పేదింట.. పరిశోధనల మేటి!

పుస్తకాలు సైతం కొనలేని పేద కుటుంబం... అయినా పుస్తకాన్ని ఇష్టపడితేనే ఎదుగుతాం అన్నది అతడి నమ్మకం... ఆటంకాలెదురైనా ఆచరణ వదల్లేదు... ర్యాంకులు సాధించాడు.. ప్రతిష్ఠాత్మక సంస్థలో ప్రవేశం పొందాడు.. పరిశోధనలు చేశాడు...ఫలితం? పేటెంట్‌లు, జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి

Published : 06 Feb 2021 01:28 IST

పుస్తకాలు సైతం కొనలేని పేద కుటుంబం... అయినా పుస్తకాన్ని ఇష్టపడితేనే ఎదుగుతాం అన్నది అతడి నమ్మకం... ఆటంకాలెదురైనా ఆచరణ వదల్లేదు... ర్యాంకులు సాధించాడు.. ప్రతిష్ఠాత్మక సంస్థలో ప్రవేశం పొందాడు.. పరిశోధనలు చేశాడు...ఫలితం? పేటెంట్‌లు, జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. తాజాగా కేంద్రప్రభుత్వం నుంచి యువ శాస్త్రవేత్తగా అవార్డు అందుకున్న నీరడి దినేష్‌తో మాట కలిపింది ఈతరం.
బడికెళ్లేందుకు బస్సు ఛార్జీలు కూడా లేని స్థితి నుంచి వచ్చాను. ముందు నుంచి తెలుగు మాధ్యమమే. రెండేళ్ల డిప్లొమా కోసం హైదరాబాద్‌ వెళ్లినప్పుడు ఇంగ్లీషు మీడియం ఎదురొచ్చింది. దీంతో మొదటి ఏడాది నాలుగు సబ్జెక్టులు తప్పాను. జీవితంలో తొలిసారి ఫెయిలయ్యా. స్నేహితుడి సాయంతో పట్టుబట్టి ఇంగ్లిష్‌పై పట్టు సాధించా. బాగా చదివితే మంచి స్థాయికి చేరుకోగలం అనే నమ్మకం ముందు నుంచీ ఉండేది. దాన్ని ఆచరణలో చూపించా. క్యాన్సర్‌కు మందు కనిపెట్టడం నా జీవితాశయం. సీసీఎంబీలో దీనిపై కొంత ప్రయోగం చేశాను. చిన్నప్పటి నుంచి వైద్యుడిగా ఎదగాలని లక్ష్యం ఉండేది. చివరికి డాక్టరేట్‌తో ఆ కోరిక తీరింది.
నిజామాబాద్‌ జిల్లా కొండాపూర్‌ దినేష్‌ సొంతూరు. ఇంటిల్లిపాదీ కష్టపడితేనే పూట గడిచే స్థితి. ఈ స్థాయి నుంచి వచ్చిన కుర్రాడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడం, మేటి పరిశోధనలు చేయడం, అవార్డులు అందుకోవడం మామూలు విషయం కాదు. గేదెల పొదుగుకు వచ్చే వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు అతడు పంపిన ప్రతిపాదనలను మెచ్చి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఇటీవలే యువశాస్త్రవేత్త పురస్కారం అందించింది. పరిశోధనలు చేయడానికి రూ.25 లక్షలు కేటాయించింది. దేశవ్యాప్తంగా 20 మంది ఈ పురస్కారానికి ఎంపికైతే తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు దినేష్‌.
చదువులో ముందు
దినేష్‌ చదువంతా సర్కారీ బడుల్లోనే సాగింది. ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంకు, గేట్‌లో 1,200 ర్యాంకు సాధించాడు. నైపర్‌ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 28వ ర్యాంకు దక్కించుకున్నాడు. మొహాలీలోని ప్రతిష్ఠాత్మక జాతీయ ఔషధ విద్యా, పరిశోధనా సంస్థ (నైపర్‌)లో బయోటెక్నాలజీ పీజీ పూర్తి చేసి అక్కడే పీహెచ్‌డీ చేశాడు.

అలుపెరుగని పరిశోధన
పీహెచ్‌డీ తర్వాత జాతీయ పోషకాహార సంస్థలో ప్రి-క్లినికల్‌ టాక్సికాలజీ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ఆ సమయంలోనే మ్యాగీ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం నిగ్గు తేల్చేందుకు పరిశోధనలు చేసి నివేదిక సమర్పించాడు. తర్వాత హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో చేరి మలేరియా వ్యాక్సిన్‌ కోసం సీనియర్లతో కలిసి పరిశోధనల్లో పాల్గొన్నాడు. అప్పుడే ఆటోఫేజీ కాన్సెప్ట్‌పై పరిశోధనలు చేశాడు. దీన్నే ‘సెల్ఫ్‌ కిల్లింగ్‌ టెక్నాలజీ’ అంటారు. దోమలోని పారసైట్‌ను అక్కడే చంపేసే విధంగా ఆటోఫేజీ పరిశోధనలు సాగాయి. పంజాబ్‌, బిహార్‌, పశ్చిమ్‌బంగా రాష్ట్రాల్లో ఈగల్లాంటి సాండ్‌ఫ్లై కీటకాల వల్ల జనం వింత వ్యాధి బారిన పడుతున్నారు. ఈ కీటకాలతో లీస్మేనియాసిస్‌ లేదా కాలా అజర్‌ సోకుతుంది. దీన్నే నల్లజ్వరం అంటారు. ఇది మనుషులపై తీవ్ర ప్రభావం చూపి అవయవాలను సైతం తినేస్తుంది. పిల్లల్లో పొట్ట పెద్దగా ఉబ్బుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన దినేష్‌ కారక కణాలను గుర్తించాడు. అరికట్టే ఔషధాల ప్రయోగాలు చేశాడు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొలెస్టాల్ర్‌ తగ్గించే ఆటోరోవా స్టాటిన్‌ అనే డ్రగ్‌ సమర్థంగా పని చేస్తుందని కనుగొన్నాడు. ఆ పరిశోధన, ఫలితాల్ని ప్రభుత్వానికి అందజేశాడు.
జాతీయ స్థాయిలో..
కొద్దిరోజుల కిందట గేదెల పొదుగులకు సోకే ఇన్ఫెక్షన్‌.. ఆ పాలు తాగితే దూడలు, ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? రాకుండా ఉండేందుకు ఏం చేయాలన్న దానిపై పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాడు. పరిశీలించిన కేంద్రం రాజేంద్రనగర్‌లోని పశువైద్య కళాశాల కేంద్రంగా పరిశోధనలు చేసేందుకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నుంచి గ్రాంట్‌ మంజూరు చేసింది. 2019-20 సంవత్సరానికి యువశాస్త్రవేత్త పురస్కారానికి ఎంపిక చేసింది.

- కుమ్మరి శ్రీశైలం, ఈనాడు డిజిటల్‌, నిజామాబాద్‌

దక్కిన గుర్తింపు

* న్యూదిల్లీలోని ఐసీజీబీలో ఉన్నప్పుడు దినేశ్‌ రాసిన పరిశోధక వ్యాసాలకు ‘ఉత్తమ పోస్టర్‌’ అవార్డు వచ్చింది.
* సీడీఆర్‌ఐ లక్నో కాన్ఫరెన్స్‌లో దినేశ్‌ పరిశోధనలు బెస్ట్‌ పోస్టర్‌, పబ్లికేషన్స్‌గా ఎంపికయ్యాయి.
* పరిశోధక వ్యాసాలు 15 అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని