Rishi Sunak: జెలెన్‌స్కీకి భారతీయ ‘బర్ఫీ’.. రుచి చూపించిన సునాక్‌..!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మన భారతీయ స్వీట్‌ ‘బర్ఫీ’ రుచి చూపించారట బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రాం వేదికగా పోస్ట్‌ చేశారు.

Published : 19 Jun 2023 16:36 IST

లండన్‌: భారతీయ రుచులు.. అందులోనూ మిఠాయిల (Indian Sweets)కు ఎంతో పేరుంది! ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)కి మన ‘బర్ఫీ (Barfi)’ రుచి చూపించారట బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak). ఓ ఇంటర్వ్యూలో సునాక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తన తల్లి తయారు చేసిన ఈ మిఠాయిలను జెలెన్‌స్కీతో పంచుకున్నానని, ఇది తెలుసుకుని ఆమె ఎంతో ఉద్వేగానికి గురయ్యారని చెప్పారు. జెలెన్‌స్కీతో కలిసి స్వీట్లను తింటున్న వీడియోను సునాక్‌ ఇన్‌స్టాగ్రాం వేదికగా పోస్ట్‌ చేశారు. దీంతో అది కాస్త వైరల్‌ (Viral Video)గా మారింది.

‘మా అమ్మ కొన్ని భారతీయ మిఠాయిలను స్వయంగా తయారు చేసి ఇచ్చారు. ఈ క్రమంలోనే నేను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యాను. ఇద్దరం మాట్లాడుకుంటుండగా.. ఆయన ఆకలితో ఉన్నట్లు అనిపించింది. దీంతో మా అమ్మ ఇంట్లో తయారు చేసిచ్చిన ‘బర్ఫీ’ మిఠాయిలను ఆయనతో పంచుకున్నాను. అది చూసి ఆమె చాలా సంతోషించింది. థ్రిల్‌కు గురయ్యింది’ అని రిషి సునాక్‌ అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘హృదయాన్ని హత్తుకునే వీడియో’.. ‘రిషి సునాక్‌.. ఓ ఫ్యామిలీమ్యాన్‌’.. ‘పంచుకోవడంలోనే ఆనందం ఉంటుందం’టూ నెటిజన్లు సునాక్‌ పోస్ట్‌పై స్పందిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని