మన వెంటే... కాలేజీ జోష్‌!

‘నామం పెట్టు.. నామం పెట్టు కాలేజీకి...’ నిన్నటి పాట. గతేడాది లాక్‌డౌన్‌తో కళాశాలలకు తాళాలు పడటంతో విద్యార్థులు బోర్‌, బోరుమంటున్నారు. నాలుగ్గోడల మధ్య ఇమడలేక, ఆన్‌లైన్‌ క్లాసులతో వేగలేక ‘ఆ రోజులే వేరు’ అని పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. ఒకట్రెండు వారాలు, నెలలు అయితే ఎవరికైనా ఓకే. ఏళ్లకొద్దీ ఇంట్లోనే గడపాలంటే యూత్‌కి మహా కష్టం. కాలేజీకెళ్తే ఫ్రెండ్షిప్‌లు, గాసిప్‌లు, చదువులు, కొలువు ఆశలతో రోజునో క్షణంలా గడిపేయొచ్చు.

Published : 03 Jul 2021 01:29 IST

బ్యాక్‌ బెంచీ బాతాఖానీలు లేవు... క్యాంటీన్‌లో గాసిప్‌లు గాయబ్‌... క్లాసుకెళ్తే ‘క్రష్‌’ కనించదు... భుజం భుజం రాసుకునే స్నేహితులే ఉండరు... ఏడాదిన్నరగా  కాలేజీ విద్యార్థులవి ఎన్నెన్ని వెతలో! అయినా.. ఇప్పుడప్పుడే క్యాంపస్‌లు కళకళలాడేలా లేవు... మరెలా? ఈ బోర్‌డమ్‌కి చెక్‌ పెట్టే మార్గాలున్నాయా?
ఉన్న సమయాన్ని జాలీగా గడిపే దారులున్నాయా?
పదండి.. అలా ఓ చూపు చూద్దాం.

‘నామం పెట్టు.. నామం పెట్టు కాలేజీకి...’ నిన్నటి పాట. గతేడాది లాక్‌డౌన్‌తో కళాశాలలకు తాళాలు పడటంతో విద్యార్థులు బోర్‌, బోరుమంటున్నారు. నాలుగ్గోడల మధ్య ఇమడలేక, ఆన్‌లైన్‌ క్లాసులతో వేగలేక ‘ఆ రోజులే వేరు’ అని పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. ఒకట్రెండు వారాలు, నెలలు అయితే ఎవరికైనా ఓకే. ఏళ్లకొద్దీ ఇంట్లోనే గడపాలంటే యూత్‌కి మహా కష్టం. కాలేజీకెళ్తే ఫ్రెండ్షిప్‌లు, గాసిప్‌లు, చదువులు, కొలువు ఆశలతో రోజునో క్షణంలా గడిపేయొచ్చు. కానీ జాలీ లైఫ్‌ని మిస్‌ అవుతూ నిస్సారంగా ముందుకెళ్లడం.. ఉత్సాహం ఉరకలెత్తే యవ్వనులు ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి? ఈ గడ్డు కాలంలో పాత రోజుల్ని తిరిగి తీసుకురాలేంగానీ ఆ ఫన్‌ని భర్తీ చేసుకునే మార్గాలైతే కొన్ని ఉన్నాయి.

కలుసుకుందాం

నిన్నటిదాకా లాక్‌డౌన్‌. కాలు బయటపెట్టే అవకాశం లేదు. ఇప్పుడది లేదు. పుట్టినరోజు, అందరికీ కుదిరిన రోజు.. ఏదో ఒక సందర్భం పెట్టుకొని అంతా ఓచోటికి చేరితే సరదాలు, సంతోషాలు మళ్లీ మన ముఖాల్లో వికసించడం ఖాయం. మనసు విప్పి మాట్లాడుకుంటే.. ఒకరిపై ఒకరు జోకులు పేల్చుతుంటే క్లాసులో కూర్చున్నట్టే ఉంటుంది. పనిలో పనిగా తరగతిలో మన ‘క్రష్‌’లు కూడా ఈ పార్టీకి వస్తే కళ్లకి, మనసుకి పండగే. అన్నట్టు ముప్పు ఇంకా తొలగిపోలేదు. అంతా ఒకచోట చేరగానే ఆత్రంగా షేక్‌హ్యాండ్‌లు, కౌగిలింతలు అసలే వద్దు. కొంచెం దూరం పాటిస్తే భవిష్యత్తులో అంతా దగ్గరయ్యే రోజులెన్నో ఉంటాయి.

సమయం ఉంది మిత్రమా

పాఠాలు వినాలి.. పుస్తకాలు తిరగేయాలి.. ప్రాజెక్టు వర్క్‌ చేయాలి.. కాలేజీ ఉన్నప్పుడు మనమెంతో బిజీ. ఏం చేయాలన్నా నాకు ‘టైం లేదు’ అనుకునేవాళ్లం. ఇప్పుడా సీన్‌ లేదు. క్లాసుల నిడివి తగ్గింది. మైళ్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి వచ్చే సమయం కలిసొచ్చింది. ‘టైం ఉంటే మ్యూజిక్‌ నేర్చుకునేదాన్ని’ అనే అమ్మాయికి కుదురుతుంది. ‘కరాటే క్లాసులకు వెళ్లి ఉంటే ఇరగదీసే వాడ్ని’ అనే అబ్బాయి మురిపెం తీరుతుంది. ఎప్పట్నుంచో చదవకుండా వదిలేసిన పుస్తకాలు తిరగేయొచ్చు. ఇప్పుడు చేతల్లో చూపించే ‘సమయం’ వచ్చేసింది మిత్రమా. ప్రయత్నించండి.

బంధాలు బలీయం చేద్దాం

ఈ వయసు ఎంతో కీలకం. కన్నవాళ్లు పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. వాళ్ల భవిష్యత్తుకు చుక్కానిలా నిలవాలి. కానీ గతంలో అలా కుదిరే సందర్భం ఎక్కడుంది? మనం కాలేజీకెళ్తే.. పేరెంట్స్‌ ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీ. అంతా మన మంచికే అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. పిల్లాపెద్దా కలిసి ఉండటానికి బోలెడు సమయం చిక్కింది. మనసు విప్పి మాటలు పరిచే సందర్భం వచ్చింది. విద్యార్థులు పెద్దల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. అమ్మకి వంటలో సాయం చేస్తూ.. నాన్నకి పనుల్లో చేదోడుగా ఉంటే మంచి మార్కులు కొట్టేయొచ్చు. పనిలో పనిగా ఊరెళ్లి బామ్మ, అమ్మమ్మలతో కొన్నాళ్లు గడిపితే చెప్పలేనంత హ్యాపీ. పాతతరం నుంచి కావాల్సినన్ని జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. వాళ్ల ప్రేమలో తడిసి ముద్దై పోవచ్చు.

ఆన్‌లైన్‌ ఉందిగా

కరోనా ప్రమాదం ఇంకా ఉందని భావిస్తున్నారా? జాగ్రత్తగా ఉంటే తప్పేం లేదు. కానీ ‘బెస్టీ’ని చూసి ఎన్నో రోజులైందనే బెంగ.. ఫ్రెండ్‌ని చూసే ఛాన్సే లేదని బాధ పడుతున్నారా? కాలు బయట పెట్టకుండానే ఆ సరదా తీర్చుకునే మార్గం ఉందిగా! ఆన్‌లైన్‌ క్లాసుల్లాగే ఆన్‌లైన్‌ మీటింగ్‌లు పెట్టేసి క్యాంపస్‌ని రప్పించేయొచ్చు. అందరినీ ఒక్కచోటికి చేర్చే జూమ్‌లు, గూగుల్‌ మీట్‌లు, మైక్రోసాఫ్ట్‌ టీమ్‌లు ఉన్నాయిగా. టెక్నాలజీలో మనకంటే తోపులెవరు? దీన్ని ఎంచక్కా ఉపయోగించుకుంటే అంతా పక్కపక్కనే ఉన్నట్టు ఫీలైపోవచ్చు.

హీరోలైపోదాం

కొన్నాళ్లుగా నిస్సందేహంగా అందరికీ గడ్డుకాలమే. మనలో కొందరం బంధువులు, కుటుంబ సభ్యులు, ఆప్తుల్ని కోల్పోయాం. ఆ బాధేంటో మనకు తెలుసు. మనలాంటి వాళ్లెందరో ఉన్నారు. దీన్నో అవకాశంగా మలచుకొని బాధితులకు భరోసానిద్దాం. చేతనైన సాయం చేద్దాం. కరోనా బాధితులకు మందులు అందించడం దగ్గర్నుంచి.. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సేవా సైనికుల్లా అహర్నిశలు శ్రమిస్తున్న కాలేజీ విద్యార్థులకు లెక్కే లేదు. మీరూ అదే దారిలో వెళ్తే మనసున్న మారాజులుగా మారిపోవచ్చు. కష్టాల నుంచి గట్టెక్కించవచ్చు.

ఏమేం మిస్‌ అవుతున్నామంటే..

* క్లాసులు ఉన్నప్పుడు కాలేజీకి బంక్‌ కొడితే వచ్చే మజా.

* క్యాంటీన్‌లో వేడివేడి సమోసాలు, అల్లం చాయ్‌.

* పోటీలు, వార్షికోత్సవాలు, టూర్లు, ఫ్రెషర్స్‌ని ఆట పట్టించడాలు.

* లైబ్రరీలో కూర్చొని గంటలకొద్దీ పుస్తకాలు చదవడం.

* కాలేజీ చేరేదాకా బస్‌లో కూర్చొని చెప్పే కబుర్లు.

* క్లాసు క్లాసుకి మధ్య చిన్నగా తీసే కునుకు.

* లంచ్‌లో చిరుతిళ్లు, క్యారేజీలు పంచుకోవడం.

* అపరిమితంగా కాలేజీ వై-ఫై వాడుకోవడం.

ఆ రోజులే వేరు

విద్యాసంస్థలు మూతపడటంతో మేం చాలా మిస్‌ అవుతున్నాం. ఫ్రెండ్స్‌ని కలవడం లేదు. రీఫ్రెష్‌మెంట్‌ కోసం కాలేజీలో అప్పుడప్పుడు చిన్నచిన్న కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహించేవాళ్లు. భలే సరదాగా అనిపించేది. ఉత్సాహంగా పాల్గొనేవాళ్లం. ఆరోజులు పోయాయి. నాలుగు గోడల మధ్య కూర్చొని స్మార్ట్‌ఫోన్‌లో పాఠాలు వినడం బోరింగ్‌గా ఉంది. క్లాస్‌మేట్స్‌ ఒకర్నొకరం చూడాలనుకున్నప్పుడు జూమ్‌లో, ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో చిన్నపాటి మీటింగ్‌ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు సమయం కూడా చాలా మిగులుతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు బాగా చదువుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరారు. ఇంకొంతమంది ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. కాలేజీ ఉన్నప్పుడు ఏదో వంకతో క్లాసులు బంక్‌ కొట్టేవాళ్లం. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా పరిస్థితి బాగా లేకపోవడంతో బయటికెళ్లడానికి పేరెంట్స్‌ ఒప్పుకోవడం లేదు. ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు.

- కె.విజయదుర్గ, బీటెక్‌ ఫైనలియర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని