ప్రేక్షకుడి నాడి పట్టిన డాక్టర్‌

గాడ్‌ఫాదర్లు లేరు.. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం అంతకన్నా కాదు. తెర వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కసే.. రంగుల ప్రపంచంపై ఇష్టం పెంచింది. బాగా చదివే అలవాటే.. మంచి కథలు రాసేలా చేసింది. నాడి పట్టే డాక్టర్‌ పట్టా చేతికందినా.. ప్రేక్షకుడి నాడి పట్టే మెగాఫోనే ముఖ్యమనుకున్నాడు.

Published : 15 Dec 2023 23:49 IST

గాడ్‌ఫాదర్లు లేరు.. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం అంతకన్నా కాదు. తెర వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కసే.. రంగుల ప్రపంచంపై ఇష్టం పెంచింది. బాగా చదివే అలవాటే.. మంచి కథలు రాసేలా చేసింది. నాడి పట్టే డాక్టర్‌ పట్టా చేతికందినా.. ప్రేక్షకుడి నాడి పట్టే మెగాఫోనే ముఖ్యమనుకున్నాడు. సీన్‌ కట్‌ చేస్తే... ‘హాయ్‌ నాన్న’ దర్శకుడిగా మనముందున్నాడు కోడూరి శౌర్యువ్‌. ఈ స్థాయికి చేరడానికి చేసిన ప్రయాణాన్ని ‘ఈతరం’తో పంచుకున్నాడు.

 ‘హాయ్‌ నాన్నా’ ప్రేక్షకుల మనసుల్ని మెలిపెడుతోంది. సినీ జనాలకీ తెగ నచ్చేసింది. మొదటి చిత్రంతోనే ఇంత మ్యాజిక్‌ చేసింది ఎవరా? అని చాలామంది ఆరా తీస్తున్నారు. అల్లు అర్జున్‌లాంటి కమర్షియల్‌ హీరోలూ ఈ కథలోని సెంటిమెంటుకి ఫిదా అవుతున్నారు. అందర్నీ కదిలిస్తున్న ఈ కథకి ప్రాణం పోసింది శౌర్యువ్‌నే.

 వైజాగ్‌ కుర్రాడు

ఒక గాఢమైన కోరిక మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఏదైనా వదులుకునేలా చేస్తుంది. దానికి సాక్ష్యం శౌర్యువ్‌నే. పుట్టిపెరిగిందీ, చదివిందీ విశాఖపట్నంలోనే. చాలామందిలాగే చిన్నప్పట్నుంచే తనకి సినిమాలంటే బాగా ఇష్టం. ఇది ఎంత లోతుగా ఉండేదంటే.. ఆరోతరగతి పూర్తయ్యేసరికే సినిమాకి కెప్టెన్‌ దర్శకుడు.. తెర వెనక ఉండి అందర్నీ నడిపించేది అతడే.. అని తెలుసుకునేంత. అప్పుడే.. నేను ఎప్పటికైనా దర్శకుడు కావాలనే లక్ష్యం పెట్టుకునేంత క్లారిటీ వచ్చేసింది. ఆ ఆశ కుదురుగా ఉండనిస్తుందా? విశాఖ చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్‌ జరిగినా వాలిపోయేవాడు. ప్రతీదీ ఆసక్తిగా గమనించేవాడు. మరోవైపు సినిమాల కోసం ఇంటర్‌ నుంచే క్లాసులు డుమ్మా కొట్టడం.. పరిపాటైంది. కొత్త సినిమా విడుదలైతే.. మొదటిరోజు, మొదటి ఆటకి థియేటర్లో ఉండాల్సిందే. మెడిసిన్‌కి వచ్చేసరికి ఇది పీక్‌కి చేరింది. మొదటి తరగతి అనాటమీ క్లాసు. దానికి డుమ్మా కొట్టి మార్నింగ్‌ షోకి వెళ్లి సైలెంట్‌గా వచ్చి కూర్చునేవాడు. అప్పుడే తన స్నేహితులనే పాత్రలుగా మలచి కథలు రాసుకునేవాడు. వాటిని ప్రోత్సహించేది, విమర్శించేదీ ఆ స్నేహితులే. ఇదంతా కన్నవాళ్ల దృష్టికొచ్చేది. ‘ముందు మెడిసిన్‌ పూర్తి చెయ్‌.. తర్వాత సినిమాల సంగతి చూద్దువులే’ అన్నారు శౌర్యువ్‌ అమ్మ. ఎంబీబీఎస్‌ పూర్తైతే సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. అందులోనే కెరియర్‌ వెతుక్కుంటాడు అనుకున్నారామె. కానీ అప్పటికే.. సినిమానే నా కెరియర్‌, జీవితం అని ఫిక్సయ్యాడు శౌర్యువ్‌. తల్లి కోరుకున్నట్టే డాక్టరు అయ్యాడుగానీ.. తర్వాత అడుగు, మనసు చెప్పినట్టే వేశాడు.

విజయేంద్రప్రసాద్‌ అండతో...

మెడిసిన్‌ పూర్తవగానే 2013లో హైదరాబాద్‌లో దిగిపోయాడు. నేరుగా వెళ్లి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ని కలిశాడు. ఆయన గతంలో షూటింగ్‌ కోసం ఎప్పుడైనా వైజాగ్‌ వచ్చినప్పుడు.. శౌర్యువ్‌ అభిమానంతో వెళ్లి కలిసేవాడు. తాను రాసిన కథలు చూపించేవాడు. ఆయన బాగున్నవాటిని మెచ్చుకునేవారు. ఆ పరిచయంతో విజయేంద్రప్రసాద్‌ దగ్గర శిష్యుడిగా చేరాడు. సినిమా కథ అంటే ఏంటి? స్క్రీన్‌ప్లే ఎలా రాయాలి? డైలాగులు ఆకట్టుకునేలా ఎలా ఉండాలి?.. ఇవన్నీ నేర్చుకున్నాడు. వీటన్నింటిపై ఒక అవగహన వచ్చాక సొంతంగా కథలు రాసుకోవడం ప్రారంభించాడు. ఆపై దర్శకత్వంపై దృష్టి పెట్టాడు. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాణంలో వచ్చిన ‘క్రాస్‌రోడ్స్‌’కి రచయిత, సహాయ దర్శకుడిగా పని చేశాడు. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’కి అసోసియేట్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ఆ రకంగా దర్శకత్వ విభాగంలోనూ కొంత అనుభవం సంపాదించాడు.

అలా ‘హాయ్‌ నాన్న’

తనకున్న అనుభవంతో.. దర్శకుడిగా అవకాశమివ్వమంటూ నిర్మాణసంస్థల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. అప్పటికే తన దగ్గర నాలుగైదు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఓ కమర్షియల్‌ ఫార్ములా కథతో సినిమా బోణీ కొట్టాలనేది శౌర్యువ్‌ ఆశ. పరిచయస్తుల ద్వారా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేతలను కలిశాడు. ఓ కథ చెప్పాడు. ‘కథ బాగానే ఉందిగానీ దీనికి బడ్జెట్‌ ఎక్కువ అయ్యేలా ఉంది. కొత్తవాడివి నిన్ను నమ్మి ఏ హీరో అయినా ముందుకొస్తారా? వేరే కథేదైనా ఉందా?’ అన్నారు. వెంటనే ‘హాయ్‌ నాన్న’ చెప్పాడు. ఇది మరింత బాగా నచ్చింది. నటుడు నాని దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన రెండో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకున్నారు. కొత్తవాడైనా శౌర్యువ్‌పై నమ్మకంతో.. ఇతర పాత్రలకు నటీనటుల ఎంపిక నుంచి అన్నింట్లో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తొంభై ఐదు రోజుల్లో సినిమా పూర్తైంది. ఈ షూటింగ్‌ రోజులు నా జీవితంలో గోల్డెన్‌ డేస్‌ అంటాడు శౌర్యువ్‌. ఆ సమయంలో నటీనటులు, టెక్నీషియన్స్‌ అంతా ఓ కుటుంబంలా కలిసిపోయారట. ముఖ్యంగా చిత్రంలోని పాప కియారా.. బాగా పని చేసి అలసిపోయిన అందరికీ ఒక రిలీఫ్‌లా ఉండేదంటూ షూటింగ్‌ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటాడు.ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత శౌర్యువ్‌ పేరు మార్మోగిపోతోంది. అందరి మనసుల్ని తాకిన ఈ సినిమా.. అటు కమర్షియల్‌గానూ దూసుకెళ్తోంది.  

రాటు దేల్చిన అనుభవాలు

సినిమా కల మొదలైన దగ్గర్నుంచి దాన్ని నెరవేర్చుకునే వరకు సినిమా కష్టాలేం లేవా? అంటే ‘సినిమాల్లో రాణించాలని వచ్చే ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరగడం.. మోసపోవడం.. ఇవన్నీ ఉంటాయి. ఉంటాయని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ తెలుసు. లక్ష్యం చేరే క్రమంలో వీటిని సాధారణ విషయాల్లాగే చూస్తారు తప్ప కష్టాల్లా భావించరు’ అంటూ తనకూ అలాంటి అనుభవాలు ఉన్నాయని చెప్పకనే చెబుతాడు శౌర్యువ్‌. ‘నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లంతా నవ్వుకున్నారు. మంచి కెరియర్‌ని వదిలి ఎందుకు వెళ్లడం అని సలహా ఇచ్చారు. అలా వెనక్కిలాగే వాళ్లే.. మనలో సాధించాలనే కసిని పెంచుతారు. అదీ ఒకరకంగా మన మంచికే అనుకోవచ్చు. అలా సలహాలిచ్చినవాళ్లే.. శౌర్యువ్‌ మావాడంటూ నా విజయాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు’ అంటూ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తున్నాడు.


1. నా పూర్తిపేరు కోడూరి యువరాజ్‌ శౌర్య సింహా. శౌర్యువ్‌గా నేనే మార్చుకున్నా.
2. పుస్తకాలు బాగా చదువుతా. ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌.. అన్నీ. జేకే రౌలింగ్‌ నాకిష్టమైన రచయిత్రి.
3. సినిమా బాగుందని చాలామంది ప్రశంసించారు. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ వీడియో మెసేజ్‌ పెట్టడమే కాదు.. హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలుద్దాం అనడం సంతోషంగా ఉంది.
4. ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సుకుమార్‌, శేఖర్‌ కమ్ముల.. ఇలాంటి గొప్పవారితో పాటు ప్రతిభావం తులైన యువ దర్శకులు ఎంతోమంది ఉన్నారు. అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరి నుంచీ ఎంతో నేర్చుకోవచ్చు.
5. ఒక లక్ష్యం అనుకుంటే దానికి బోలెడన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినా మనసు పెట్టి పని చేస్తుంటే అన్నీ కలిసొస్తాయి. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని