Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్‌ సాహసం!

రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని ఆఖరు క్షణంలో కాపాడారు ఓ ఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 09 Jun 2023 13:50 IST

కోల్‌కతా: రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని చివరి క్షణంలో కాపాడి ప్రశంసలు అందుకుంటున్నారు ఓ ఆర్పీఎఫ్‌ (RPF) మహిళా కానిస్టేబుల్‌. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని పూర్వ మేదినిపుర్‌ (Purwa Medinipur) రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆన్‌లైన్‌లో వైరల్‌ (Viral Video)గా మారింది.

ఓ వ్యక్తి ఇక్కడి పూర్వ మేదినిపుర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఓ వైపు నుంచి రైలు రావడాన్ని గమనించిన అతను.. వెంటనే ప్లాట్‌ఫాం దిగి పట్టాలపై పడుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. పక్క ప్లాట్‌ఫాంపై విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కె.సుమతి అతన్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, వెంటనే కిందికి దిగి.. అతన్ని పట్టాలపై నుంచి వెనక్కి లాగారు. రైలు అక్కడికి చేరుకునే క్షణాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. అనంతరం మరో ఇద్దరు ప్రయాణికుల సాయంతో అతన్ని సురక్షితంగా ప్లాట్‌ఫాంపైకి చేర్చారు.

ఒకవైపు నుంచి రైలు వేగంగా దూసుకొస్తున్నప్పటికీ.. ఆమె సాహసోపేతంగా వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆర్పీఎఫ్‌ సైతం ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ప్రయాణికుల భద్రతపట్ల ఆమె నిబద్ధతను కొనియాడింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని