Viral Video: రీల్‌ లైఫ్‌ రాముడికి విమానాశ్రయంలో పాదాభివందనం.. వైరల్‌గా మారిన వీడియో

రామాయణం టీవీ సిరీస్‌లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్‌కు ఓ మహిళ పాదాభివందనం చేసి పరవశించిపోయింది. పలుమార్లు ఆయన కాళ్లపై పడి భావోద్వేగానికి గురైంది. విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Published : 01 Oct 2022 23:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: 1990 కాలంలో ప్రసారమైన ‘రామాయణం’ ధారావాహిక ఎంతో ప్రసిద్ధి. హిందీలో రూపొందించిన ఈ సీరియల్‌ పలు భాషల్లోకి అనువాదమై భారత్‌తోపాటు ఓవర్సీస్‌లోనూ అభిమానాన్ని కూడగట్టుకుంది. ఆ  సిరీస్‌ ప్రసారమై ఏళ్లు గడుస్తున్నా.. ఆ నటులను అభిమానులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రలను పోషించినవారిని నిజమైన దేవుళ్లుగా ఆరాధించే అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

రామాయణం సిరీస్‌లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్‌ ఓ విమానాశ్రయంలో కనిపించగా.. ఆయన్ను చూసిన ఓ భక్తురాలు పరవశించిపోయింది. ఆయన్ను రాముడిగానే భావిస్తూ పాదాభివందనం చేసింది. భావోద్వేగానికి గురై దండం పెట్టుకుంటూ పలుమార్లు ఆయన పాదాలకు నమస్కరించింది.  విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 5.5లక్షల మంది వీక్షించారు. 23వేల మందికిపైగా లైక్‌ చేశారు.

రామానంద్‌ సాగర్‌ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ టీవీ సిరీస్‌ 1987లో మొదట దూరదర్శన్‌లో ప్రసారమైంది. కాగా ఈ సిరీస్‌ను అభిమానులు విశేషంగా ఆదరించారు. ఆపై 33ఏళ్ల తర్వాత 2020లో కొవిడ్‌ లాక్‌డౌన్‌లో తిరిగి ప్రసారం చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వినోద కార్యక్రమంగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 2020 ఏప్రిల్‌ 16న ప్రసారమైన ఈ సిరీస్‌ను ఏకంగా 7.7కోట్ల మంది వీక్షించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని