాన్‌ ప్రకటన. ఇది అల్లాహ్‌కు ఎంతో ఇష్టమైన నెల.

Published : 27 Jul 2023 00:15 IST

ఇస్లామిక్‌ నెలల్లో ‘ముహర్రం’ మొదటి నెల. ఏడాదిలోని పన్నెండు నెలల్లో నాలుగు నెలలు పవిత్రమైనవని, వాటిల్లో ముహర్రం నెల ఒకటన్నది ఖురాన్‌ ప్రకటన. ఇది అల్లాహ్‌కు ఎంతో ఇష్టమైన నెల.

స్లామిక్‌ నూతన సంవత్సరానికి నాంది ముహర్రం. ఈ మాసానికి ఇస్లామ్‌ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముహర్రం నెల పదో తేదీని ‘ఆషూరా’ అంటారు. అష్ర్‌ అంటే పది అని అర్థం. ఆ అష్ర్‌ నుంచే ఆషూరా పదం వచ్చింది. యౌమె ఆషూరాకు, దైవప్రవక్తలకు అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజు ఎన్నో చారిత్రక సంఘటనలు జరిగినట్లు ఇస్లామ్‌ గ్రంథాలు చెబుతాయి.

ఇమామె హుసైన్‌ (రజి) అమరత్వం

యజీద్‌ అనే రాజు దుర్మార్గాలూ, దౌర్జన్యాలపై ఇమామె హుసైన్‌(రజి) పోరాడారు. ఆయన పరివారం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టింది. యుద్ధ విరామంలో ఇమామ్‌ నమాజు చేసుకుంటూ ఉండగా శత్రువు చాటుగా వచ్చి దాడి చేశాడు. ఆయన అక్కడికక్కడే నేలకొరిగి అమరులయ్యారు. ఇస్లామీయ చరిత్రలో ఎంతో పవిత్రత, ప్రాధాన్యత ఉన్న యౌమె ఆషూరా రోజునే హజ్రత్‌ ఇమామె హుసైన్‌(రజి) యాదృచ్ఛికంగా అమరత్వం పొందారు. ఆ గుర్తుగా ఆషూరా రోజున హజ్రత్‌ ఇమామెను అందరూ స్మరించుకుంటారు. కర్బలా ఘటన మనకు త్యాగస్ఫూర్తి పాఠాన్ని నేర్పుతుంది.

ఆషూరా ఉపవాసం..

పూర్వం బనీఇస్రాయీల్‌ జాతి ప్రజలు ఫిరౌన్‌ చక్రవర్తి పీడ విరగడైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆషూరా రోజు ఉపవాసం పాటించేవారు. ప్రవక్త మూసా(అలై) అల్లాహ్‌ అనుగ్రహానికి కృతజ్ఞతగా ఆరోజు ఉపవాసం పాటించారు. ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ దైవప్రవక్త(స) ఆషూరా రోజున ఉపవాసం పాటించడం అలవాటుగా చేసుకొని, ఇతరులనూ పాటించమని ఆదేశించారు. ఇస్లామీయ విద్వాంసులు ఆషూరా రోజుతోపాటు, దానికి ముందుదైన తొమ్మిదో రోజు కానీ, తర్వాతిదైన పదకొండో రోజు కానీ, లేదా రెండురోజులూ ఉపవాసాలు పాటించాలన్నారు. ‘దైవప్రవక్త(స) ఏ ఇతర రోజాకూ ఇవ్వనంత ప్రాముఖ్యం పవిత్ర రంజాన్‌ రోజులు, యౌమె ఆషూరా దినానికి ఇచ్చేవారు’ అన్నారు అల్లామా ఇబ్నె హమామ్‌.


ఇమామ్‌ హుసైన్‌(రజి) సూక్తులు

నేలపై వినమ్రంగా జీవించండి. చనిపోయాక నేలకింద హాయిగా ఉండొచ్చు.

ఎవరి మీదా దౌర్జన్యాలు వద్దు. నిస్సహాయులపై అసలే వద్దు.

నాకు స్వర్గ కాంక్షకంటే నమాజ్‌ అంటే ఇష్టం. కారణం- అల్లాహ్‌కు అదెంతో ఇష్టం.

దేహానికి మరణం తప్పదు. అలాంటప్పుడు ఈ జీవితాన్ని ప్రసాదించిన దైవం కోసం ప్రాణాలర్పించడమే మేలు.

చెడు నుంచి వారించేవాడే నిజమైన శ్రేయోభిలాషి.

మీ మనో న్యాయస్థానంలోకి వెళ్తుండండి. అక్కడ తప్పుడు తీర్పులకు తావులేదు.

దైవదాస్యం చేసేవారికి ఈ లోకంలో ప్రతిదీ బానిసవుతుంది. దైవభీతితో గౌరవమర్యాదలను సాధించండి.

దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడటంలో ఎంత అలక్ష్యం చేస్తావో అంతే త్యాగం చేయాల్సి ఉంటుంది.

ఈ లోకంలోనే స్వర్గాన్ని చూడాలనుకుంటే అమ్మ ఒడిలో తలపెట్టి పడుకోండి.

ఏకాంతంలోనూ పవిత్రంగా ఆలోచించేవారే నిజమైన ముస్లిమ్‌లు.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని