తత్ప్రణమామి సదాశివలింగం..!

శివయ్యకు భక్తులంటే ప్రీతి. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే శైవులు దేవదేవుడిని ప్రతిరోజూ అర్చిస్తూ నిత్య శివరాత్రిని జరుపుకుంటారు. ఆద్యంత రహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనవితీరదంటూ పక్షానికీ, మాసానికీ, సంవత్సరానికీ... ఒక్కో శివరాత్రిపేరుతో దేవదేవుడిని అభిషేకిస్తారు...

Updated : 12 Mar 2023 13:16 IST

శివయ్యకు భక్తులంటే ప్రీతి. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే శైవులు దేవదేవుడిని ప్రతిరోజూ అర్చిస్తూ నిత్య శివరాత్రిని జరుపుకుంటారు. ఆద్యంత రహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనవితీరదంటూ పక్షానికీ, మాసానికీ, సంవత్సరానికీ... ఒక్కో శివరాత్రిపేరుతో దేవదేవుడిని అభిషేకిస్తారు. వాటన్నింటిలో విశిష్టమైంది మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి.

విద్యలన్నింటిలోనూ వేదం గొప్పదని చెబుతారు. అందులోనూ సంహితాకాండలోని రుద్రమూ, దానిలోనూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం, వీటన్నింటిలోనూ శివ అనే రెండక్షరాలు చాలా విశేషమైనవని శాస్త్రవచనం. శివనామాన్ని నారాయణుడు  యోగనిద్రలో  జపిస్తాడని ప్రతీతి.


మూడుమూర్తులకును మూడులోకములకు మూడుకాలములకు మూలమగుచు భేదమగుచు తుదికభేదమైయొప్పారు బ్రహ్మమనగ నీవె ఫాలనయన!... సృష్టి స్థితి లయ కారకులైన మూడు దేవతామూర్తులకూ, భూతభవిష్యత్‌ వర్తమానమనే మూడుకాలాలకూ, ముల్లోకాలకూ ఆధారమై ఉంటూ, వాటిలోనే లీనమైపోతూ, చివరకు తనలోనే ఐక్యం చేసుకునే ఒకేఒక అణుస్వరూపం శంకరుడంటూ అత్యంత భక్తితో కీర్తిస్తాడు పోతన భాగవతంలో. అలాంటి శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజునే మహాశివరాత్రిగా పేర్కొంటారు. హిందువులకు ముఖ్యమైన పండగల్లో ఇది ఒకటి. ప్రతి నెలా వచ్చే కృష్ణచతుర్దశిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అయితే శివరాత్రులన్నింటిలో విశేషమైందీ అత్యంత పవిత్రమైందీ మహాశివరాత్రే. సాధారణంగా ఏ పండగనైనా పగటిపూట మాత్రమే చేసుకుంటారు. కానీ శివరాత్రి నాడు మాత్రం... ఉపవాసాలూ మౌనవ్రతాలతో పగటివేళ ఎంత భక్తిగా శివయ్యను పూజిస్తారో, అభిషేకాలూ పారాయణలూ జాగారాలతో రాత్రిపూట కూడా అంతే విశేషంగా అర్చిస్తారు. అందుకే శివరాత్రి వ్రతాన్ని అహోరాత్రి వ్రతమంటారు.

 

ఆ రోజే శివరాత్రి
శివ అంటే శంకరుడు. రాత్రి అంటే పార్వతి. వీరిద్దరి కలయికే శివరాత్రి. శివపార్వతులకు కల్యాణం జరిగిన రాత్రే శివరాత్రి. వీరికి ముందు వివాహమైన దంపతులు పురాణాల్లో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను ఆదిదంపతులుగా కీర్తిస్తారు. వీరిద్దరి కల్యాణం జగత్కల్యాణానికి నాంది అయింది కాబట్టే శివరాత్రి విశ్వానికి పండగ రోజైంది. ఒకరోజు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య వాగ్వివాదం జరిగింది. వాదన ముదిరి ప్రళయంగా మారడంతో ఈశ్వరుడు వారిద్దరి మధ్యా తేజోలింగంగా ఉద్భవించి, వారికి జ్ఞానాన్ని ఉపదేశించింది కూడా శివరాత్రి రోజే. అందుకే మాఘబహుళ చతుర్దశి రోజు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలూ,  శివార్చనలూ  చేయడం ఆనవాయితీ.

 

అయిదు శివరాత్రులు
మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివయ్యను ఆరాధించినా, ఎలాంటి మంత్రాలూ తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లుపోసినా రెండూ తనకి సమానమే అంటాడు కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదంతం ఈ కోవకు చెందిందే. హైందవ సంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే అయిదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. రోజూ శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి. పక్షానికి ఒక రోజు శివపూజ చేయడం పక్ష శివరాత్రి. మాసంలో ఒక రోజు దేవదేవుడిని అర్చించడం మాస శివరాత్రి. అలాగే
మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. సాధకుడు తన యోగమహాత్మ్యంతో యోగనిద్రకు ఉపక్రమించడాన్ని యోగశివరాత్రిగా పేర్కొంటారు.

 

శివరాత్రి వ్రతం
శివరాత్రి రోజు శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించినవారికి మోక్షం లభిస్తుందని పురాణాల ఉవాచ. శివపురాణంలో శివరాత్రి పూజావిధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఆ రోజు శివుడిని అర్చన, ఉపవాసం, జాగారం అనే మూడు పద్ధతుల్లో పూజిస్తారు. శివరాత్రికి ముందురోజు ఒంటిపూట చేసి, మరుసటి రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రి జాగారం చేస్తూ శివలింగానికి నాలుగు జాముల్లో నాలుగు రకాల పూజలు చేయాలి. మొదటి జాములో పాలాభిషేకం చేసి, పద్మాలతో పూజించి, పులగం నైవేద్యంగా పెట్టాలి. రెండో జాములో పెరుగుతో
అభిషేకం, తులసీదళార్చన, పాయసం నైవేద్యం; మూడో జాములో నెయ్యితో అభిషేకం, మారేడుదళార్చన, నువ్వుల పొడితో చేసిన పదార్థాలను నివేదించాలి. నాలుగోజాములో తేనెతో అభిషేకం, నల్లకలువలతోపూజ, అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. మహాశివరాత్రి రోజున శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినా, శివపార్వతులకు కల్యాణం జరిపించినా, చూసినా పుణ్యమేనంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని