Ukraine: యుద్ధంలో దివ్యాంగుడైనా.. ప్రేయసి మనసు గెలిచి..!

ఉక్రెయిన్‌(Ukraine) యుద్ధభూమిపై ఎన్నో భయానక ఘటనలు.. మరెన్నో దయనీయ దృశ్యాలు..! వీటన్నింటి నడుమ హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఓ పెళ్లి ప్రపోజల్‌ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 03 Oct 2022 23:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine) యుద్ధభూమిపై ఎన్నో భయానక ఘటనలు.. మరెన్నో దయనీయ దృశ్యాలు..! వీటన్నింటి నడుమ హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. పోరాట క్రమంలో ఓ కాలు కోల్పోయి, దివ్యాంగుడిగా మారిన ఓ యువకుడు.. తన ప్రియురాలికి పెళ్లి ప్రపోజల్‌(Marriage Proposal) చేస్తున్నట్లు అందులో ఉంది. యుద్ధ క్షేత్రం నుంచి తిరిగొచ్చిన అతను.. తోటివ్యక్తి సాయంతో ఆమె ముందు మోకాలిపై కూర్చొని.. పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఉంగరం తీసి, ఆమె వేలికి తొడిగిన వెంటనే ఆమె.. ‘ఎస్‌’ చెప్పింది. దీంతో అక్కడున్న వారు సైతం ఆనందంలో మునిగిపోయారు.

ఏదేమైనా కడదాక కలిసి ఉండాలనే భావనను చాటుతోన్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేయగా.. భారీ ఎత్తున స్పందన వస్తోంది. నెటిజన్లు సైతం ఈ ‘ప్రపోజల్‌’పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోస్ట్‌పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటివరకు చూసిన అందమైన ప్రపోజల్స్‌లో ఇది ఒకటి’ అని ఒకరు స్పందించారు. ఈ లవ్లీ జంటకు అభినందనలు అని మరొకరు కామెంట్‌ పెట్టారు. ఇదిలా ఉండగా.. యుద్ధ సమయాల్లో ఉక్రెయిన్‌ బలగాలపై రష్యా.. దాష్టీకాలకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. అనేకమంది చేతులు, కాళ్లపై తుపాకీ గాయాలు, విరిగిన ఎముకలు, తీవ్రమైన కాలిన గాయాలతో తిరిగి వస్తున్నారని ఉక్రెయిన్‌ అధికారవర్గాలు తెలిపాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని