Ratan Tata: క్రిప్టో సంస్థలతో నాకు సంబంధంలేదు.. నెటిజన్లకు రతన్‌ టాటా విజ్ఞప్తి

క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) సంస్థల్లో తాను పెట్టుబడులు పెట్టినట్లు కొందరు మోసపూరిత ప్రకటనలు వ్యాప్తి చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని టాటా సన్స్ (Tata Sons) మాజీ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. 

Updated : 27 Jun 2023 20:25 IST

ముంబయి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్‌ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ.. రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ (Tata Sons) మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) పేరుతో కొత్త తరహా మోసానికి తెరలేపారు. క్రిప్టోకరెన్సీ ( Cryptocurrency) సంస్థల్లో రతన్‌ టాటా పెట్టుబడులు పెట్టారని ఒక ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసినట్లు ఉన్న ఫొటోను రూపొందించి.. దాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోపై రతన్‌ టాటా స్పందించారు. ‘‘నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో ఏ విధమైన సంబంధంలేదు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. దాంతోపాటు రాసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. 

‘‘ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. క్రిప్టోకరెన్సీ సంస్థలతో నాకు సంబంధం ఉందని, నా పేరుతో ఏవైనా ప్రకటనలు లేదా వార్తా కథనాలు మీకు కనిపిస్తే వాటిని నమ్మకండి. అవి పూర్తిగా అవాస్తవ ప్రకటనలు. ప్రజలను మోసం చేసేందుకు కొందరు ఇలాంటివి సృష్టిస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ క్రింది ఫొటో’’ అంటూ ఒక ప్రముఖ వార్తా సంస్థ ప్రసారం చేసినట్లు ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ చేసిన నెటిజన్లు బాధ్యతగా వ్యవహరించి, ప్రజలను అప్రమత్తం చేసినందుకు రతన్‌ టాటాకు ధన్యవాదాలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

‘ మీ గురించి మాకు పూర్తిగా తెలుసు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను మేము ఎప్పటికీ నమ్మం’ అని ఒక నెటిజన్‌ కామెంట్ చేశారు. ‘క్రిప్టోకరెన్సీ గురించి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి స్కామ్‌ల గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు’ అని మరో నెటిజన్‌ కామెంట్స్‌లో పేర్కొన్నారు. అంతకుముందు మరో పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సైతం క్రిప్టోలో పెట్టుబడుల గురించి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలానే, ఇప్పటి వరకు క్రిప్టోలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని