Telegram: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా తరహాలో టెలిగ్రామ్‌ స్టోరీస్‌.. ఎప్పటినుంచంటే?

టెలిగ్రామ్‌ (Telegram) యూప్‌ కొత్తగా మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో తమకు నచ్చిన టెక్స్ట్‌, ఫొటో, వీడియోలను స్టోరీస్‌గా పెట్టుకోవచ్చు. 

Published : 27 Jun 2023 23:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలిగ్రామ్‌ (Telegram) యాప్‌లో మెసేజింగ్‌తోపాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు. అలానే, యూజర్ల గోప్యత కోసం సీక్రెట్‌ చాట్‌ ఫీచర్‌ కూడా ఉంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు టెలిగ్రామ్‌ సీఈవో పావెల్‌ దురోవ్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో టెలిగ్రామ్‌లో కూడా స్టోరీస్‌ (Telegram Stories) ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. టెలిగ్రామ్‌లో స్టోరీస్‌ ఫీచర్‌ను పరిచయం చేయాలని ఎంతో కాలంగా యూజర్ల నుంచి డిమాండ్‌లు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

‘‘తొలుత టెలిగ్రామ్‌లో స్టోరీస్‌ ఫీచర్‌ అవసరంలేదని భావించాం. ఇప్పటికే.. టెలిగ్రామ్‌ మినహా అన్ని సోషల్‌ మీడియా యాప్‌లలో స్టోరీస్‌ను పరిచయం చేశారు. అందుకే టెలిగ్రామ్‌లో స్టోరీస్‌ వద్దని నిర్ణయించాం. కానీ, స్టోరీస్‌ ఫీచర్‌ కావాలని ఎక్కువ మంది టెలిగ్రామ్‌ యూజర్లు డిమాండ్ చేయడంతో మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. యూజర్ల మాట వినడం వల్లనే టెలిగ్రామ్‌ ఆధునిక ఫీచర్లతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది. జులై నుంచి టెలిగ్రామ్‌లో స్టోరీస్‌ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది’’ అని పావెల్‌ తెలిపారు.   

టెలిగ్రామ్‌ స్టోరీస్ ఫీచర్లు

  • యూజర్లు టెలిగ్రామ్‌ యాప్‌లో స్టోరీస్‌ను పోస్ట్‌ చేసిన తర్వాత.. వాటిని ఎవరెవరు చూడాలనేది నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం యూజర్లకు స్టోరీస్‌ సెట్టింగ్స్‌లో ఎవ్రీవన్‌ (Everyone), ఓన్లీ యువర్‌ కాంటాక్ట్స్‌ (Only Your Contacts With Exception), ఫ్యూ సెలెక్ట్‌డ్‌ కాంటాక్ట్స్‌ (Few Selected Contacts), లిస్ట్‌ ఆఫ్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ (List of Close Friends) అని నాలుగు ఆప్షన్లు ఉంటాయి. యూజర్లు తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకుంటే.. దాని ప్రకారం ఆ జాబితాలోని వారికి మాత్రమే స్టోరీస్‌ కనిపిస్తాయి. 
  • స్టోరీస్‌ను సులువుగా యాక్సెస్‌ చేసుకునేందుకు వీలుగా యాప్‌లో చాట్‌ లిస్ట్‌ పైభాగంలో ఇస్తున్నట్లు టెలిగ్రామ్‌ వెల్లడించింది. కాంటాక్ట్‌ లిస్ట్‌లోని యూజర్‌ ఎవరైనా కొత్తగా స్టోరీస్‌ను యాడ్‌ చేస్తే.. చాట్‌ లిస్ట్‌ పైభాగంలో కనిపిస్తుంది. యూజర్లు తమ స్టోరీస్‌లో ఏవైనా మార్పులు చేయాలంటే టెలిగ్రామ్‌ యాప్‌లోని ఫొటో, వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 
  • యూజర్లు తమ స్టోరీస్‌ ఎంత సమయంపాటు ఇతరులకు కనిపించాలనేది కూడా నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం 6, 12, 24, 48 గంటల టైమ్‌ ఆప్షన్లను ఇస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు పర్మినెంట్‌ డిస్‌ప్లే ఆప్షన్‌ కూడా ఉంది. దీంతో యూజర్ తనకు నచ్చిన టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పటికీ తన టెలిగ్రామ్‌ ప్రొఫైల్‌లో కనిపించేలా స్టోరీస్‌ను పెట్టుకోవచ్చు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని