Largest iPhone: ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌.. దీన్ని తీసుకెళ్లాలంటే స్టాండ్‌ కావాల్సిందే!

ఐఫోన్‌ (iPhone) అనగానే అనగానే.. ఆరు అంగుళాల డిస్‌ప్లేతో దర్శనమిస్తుంది. కానీ, అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌ను రూపొందించాడు. ఈ ఫోన్‌ను తీసుకెళ్లాలంటే చక్రాల స్టాండ్ కావాల్సిందే.

Published : 27 Jun 2023 23:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ (Apple) కంపెనీ తయారుచేసే ఐఫోన్‌ (iPhone)లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఖరీదెక్కువైనా.. విడుదలైన మొదటి రోజే సొంతం చేసుకోవాలని ఎంతో మంది పోటీ పడుతుంటారు. ప్రస్తుతం యాపిల్‌ కంపెనీ విక్రయిస్తోన్న ఫోన్లలో ఐఫోన్ ప్రో మ్యాక్స్‌ 14 (iPhone Pro Max 14) పెద్దది. ఇందులో 6.7 అంగుళాల స్క్రీన్‌ ఇస్తున్నారు. మరి, 8 అడుగుల పొడవైన ఐఫోన్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఏంటి యాపిల్‌ కంపెనీ అంత పెద్ద ఐఫోన్‌ను తయారుచేసిందా? అని ఆశ్చర్యపోకండి. ఈ పెద్ద ఐఫోన్‌ను యాపిల్‌ కంపెనీ రూపొందించలేదు. అమెరికాకు చెందిన మాథ్యూ బీమ్‌ అనే ఓ యూట్యూబర్‌ వినూత్నంగా ఏదైనా చేయాలని భావించి.. ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌ను తయారుచేశాడు. అదేదో ఊరికే రెప్లికా (ప్రతిరూపం) మోడల్‌ అనుకుంటే పొరపాటే.

మాథ్యూ రూపొందించిన ఫోన్‌తో ఫొటోలు తీసుకోవచ్చు, ఫేస్‌టైమ్‌లో వీడియోకాల్స్‌ మాట్లాడటంతోపాటు యాపిల్‌ పేతో చెల్లింపులూ చేయొచ్చు. అలాగే, అలారమ్‌, గేమింగ్‌ యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. మాథ్యూ రూపొందించిన ఈ భారీ ఐఫోన్‌ కోసం మెటల్‌తో ఫ్రేమ్‌ రూపొందించాడు. అనంతరం డిస్‌ప్లే కోసం టీవీ స్క్రీన్‌ను ఉపయోగించాడు. తర్వాత ఈ ఫోన్‌కు వెనుక, ముందు కెమెరాలను అమర్చాడు. తర్వాత ఈ ఫోన్‌ను మ్యాక్‌ మినీ కంప్యూటర్‌కు అనుసంధానించాడు. దాంతో ఐఫోన్‌లో ఉన్నట్లుగానే మ్యాక్‌ మినీ ద్వారా భారీ ఐఫోన్‌లో ఐఓఎస్‌ యాప్‌లు కనిపిస్తాయి. పవర్‌ కోసం ఫోన్ వెనుక స్టాండ్‌లో పెద్ద బ్యాటరీని అమర్చాడు. సాధారణ ఐఫోన్‌కు ఏ మాత్రం తీసిపోకుండా.. ఇందులో లాక్‌, వాల్యూమ్‌ కంట్రోల్‌ బటన్స్‌ను సైతం అమర్చాడు. అనంతరం ఈ భారీ ఐఫోన్‌ను రోలింగ్ స్టాండ్‌పై అమర్చి న్యూయార్క్‌ వీధుల్లోకి తీసుకెళ్లాడు. ఈ ఫోన్‌ను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ఆరు అడుగుల ఐఫోన్‌ మోడల్‌ను 2020లో జెడ్‌హెచ్‌సీ అనే యూట్యూబర్‌ రూపొందించాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని