Autowala: కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించిన ఆ ఆటోవాలా.. మోదీ వీరాభిమాని!

ఆజ్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన ఆ ఆటోవాలా ప్రధాని మోదీ వీరాభిమాని అట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. ఆటోరిక్షా యూనియన్ ఒత్తిడి మేరకే తాను కేజ్రీవాల్‌ను ఆహ్వానించినట్లు తెలపడం గమనార్హం.

Published : 30 Sep 2022 21:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓ ఆటోవాలా తన ఇంటికి భోజనానికి పిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ ఆటోడ్రైవర్‌ అభ్యర్థన మేరకు అతడి ఇంటికి వెళ్లి కేజ్రీవాల్‌ భోజనం కూడా చేశారు. అయితే, ఆ ఆటోవాలా ప్రధాని మోదీకి వీరాభిమానట! ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. మోదీ ప్రస్తుతం గుజరాత్‌ పర్యటనలో ఉండగా.. తాల్‌తేజ్‌ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో ఆ ఆటోడ్రైవర్‌ విక్రమ్‌ దంతానీ దర్శనమిచ్చాడు. కాషాయ కండువా కప్పుకొని ఓ బస్‌లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

ర్యాలీలో దంతానీని మీడియా ప్రశ్నించగా.. ఆటోరిక్షా సంఘం తనపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఆరోజు తాను కేజ్రీవాల్‌ను ఇంటికి పిలవాల్సి వచ్చిందని అతడు పేర్కొనడం గమనార్హం. ‘మా యూనియన్‌ నాపై ఒత్తిడి తేవడంతో కేజ్రీవాల్‌ను ఇంటికి పిలిచాను. నేను అడగ్గానే ఆయన అందుకు అంగీకరించారు. కానీ అది అంతపెద్ద విషయం అవుతుందని నేను అనుకోలేదు. ఆప్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పార్టీకి చెందిన ఏ లీడర్‌తోనూ నేను టచ్‌లో లేను’ అని పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను వీరాభిమానినని, ఇప్పటివరకు భాజపాకు మాత్రమే ఓటు వేశానని చెప్పుకొచ్చాడు. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ అక్కడ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 12న అహ్మదాబాద్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడి ఆటోరిక్షా డ్రైవర్లతో సమావేశం కాగా ఆటోవాలా దంతానీ కేజ్రీవాల్‌ను తన ఇంటికి భోజనానికి ఆహ్వనించాడు. ‘మీకు చాలా పెద్ద అభిమానిని. పంజాబ్‌లో మీరు ఓ ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం చేసిన వీడియోను సోషల్‌మీడియాలో చూశాను. గుజరాత్‌లోనూ అలాగే చేస్తారా? మా ఇంటికి వస్తారా?’ అని ఆ ఆటోవాలా అడిగారు. దానికి అంగీకరించిన కేజ్రీవాల్‌ అదేరోజు సాయంత్రం ఆ ఆటోవాలా ఆటోలోనే వెళ్లి అతడి ఇంట్లో భోజనం చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని