Viral video: పనివాళ్లకు హాలిడే ట్రిప్‌.. యజమాని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!

Viral video: తమ ఇంట్లో పనిచేసే ముగ్గురు అమ్మాయిలకు యజమాని భారీ బోనస్‌ను అందించింది. ఆ బహుమతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

Published : 15 Apr 2023 21:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పండగలు, శుభకార్యాల సమయంలో ఇంట్లో పనిచేసే వాళ్లకు బట్టలు, డబ్బులు ఇవ్వడం సర్వసాధారణం. తమ కోసం కష్టపడినందుకు అభిమానంతో కొందరైతే బహుమతులు కూడా ఇస్తుంటారు. మలేసియాకు చెందిన ఓ మహిళ మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. పండగా సందర్భంగా తన ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు మహిళలకు భారీ బోనస్‌ ఇచ్చారు. యజమాని ఇచ్చిన బహుమతి చూసి గంతేయడం వారి వంతైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

మలేసియాకు చెందిన ఫరా వెన్ అనే ఒక మహిళా వ్యాపారవేత్త తన ఇంట్లో పనిచేసే అమ్మాయిలకు పండగ గిప్ట్‌ కింద కవర్‌లను ఇచ్చింది. దాన్ని తెరవగానే వారి నోట మాటరాలేదు. వారికిచ్చిన కవర్లలో 10 వేల రింగిట్స్‌ (మలేసియా కరెన్సీ) అంటే సుమారు రూ.1.80 లక్షలు ఉన్నాయి. వాటిని చూసి వారు తెగ సంబరపడ్డారు. ఆనందంతో ఎగిరి గంతేశారు. అంతేకాదండోయ్‌.. ఏకంగా మూడు రోజుల విహారయాత్ర కోసం ఒక ద్వీపానికి టికెట్లను కూడా బుక్‌ చేశారా యజమాని. కేవలం టికెట్‌ని బుక్‌ చేయడమే కాదు.. వారి ప్రయాణానికి ఏకంగా ఛార్టర్డ్‌ హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. విలాసవంతమైన హోటల్‌లో వసతి కూడా కల్పించారు. 

పనివాళ్ల ట్రిప్‌నకు సంబంధించిన వీడియోను ఫరా టిక్‌టాక్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. షేర్‌ చేసిన కొద్ది గంటల్లోనే వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. కొందరు ఆమె ఉదారభావాన్ని పొగుడుతుంటే మరికొందరు ఆశ్చర్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలా మన పనివాళ్లకు బహుమతులు అందిచడం ఇదే తొలిసారి కాదు. గతేడాదిలో చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త  దీపావళికి బహుమతిగా రూ.1.2 కోట్లు విలువచేసే వాహనాలను తన సిబ్బందికి అందించారు.

 

 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని