Viral Video: కారు విండ్‌షీల్డ్‌పై కానిస్టేబుల్‌.. అలా ఉండగానే 10 కి.మీలు లాక్కెళ్లి!

ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఢీకొని, ఆయన కారు విండ్‌షీల్డ్‌పై ఉండగానే పది కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాడో డ్రైవర్‌. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 16 Apr 2023 22:26 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబయి (Mumbai)లో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. కారును ఆపేందుకు యత్నించిన ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఢీకొని, ఆయన వాహనం విండ్‌షీల్డ్‌పై ఉండగానే దాదాపు 10 కిలోమీటర్ల మేర ప్రమాదకర స్థితిలో లాక్కెళ్లాడో వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ (Viral Video)గా మారాయి. ఘటనా సమయంలో నిందితుడు మాదకద్రవ్యాల మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

స్థానికంగా ఓ కారు కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. ఆ వాహనాన్ని ఆపేందుకు యత్నించారు. అయితే, కారు ఆగకుండానే వెళ్లిపోయింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెంబడించి.. వాషిలోని ఓ క్రాస్‌రోడ్‌ వద్ద మళ్లీ ఆపే ప్రయత్నం చేశారు. అయితే, కారులోని వ్యక్తి వేగాన్ని తగ్గించకుండా.. అలాగే కానిస్టేబుల్‌ను ఢీకొట్టి, ఆయన కారు బానెట్‌పైనే ఉండగానే ముందుకు పోనిచ్చాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. కారు విండ్‌షీల్డ్‌పై ఉన్నట్లు కనిపిస్తోంది. నిందితుడు ఆదిత్య బెంబడే దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాన్ని అలాగే తీసుకెళ్లాడు. చివరకు.. గవాన్ ఫాటా సమీపంలో పోలీసులు కారును ఆపారు. నిందితుడిని అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు అతనిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని